జడ్పీ బదిలీల్లో రాజకీయ రచ్చ

ABN , First Publish Date - 2022-07-03T06:08:33+05:30 IST

జిల్లా పరిషత్‌లో బదిలీల ప్రక్రియ అధికారపార్టీ నేతల సిఫార్సులకు అనుగుణంగానే సాగినట్లు విమర్శలు వస్తున్నాయి. పలుచోట్ల అధికార పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా దర్శి నియోజకవర్గ ఎంపీడీవో ల బదిలీల వ్యవహారంపై ఎమ్మెల్యే వేణుగో పాల్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.

జడ్పీ బదిలీల్లో రాజకీయ రచ్చ

చక్రం తిప్పిన బూచేపల్లి 

ఎమ్మెల్యేకి తెలియకుండా దర్శి,  ముండ్లమూరు ఎంపీడీవోల బదిలీ 

అమీతుమీకి సిద్ధమైన మద్దిశెట్టి

 (ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లా పరిషత్‌లో బదిలీల ప్రక్రియ అధికారపార్టీ నేతల సిఫార్సులకు అనుగుణంగానే సాగినట్లు విమర్శలు వస్తున్నాయి. పలుచోట్ల అధికార పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా దర్శి నియోజకవర్గ ఎంపీడీవో ల బదిలీల వ్యవహారంపై ఎమ్మెల్యే వేణుగో పాల్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఈ అంశాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ఆయన సిద్ధమైనట్లు చెప్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి జడ్పీ చైర్‌పర్సన్‌గా బూచేపల్లి వెంకాయమ్మ ఉన్నారు. సమావేశాలకు కోఆప్షన్‌ సభ్యుడిగా నియమితులైన ఆమె కుమారుడు శివప్రసాద్‌రెడ్డిదే అనధికారికంగా పెత్తనం అనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో  జిల్లా పరిధిలోని ఎంపీడీవోలతోపాటు ఆయా స్థాయి అధికారుల బదిలీల ప్రక్రియ పూర్తిచేశారు. 


ఎంపీడీవోల విషయంలోనే రగడ

కీలకమైన ఎంపీడీవోల బదిలీల విషయం లోనే అధికార పార్టీలో రచ్చ ప్రారంభమైంది. దర్శి, ముండ్లమూరు ఎంపీడీవోల బదిలీ లు తన ప్రమేయం లేకుండా జరిగాయ ని ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే దర్శిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా బదిలీల అంశం రాగా ఎమ్మెల్యే సిఫార్సు లేకుండా ముండ్లమూరు, దర్శి ఎంపీడీవోలను మార్పుచేశారు. తనకు అనుకూలమైన వారిని ఆ రెండు మండలాలకు తెచ్చుకోవటంలో బూచేపల్లి సఫలీకృతులయ్యారు. 


ఎమ్మెల్యే వేణుగోపాల్‌ తీవ్ర అసంతృప్తి

 ముందుగానే ఎమ్మెల్యే మద్దిశెట్టి తన సిఫార్సు లేకుండా నియోజకవర్గంలోని ఎంపీడీవోలను కదిలించవద్దని సూచించి నట్లు తెలిసింది. అదే విషయాన్ని మాజీమంత్రి బాలినేనికి కూడా వేణుగోపాల్‌ చెప్పినట్లు సమాచారం. అయినా ప్రస్తుతం బదిలీలు జరగటంతో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. తాను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా తన ప్రమేయం లేకుండా బదిలీలు చేయటం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే వెంకాయమ్మ దర్శి జడ్పీటీసీగా ఉన్నందున దర్శి ఎంపీడీవో బదిలీలో ఆమె నిర్ణయం ఉండకూడదా అని బూచేపల్లి వర్గీయులు వాదిస్తున్నారు. 


తాడోపేడో తేల్చుకునేందుకు...

తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల సమావేశాన్ని ఆదివారం వైసీపీ నిర్వహిస్తోంది. విజయసాయిరెడ్డి, సజ్జల హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈ అంశాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లి తాడోపేడో తేల్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శివప్రసాద్‌రెడ్డి కూడా ఎంపీ డీవోల బదిలీల విషయాన్ని ముందుగానే పార్టీ నేత బాలినేని, మంత్రి సురేష్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్తున్నారు. దీంతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గతపోరు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది. 


Updated Date - 2022-07-03T06:08:33+05:30 IST