పొలిటికల్‌ గుత్తేదారు

ABN , First Publish Date - 2021-03-04T05:51:56+05:30 IST

బడా రాజకీయ నేతల అండదండలు అలాగే వారి బినామీ రూపంలో ఓ కాంట్రాక్టర్‌ పీఎంజీఎస్‌వై కింద నిర్మిస్తున్న రోడ్డుపనులకు అక్రమంగా చెరువుమట్టిని వినియోగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

పొలిటికల్‌ గుత్తేదారు
ఆడిచెరువులో మొరం తవ్వకాలు

పీఎంజీఎస్‌వై రోడ్డు కోసం అక్రమ తవ్వకాలు 

యథేచ్ఛగా చెరువుమట్టి తరలింపు 

హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు 

రాజకీయఅండతో ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్‌ 

లోకేశ్వరం, పెండ్‌పల్లి రోడ్డు నిర్మాణ పనుల్లో భారీగా  అవకతవకలు 

నిర్మల్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : బడా రాజకీయ నేతల అండదండలు అలాగే వారి బినామీ రూపంలో ఓ కాంట్రాక్టర్‌ పీఎంజీఎస్‌వై కింద నిర్మిస్తున్న రోడ్డుపనులకు అక్రమంగా చెరువుమట్టిని వినియోగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. చెరువుల్లో తవ్వకాలు చేపట్టవద్దని, చెరువులకు రక్షణ కల్పించాలంటూ రెవెన్యూ అధికారులకు హైకోర్టు చేసిన హెచ్చరికలు బేఖాతరవుతున్నాయంటున్నారు. పొలిటికల్‌ గుత్తేదారులు అటు అధికారులపై ఒత్తిళ్లుతెస్తూ హైకోర్టు హెచ్చరికలను పక్కన పెడుతూ దర్జాగా చెరువుమట్టిని తవ్వుతూ రోడ్డుపనికి వాడుకుంటున్నప్పటికీ కనీసం ఈ దిశగా విచారణ గాని, చర్యలు గాని కరువయ్యాయంటున్నా రు. లోకేశ్వరం మండల కేంద్రం నుంచి పెండ్‌పల్లి వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద రూ.5.45 కోట్ల వ్యయంతో రోడ్డు పనిని చేపడుతున్నారు. అయితే ఈ పనులు చేపట్టే కాంట్రాక్టర్‌ జిల్లాలోని ఓ బడానాయకునికి బినామీగా కూడా వ్యవహరిస్తున్నారంటున్నారు. ఆ బడానాయకుని అండదండలతోనే సదరు కాంట్రాక్టర్‌ రెచ్చిపోతూ అధికారులు, గ్రామస్థుల సాక్షిగానే సమీపంలోని సాత్‌గాం ఆడి చెరువు నుంచి అక్రమంగా ఎర్రమట్టిని తరలించుకుపోతున్నారు. హద్గాం సాత్‌గాం శివారులో ఉన్న ఈ చెరువులో సదరు గుత్తేదారు జేసీబీని ఏర్పాటు చేసి బహిరంగంగా మొరంను టిప్పర్‌లలో తరలించి రోడ్డు పనికి వాడుకుంటున్నారంటున్నారు. ఇప్పటికే పెద్దఎత్తున చెరువులోని ఎర్రమట్టిని తరలించుకుపోవడంతో ఈ చెరువు ప్రాంతమంతా పెద్దగోతులుగా మారిపోయింది. ఈ ఎర్రమట్టి తరలింపు కారణంగా ఈ చెరువు స్వరూపమే కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే పలువురు చెరువులోని ఎర్రమట్టి తవ్వకాలు, తరలింపుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారని అయినప్పటికి అధికారులు రాజకీయ ఒత్తిడి కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు రూ.5 కోట్లకు పైగా నిధులతో చేపడుతున్న లోకేశ్వరం-పెండ్‌పల్లి రోడ్డు నిర్మాణానికి మొత్తం ఈ చెరువులోని ఎర్రమట్టి, మొరంను వాడేందుకు సదురు గుత్తేదారు ప్లాన్‌ వేసినట్లు పేర్కొంటున్నారు. జిల్లాలో ఇప్పటికే అనేక చెరువులు విధ్వంసమైన నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకొని చెరువులోని మట్టిని తరలించవద్దని, చెరువు భూములను రక్షించాలని స్వయంగా జిల్లా కలెక్టర్‌నే ఆదేశించింది. అయితే కలెక్టర్‌ సైతం మండల తహసీల్దార్‌లను, ఇరిగేషన్‌ అధికారులను, పంచాయతీ రాజ్‌ అధికారులను అప్రమత్తం చేసి చెరువులను కాపాడాలంటూ ఆదేశించారు. మండలస్థాయి అధికారులు మాత్రం అటు హైకోర్టు ఇటు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలను తుంగలో తొక్కుతూ రాజకీయ అండదండలున్న గుత్తేదారుకు వంతపాడుతుండడం పలు 


అనుమానాలకు తావిస్తోంది. 

