గడప దాటని ఓటరు.. ఇళ్లకే పరిమితమైన కాలనీ వాసులు

ABN , First Publish Date - 2020-12-02T19:57:30+05:30 IST

పోలింగ్‌ తగ్గడం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందంటూ రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, వెంకటేశ్వరనగర్‌ కాలనీ డివిజన్లలో పోలింగ్‌ పడిపోయింది. ఓటు ఆవశ్యకత గురించి అవగాహనకల్పించేందుకు

గడప దాటని ఓటరు.. ఇళ్లకే పరిమితమైన కాలనీ వాసులు

బస్తీ ఓటర్లు కూడా ఓటింగ్‌పై అనాసక్తి

తగ్గిన పోలింగ్‌.. హిల్స్‌లో ఫలితాలపై ఉత్కంఠ


బంజారాహిల్స్ (ఆంధ్రజ్యోతి):  పోలింగ్‌ తగ్గడం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందంటూ రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, వెంకటేశ్వరనగర్‌ కాలనీ డివిజన్లలో పోలింగ్‌ పడిపోయింది. ఓటు ఆవశ్యకత గురించి అవగాహనకల్పించేందుకు మంత్రి కేటీఆర్‌తోపాటు కొంతమంది రాజకీయ ప్రముఖులు బయటకు వచ్చి ఓటు వేసినప్పటికీ ఓటరు మాత్రం నిరాసక్తి ప్రదర్శించాడు. ముఖ్యంగా మహిళలు తక్కువ స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొన్నట్టు గుణాంకాలు చెబుతున్నాయి. పోలింగ్‌ తగ్గడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు జూబ్లీహిల్స్‌లో 44.34 శాతం పోలింగ్‌ కాగా బంజారాహిల్స్‌లో 44.271 శాతం, వెంకటేశ్వరనగర్‌కాలనీ డివిజన్‌లో 32.237 శాతం పోలింగ్‌ నమోదైంది. తుది లెక్కలు వచ్చే సరికి రెండు శాతం అటు ఇటుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 


కాలనీల్లో పోలింగ్‌ కేంద్రాలు ఖాళీ..

కాలనీలో ఉండే రాజకీయ, సినీ ప్రముఖులు తప్పితే మిగతా వారు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చలేదు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ కాలనీలో చాలా తక్కువ పోలింగ్‌ నమోదైంది. ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో సుమారు నాలుగువేల ఓట్లు ఉండగా కేవలం 1,323 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మధ్యాహ్నం తరువాత ఓటర్లు కనీసం కేంద్రాల వద్దకు కూడా రాకపోవడంతో సిబ్బంది నిద్రావస్థకు చేరుకున్నారు. పోలింగ్‌ కన్నాముందే ఏజెంట్లు టేబుల్‌ తొలగించేశారు. జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ క్లబ్‌, హౌసింగ్‌ సొసైటీలో సైతం కేవలం 28 శాతం మాత్రమే ఓటింగ్‌ జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12 ఎమ్మెల్యే కాలనీలో మాత్రం 42 శాతం ఓటింగ్‌ నమోదైంది. 


కరోనా భయమేనా..

కరోనా భయంతోనే ఓటర్లు పోలింగ్‌కు రాలేదనే వాదన రాజకీయ పార్టీల నుంచి వినబడుతోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద భౌతిక దూరం నిబంధననకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వంపై నిరాసక్తితో ఓటరు బయటకు రాలేదని వాదనలు వినిపిస్తున్నాయి. 


50 శాతం దాటని పోలింగ్‌

జూబ్లీహిల్స్‌ డివిజన్‌లో ఫిలింనగర్‌, ఇందిరానగర్‌ బస్తీల్లో ఎప్పుడూ పోలింగ్‌ భారీగా జరుగుతుంది. బంజారాహిల్స్‌ డివిజన్‌లో ఎన్‌బీటీనగర్‌, ఎన్‌బీనగర్‌, శ్రీరాంనగర్‌, కాజానగర్‌, భోళానగర్‌, వెంకటేశ్వరనగర్‌కాలనీ డివిజన్‌లో నందినగర్‌, గౌరీశంకర్‌కాలనీలో భారీగా ఓటింగ్‌ జరిగేది. ఈసారి బస్తీ వాసులు బయటకు రాలేదు. ఫిలింనగర్‌లో భగత్‌సింగ్‌కాలనీలో బూత్‌ నంబరు 48లో 661 ఓట్లు ఉండగా 320, బూత్‌ నంబరు 49లో 641 ఓట్లు ఉండగా 363 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పద్మాలయ అంబేడ్కర్‌నగర్‌లో 777 ఓట్లు ఉండగా 480 ఓట్లు పడ్డాయి. ఇలా అన్నిప్రాంతాల్లో కనీసం 50 శాతం కూడా పోలింగ్‌ జరగలేదు. 


వెలవెలబోయిన పోలింగ్‌ కేంద్రాలు

ఓటు హక్కు వినియోగించుకునేందుకు కాలనీ, అపార్ట్‌మెంట్‌ వాసులు ముందుకు రాలేదు. దీంతో పలుచోట్ల పోలింగ్‌ కేంద్రాలు వెలవెలబోయాయి. కరోనా కారణంగా కొంతమంది సొంతూళ్లకు వెళ్లిపోగా.. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం, సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇళ్లలోనే ఉండి పనులు చేసుకోవడం తదితర కారణాల వల్ల ఓటింగ్‌ శాతం తగ్గిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమీర్‌పేట డివిజన్‌లో మంగళవారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ సరళి మధ్యాహ్నం కాస్త ఊపందుకున్నట్లు కనిపించింది. ఉదయం 9 గంటలకు కేవలం 973 మంది మాత్రమే ఓటు వేశారు. మధ్యాహ్నం 3 గంటలకు 13,118 ఓట్లు పోలయ్యాయి. ఐదు గంటలకు 13,738 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

Updated Date - 2020-12-02T19:57:30+05:30 IST