ప్రత్యేక హోదాపై రాజకీయ కంఠశోష

ABN , First Publish Date - 2021-04-06T05:58:54+05:30 IST

ఒక పెద్ద అబద్ధాన్ని ప్రచారం చేసి దానికి విశ్వసనీయత కల్పించేందుకు అద్భుతమైన అసత్యాలను వ్యాప్తి చేయడం ద్వారా అనుకున్న ఫలితాలను...

ప్రత్యేక హోదాపై రాజకీయ కంఠశోష

ఒక పెద్ద అబద్ధాన్ని ప్రచారం చేసి దానికి విశ్వసనీయత కల్పించేందుకు అద్భుతమైన అసత్యాలను వ్యాప్తి చేయడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధిస్తామని భావిస్తే అది మూర్ఖత్వమవుతుందని జర్మనీలో హిట్లర్ ప్రభుత్వంలో సమాచార మంత్రిగా ఉన్న గోబెల్స్ కొన్ని దశాబ్దాల క్రితమే నిరూపించాడు. ప్రతి సారీ అందర్నీ మోసపుచ్చలేమని గ్రహించేలోపే హిట్లర్ పర్వం ముగిసి గోబెల్స్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కొందరు రాజకీయ నాయకులు గోబెల్స్‌ను మించిన వారని ప్రత్యేక హోదా విషయంలో వారు చేస్తున్న రచ్చను చూస్తే అర్థమవుతుంది, ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయంగా మార్చడం వల్ల ఎన్నికల్లో ప్రయోజనాలు పొందలేరన్న విషయం గత అసెంబ్లీ ఎన్నికల్లోనే నిరూపితమైంది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రత్యేక హోదాను ఒక ప్రధాన అంశంగా మార్చి ఎంత ఊదరగొట్టినా ప్రజలు ఆ పార్టీని ఆదరించలేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ ప్రత్యేక హోదా విషయాన్ని రాజకీయ అంశంగా మార్చాలని ప్రయత్నిస్తే నాడు తెలుగుదేశానికి పట్టిన గతే రేపు వైసీపీకీ పట్టక మానదు. ఎందుకంటే ప్రజల దృష్టిలో పెద్దగా విలువలేని అంశాన్ని బ్రహ్మాండమైన సమస్యగా చిత్రిస్తూ, మాటిమాటికీ అదే విషయం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు హర్షించబోరన్న విషయం చరిత్ర రుజువు చేసింది,


ఇటీవల పుదుచ్చేరి ఎన్నికల్లో బిజెపి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత హోదా కల్పిస్తామన్న హామీ కనిపించడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, టీడీపీ నేతలకు ఎక్కడ లేని కాక పుట్టుకొచ్చింది. పుదుచ్చేరి ఒక కేంద్ర పాలిత ప్రాంతమని, దానికి కల్పించాలనుకుంటున్న హోదా జమ్మూ కశ్మీర్‌కు ప్రస్తుతం లభిస్తున్న హోదాలాంటిదేనని మేనిఫెస్టోలో స్పష్టంగా ఉన్నప్పటికీ– దాన్ని గతంలో ఏపీకి కల్పిస్తామన్న ప్రత్యేక హోదాతో పోల్చి హంగామా సృష్టించడమంటే విషయాన్ని మసిపూసి మారేడు కాయ చేసినట్లే అవుతుంది. ఒక ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీకి, కేంద్రప్రభుత్వం చేసే హామీకి చాలా తేడా ఉంటుంది. కేంద్రప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు అనేక పూర్వాపరాలు ఆలోచిస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన వాటిలో ఆచరణ సాధ్యమైనవే అమలులోకి పెట్టడానికి ఆస్కారం ఉన్నది. నిజానికి ఒకప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. కాని కేంద్రంలో అధికారంలోకి వచ్చాక 14వ ఆర్థిక సంఘం నివేదిక నేపథ్యంలో ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం వల్లనే ఏపీ సమస్యలు పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం ఏర్పడింది. ఒక దశలో కేంద్రప్రభుత్వం ఇస్తామన్న కొన్ని లక్షల కోట్ల ప్యాకేజీని అంగీకరించిన చంద్రబాబు ప్రత్యేక హోదా సర్వరోగనివారిణి కాదని స్పష్టం చేశారు. కాని ఆయనే ఎన్నికల సమయం వచ్చే సరికి ప్రత్యేక హోదాను రాజకీయం చేయాలనుకున్నారు.


చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంపై ఎటువంటి చట్టం చేయలేదు. అప్పటి ప్రణాళికా సంఘం కానీ, జాతీయ అభివృద్ధి మండలి కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ ఇవ్వని దాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం ఇవ్వాలంటూ రాజకీయం చేయడమే కొన్ని పార్టీలు పనిగా పెట్టుకున్నాయి.