పొలిటికల్‌ గుత్తేదారు ఆధిపత్యం

కాగా లోకేశ్వరం-పెండ్‌పల్లి రోడ్డు పనులను పీఎంజీఎస్‌వై పథకంలో భాగంగా చేపడుతున్న సదరు గుత్తేదారుకు రాజకీయంగా పెద్దఎత్తున అండదండలున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ అండదండలతోనే సదరు గుత్తేదారు అధికారులను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా చెరువులోని ఎర్ర మట్టిని తరలించుకుపోతున్నాడన్న ఫిర్యాదులున్నాయి. లోకేశ్వరం నుంచి పెండ్‌పల్లి వరకు రూ. 5.45 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రోడ్డు కోసం అవసరమైన ఎర్రమట్టి క్వారీని దూరప్రాంతంలో చూపారు. అయితే దూరప్రాంతం నుంచి ఎర్రమట్టిని తీసుకురావడం వ్యయంతో కూడుకుంటున్నందున ఈ గుత్తేదారు కన్ను హద్గాంసాద్గాం శివారులో ఆడి చెరువుపై పడిందంటున్నారు. ఈ చెరువులోని మట్టిని తనకున్న రాజకీయ పలుకుబడితో కాజేసేందుకు పథకం రూపొందించారు. దీనికి అనుగుణంగా రాజకీయనేతతో అధికారులపై ఒత్తిడి తెప్పించి మట్టి తరలింపుకు అనధికారిక మౌకిక అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నారు. కేవలం రెవెన్యూ అధికారులే కాకుండా పోలీసులు సైతం ఇటు వైపు దృష్టి సారించకపోవడానికి రాజకీయ ఒత్తిడులే కారణమంటున్నారు.  

హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు

గత కొంతకాలం నుంచి జిల్లాలోని చారిత్రక చెరువులు యథేచ్చగా కబ్జాలకు గురవుతుండడం ఆ చెరువుల్లోని మట్టిని తరలించుకుపోతుండడంపై కొంతమంది రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సీరియస్‌గా స్పందించి చెరువులను, చెరువు భూములను కాపాడాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు సైతం తీసుకోవాలంటూ సంబంధిత యంత్రాంగాన్ని హెచ్చరించింది. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవంటూ కూడా వార్నింగ్‌ జారీ చేసింది. నిర్మల్‌ పట్టణంలోని అక్రమణకు గురైన చెరువులను స్వయంగా సందర్శించి విచారణ జరిపి నివేదికలు అందించాలంటూ జిల్లా జడ్జీని, అలాగే కలెక్టర్‌ను రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన సంగ తి తెలిసిందే. దీంతో సంబంధిత అధికారులు తమ తమ పరిధిలోని చెరువు భూములను కాపాడేందుకు రంగంలోకి దిగి ప్రాథమికంగా చర్యలు చేపట్టారు. అయితే రాజకీయ ప్రమేయం, బడానేతల ఒత్తిళ్ల కారణంగా ఆ ప్రాథమిక చర్యలన్నీ మళ్లీ మసకబారుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు చెరువులకు హద్దులను కూడా ఏర్పాటు చేసినప్పటికి ఇటు ఆక్రమణలు, మట్టి తరలింపు వ్యవహారాలు మాత్రం నిలిచిపోవడం లేదంటున్నారు. ఇందులో భాగంగానే లోకేశ్వరం మండలం లోని ఆడి చెరువు నుంచి అ క్రమంగా మొరం ను తరలించుకుపోతున్నారంటున్నారు. హద్గాం సద్గాం శివారులో ఉన్న చెరువు నుంచి యథేచ్చగా సదరు గుత్తేదారు జెసీబీలు, టిప్పర్‌ల ద్వారా మొరం ను తవ్వి తరలించుకుపోతున్నారు. అయితే అధికారులు మాత్రం ఇటు వైపు కన్నెత్తి చూడకపోతుండడం కోర్టు ఉత్తర్వుల ధిక్కరణకు పాల్పడుతున్నట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పీఎంజీఎస్‌వై నిబంధనలకు తూట్లు

ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద కోట్లాది రూపాయలతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో గుత్తేదారులు నిబంధనలకు తూట్లు పొడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి కేంద్ర ప్రభుత్వం మంజూరయ్యే ఈ నిధుల వ్యయానికి నిర్థిష్టమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే రాజకీయ నాయకులు తమ బినామీల పేరిటా ఈ రోడ్డు పనులను దక్కించుకుంటుండడం నిబంధనల ఉల్లంఘనకు దోహదపడుతోందంటున్నారు. ఎవరైనా అధికారులు నిబంధనలపై కఠినంగా వ్యవహారించేందుకు సిద్దమైతే వారిపై బదిలీ వేటు కూడా సిద్దంగా ఉంటుందంటున్నారు.

అనుమతులు ఇవ్వలేదు

లోకేశ్వరం మండలంలో పీఎంజీఎస్‌వై పథకం కింద జరుగుతున్న రోడ్డు నిర్మాణానికి చెరువు నుంచి మొరంను తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. చెరువుల నుంచి అక్రమంగా మొరంను తరలిస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటాము. 

- రామారావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, నిర్మల్‌ జిల్లా

నాకేం తెలియదు..

ఈ విషయమై లోకేశ్వరం మండల పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ రఘును సంప్రదించగా పిఎంజిఎస్‌వై పథకం కింద చేపడుతున్న రోడ్డు నిర్మాణానికి వినియోగించే మొరాన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారో తనకు తె లియదన్నారు. నిబంధనల ప్రకారం పది కిలోమీటర్ల పరిధి నుంచి మొరాన్ని తీసుకువచ్చేందుకు వీలు కల్పించామన్నారు. చెరువుల నుంచి మొరం తీసుకురావడం చట్ట విరుద్దమన్నారు. 

- రఘు, పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌, లోకేశ్వరం 


Updated Date - 2021-03-04T05:51:56+05:30 IST