అంతా బోగస్.. బాలీవుడ్ డ్రగ్స్ కేసుపై అధిర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-09-26T22:19:01+05:30 IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను రాజకీయాలే పొట్టనబెట్టుకున్నాయంటూ ...

అంతా బోగస్.. బాలీవుడ్ డ్రగ్స్ కేసుపై అధిర్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను రాజకీయాలే చంపేశాయంటూ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. బీహార్ ఎన్నికల కోసం బాలీవుడ్ డ్రగ్స్ కేసును బీజేపీ పావుగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. సుశాంత్ మృతి కేసుతో బీహార్‌లో రాజకీయాలు చేయడం కుదరని పని అని తేలడంతో.. ఇప్పుడు డ్రగ్స్ పేరుతో హడావిడి చేస్తున్నారని అధిర్ ఎద్దేవా చేశారు. ‘‘ఈ కేసులో సీబీఐ, ఈడీలను ఇక పక్కనబెట్టేశారు. ఇప్పుడు ఎన్‌సీబీని తెరముందుకు తీసుకొచ్చారు. ఎన్‌సీబీ ఇప్పుడు ఏమి దర్యాప్తు చేస్తోంది. నార్కోటిక్సా? ఇప్పటివరకు ఎంత మొత్తంలో నిషేధిత పదార్థాలు పట్టుకున్నారు? మీకు ఇందులో ఎలాంటి తీవ్రవాద లింకులు కనిపించలేదా? అంతా బోగస్! కనీసం ఉపా లేదా ఎన్ఎస్ఏని కూడా ప్రయోగించలేదా?’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


ఎన్నికలు దగ్గరపడిన ప్రతిసారీ ఏదో ఒక ‘‘సంచలనం’’ సృష్టించడం, దాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం బీజేపీకి అలవాటేననీ.. అందులో భాగంగానే సుశాంత్ కేసును తెరమీదికి తీసుకొచ్చారని అధిర్ పేర్కొన్నారు. ‘‘బీహార్ ఎన్నికల కోసం బీజేపీకి ఇప్పుడు ఏదోఒక సెన్సేషన్ అవసరం. బీజేపీ రాజకీయ, సైద్ధాంతిక దివాళాకోరుతనానికి ఇదే నిదర్శనం. సుశాంత్‌ను హత్య చేసింది ఎవరో తెలుసుకోవాలని ఉందా? ఎవరు అపరాధి? బుద్ధిలేని ఈ రాజకీయాలే..!’’ అని అధిర్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-09-26T22:19:01+05:30 IST