ఏపీకి మోదీ ద్రోహం చేశారని శుష్క ఆరోపణలుచేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్‌తో పాటు నాడు ఏపీకి ప్రాతినిధ్యం వహించిన 33 మంది కాంగ్రెస్ ఎంపీలు చేసింది ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌కు ఏమి అవసరమో వీరిలో ఒక్కరైనా అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి చేశారా? మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీ సమస్య గురించి ప్రత్యేకంగా ఆలోచించినందువల్లనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వసంస్థలు, ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు దక్కినన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ రాష్ట్రానికీ దక్కలేదు. దేశంలో ఏ రాష్ట్రానికీ మంజూరు కానన్ని ఇళ్లు ఏపీకి మంజూరయ్యాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) క్రింద ఆంధ్రప్రదేశ్‌కు 20,28,899 ఇళ్లు మంజూరు చేసి రూ.9,311 కోట్లు విడుదల చేస్తే, ఇంతవరకు 3,60,325 ఇళ్లు మాత్రమే నిర్మించారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 65 వేల కోట్లతో వివిధ రహదారి ప్రాజెక్టులను చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాదిమందికి పింఛన్లు, అసంఘటిత కార్మికులకు జీవిత బీమా, లక్షలాదిమందికి ఉజ్వల యోజన క్రింద గ్యాస్ సిలిండర్లు లభిస్తున్నాయంటే అది కేంద్రప్రభుత్వ చలవే. అమృత్ మిషన్ క్రింద రూ.3334 కోట్ల కేంద్ర సహాయంతో ఏపీలో 226 ప్రాజెక్టులు అమలు అవుతున్నాయి. జన్ ధన్ యోజన క్రింద మార్చి 31 నాటికి ఏపీలో 11,294,106 లక్షలమంది ఖాతాల్లో నేరుగా రూ.3,260.91ల కోట్లు విడుదలయ్యాయి. 14వ ఆర్థిక సంఘం గాడ్గిల్ ఫార్ములా ఆధారంగా రాష్ట్రాలకు గ్రాంట్లను మంజూరు చేసే విధానాన్ని మానుకోవడంతో ఏపీకి రెవిన్యూ లోటు లేకుండా చేయాలని నిర్ణయించింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రెవిన్యూ లోటు ఏర్పడిందని తెలిసినందువల్లే, 2015–-20 మధ్య ఈ లోటు పూరించేందుకు రూ.22,113 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ ను మంజూరు చేసింది. ఒక రకంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది.


విషాదకరమైనదేమిటంటే ప్రత్యేక హోదా కావాలని ఇవాళ గొంతెత్తి అరుస్తున్న వైసీపీ నేతలు తమ రాష్ట్రంలో కోట్లాది రూపాయల మొత్తాన్ని పప్పుబెల్లాలుగా పంచిపెడుతూ ఆర్థిక వ్యవస్థను గుల్లచేస్తున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాలను నీరు కారుస్తున్నారు. సంపద సృష్టించే కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపట్టాల్సిన ఆంధ్రప్రదేశ్‌లో సంపదను కొల్లగొట్టడం మినహా జరుగుతున్నది ఏమీ లేదు. మంత్రులు, పార్టీ కార్యకర్తలు ఇసుక, మద్యం, భూదందాలు, ఆక్రమణల పేరిట వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు, అంతర్గత  వనరుల కల్పన ఆంధ్రప్రదేశ్‌లో అతి తక్కువ అయితే నిధుల దుర్వినియోగం, ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం ఉన్న వనరుల్ని దుబారా చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.73,912 కోట్ల మేరకు అప్పులు చేశారని, గత నవంబర్ వరకు మొత్తం 3,73,140 కోట్ల భారం ఆంధ్రప్రదేశ్‌పై ఉన్నదని కాగ్ నివేదిక ఎత్తి చూపింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైసీపీకి ప్రత్యేక హోదా అన్నది సాకుగా దొరికింది. ఇప్పటికే అందినది అందినట్లు దోపీడి చేస్తున్న వారి ధన దాహాన్ని ఏ హోదా కూడా తీర్చలేదన్నది జగమెరిగిన సత్యం.


భారీ ఎత్తున డబ్బు సంచులు పంచి, ప్రత్యర్థులను భయభ్రాంతుల్ని చేసి, అధికార వ్యవస్థను దుర్వినియోగపరిచి స్థానిక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన తనకు ప్రజాబలం ఉన్నదని జగన్మోహన్ రెడ్డి భావిస్తే అది అమాయకత్వమే అవుతుంది. జగన్ వర్గీయులే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్నారు, అవకాశం వస్తే మరో బలమైన ప్రత్యామ్నాయ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ దేశమంతా భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజాభిమానం వెల్లువలా కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో బిజెపికి సానుకూల పవనాలు వీస్తుండగా, కేరళ, తమిళనాడులలో కూడా బిజెపి బలం పుంజుకోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా బిజెపియే ప్రజలకు ఆశాదీపంగా కనిపించే రోజులు ఆసన్నమవుతున్నాయి. ఇప్పటికైనా మోదీ ఆర్థిక విధానాలు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై వైసీపీ నేతలు గోబెల్స్ ప్రచారం ఆపి నిర్మాణాత్మక కార్యక్రమాలు అమలు చేస్తే విశ్వసనీయత నిలబెట్టుకోగలుగుతారు.


వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2021-04-06T05:58:54+05:30 IST