పోలింగులు

ABN , First Publish Date - 2020-11-04T06:32:00+05:30 IST

‘నేడే దేశవ్యాప్త పోలింగ్‌’ అన్న వార్తా శీర్షికకు, ‘నేడు బిహార్‌లో రిగ్గింగ్‌’ అన్న ఉపశీర్షికను జోడించాలని కొన్ని దశాబ్దాల కిందట ఔత్సాహికులయిన పాత్రికేయులు...

పోలింగులు

‘నేడే దేశవ్యాప్త పోలింగ్‌’ అన్న వార్తా శీర్షికకు, ‘నేడు బిహార్‌లో రిగ్గింగ్‌’ అన్న ఉపశీర్షికను జోడించాలని కొన్ని దశాబ్దాల కిందట ఔత్సాహికులయిన పాత్రికేయులు ఉత్సాహపడేవారు. ఒకటి రెండు సందర్భాలలో ఆ ఉబలాటాన్ని తీర్చుకు న్నారు కూడా. దేశమంతా ఏదో ప్రజాస్వామ్యం వెల్లివి రుస్తున్నట్టు, బిహార్‌లో మాత్రమే దుర్మార్గమైన సాంఘిక వ్యవస్థ, పాలనా వ్యవస్థలు ఉన్నట్టు ఎందుకో ఆరోజుల్లో ఒక భ్రమ ఉండేది. ఉత్తరాది హిందీ హృదయసీమలో బిహార్‌ హింసాదౌర్జన్యాలకు, దారిద్ర్యానికి, ప్రాథమిక సదుపాయాల లేమికి చిహ్నంగా కనిపించేమాట నిజమే. 


గౌతమబుద్ధుడు నడయాడి, ప్రధాన బోధనలన్నీ చేసిన నేల, బౌద్ధ విహారాల పేరిటనే విహార భూమిగా ‘బిహార్‌’ పేరు తెచ్చుకున్న ప్రాంతం, కాలవశంగా ఎక్కడ ఆగిపోయిందో, ఎక్కడ పెడదారిపట్టిందో తెలియదు, ఇతర ప్రాంతాల వారు, ముఖ్యంగా దక్షిణాది వారికి భయకారకమైన రాష్ట్రంగా పేరుతెచ్చుకుంది. అక్కడ పోలింగ్‌ అంటే రిగ్గింగేనని అనుకునేవారు. అలాగని, ఆధునిక యుగంలో బిహార్‌ అన్నిటా తక్కువ ఏమీ లేదు. మిలిటెంట్‌ వామపక్ష ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న రాష్ట్రం అది. స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద సంధించిన తొలి ప్రజాస్వామిక ఉద్యమాస్త్రం బిహార్‌దే. లోహియా వాదానికి, సామాజిక న్యాయవాదానికి నెలవైన ప్రదేశం అదే. కర్పూరీ ఠాకూర్‌ వంటి నేతలను అందించింది కూడా బిహారే. లోహియా సమానత్వ సిద్ధాంతం, శూద్రకులాల సాధికారతా ఆకాంక్షతో కలగలసి విజయకేతనం ఎగురవేసిన బిహార్‌, ఒకనాడు భారతీయ జనతాపార్టీ రథయాత్రను నిలువరించిన ఘనత పొందింది. 


లాలూప్రసాద్‌ పాలన అనేక అంశాల్లో విఫలమై పోయింది. అవినీతి ముద్రపడి పోయింది. అతని జీవిత విధానం, అతని అవినీతి, అతని మొరటుదనం– అన్నిటిని పర్యాయపదాలుగా మార్చి, ప్రధానస్రవంతి మీడియా వెటకరించింది. పశుగ్రాసంలో కోట్ల అవినీతి, శాంతిభద్రతల వైఫల్యంతో అరాచకం– లాలూ, అతని భార్య పాలనలను చీకటిరోజులుగా మార్చేశాయి. మళ్లీ ఆ రోజులు కావాలా– అని భారతీయజనతాపార్టీ బిహార్‌ ఓటర్లను భయపెడుతోంది. తాను తీసుకువచ్చిన వికా సాన్ని, శాంతిభద్రతల మెరుగుదలను, ప్రభుత్వంలో క్రమశిక్షణను చెప్పుకుని నితిశ్‌ కుమార్‌ ప్రజల ముందుకు వెడుతున్నారు. రాజకీయ దృక్పథాల చరిత్ర రీత్యా చూసి నప్పుడు, లాలూ ఆధ్వర్యంలో బిజెపిని నిలువరించిన బిహార్‌ తరువాత కాలంలో, బిజెపి భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఎంచుకున్నది. సామాజిక న్యాయ రాజకీయాలనుంచే వచ్చిన నితిశ్‌, సైద్ధాంతికంగా భిన్న ధృవమైన బిజెపితో కలసి ప్రయాణిస్తున్నారు. ఇప్పుడిక సిద్ధాంతాలన్నీ మాటవరసకే కాబట్టి, వాటి గురించిన చర్చ వ్యర్థం. 


నితిశ్‌కు మంగళవారం నాడు నిరసనలు ఎదురయ్యాయి. భారతమాతకు జై అనడానికి, జైశ్రీరామ్‌ అని నినదించడానికి నోరు రాని వాళ్లకు ఓటు వేస్తారా– అని బిహార్‌ ఎన్నికల సభలోనే ప్రధాని మోదీ ఓటర్లను ఉద్దీపింపజేశారు. మారిన రోజులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో, ఒకటీ అరా తప్ప, పెద్దగా రిగ్గింగ్‌ లేదు. గయ, జెహానాబాద్‌, భగల్పూర్‌, రామ్‌పూర్‌ వంటి పేర్లు తరచు హత్యాకాండలతో అత్యాచారాలతో ముడిపడి వినిపించేవి. ఈ మధ్య బిహార్‌ ప్రతికూల కారణాలకు పెద్దగా వార్తలలోకి రావడం లేదు. కానీ బిహార్‌ ఆత్మ మాత్రం మారిపోయింది. తేజస్వి యాదవ్‌ ఇవాళ సామాజిక న్యాయం గురించి పెద్దగా మాట్లాడడు. అతనికి ఉద్యమాల ఉద్వేగాలు పరిచయం లేదు. తన తండ్రి పేరు ప్రస్తావిస్తే వచ్చే ఓట్లు కూడా పోతాయని అతనికి భయం కూడా. 


కానీ, బిహార్‌ ఎన్నికల ఫలితం దేశరాజకీయాలను మలుపుతిప్పుతుందేమోనని కొందరి ఆశ, కొందరి భయం. నితిశ్‌ బలహీనపడితే, తాము రిమోట్‌ పాలన చేయవ చ్చునని బిజెపి, నితిశ్‌ తమవైపు వస్తే, మరో మహారాష్ట్ర చేయవచ్చునని కాంగ్రెస్‌ ఎదురుచూస్తున్నాయి. మంగళవారం పోలింగ్‌ తరువాత, శనివారం నాటి పోలింగ్‌తో బిహార్‌ ఎన్నికల పర్వం ముగుస్తుంది. 


తమ దేశంలో ఎన్నికలలో అక్రమాలు జరిగే అవకాశం ఉన్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదే పదే ఆరోపిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ స్థానిక రాష్ట్రప్రభుత్వాల చేతిలో ఉంటుంది కాబట్టి, తాను ఓడిపోతే, ఎక్కడో ఏదో జరిగినట్టే, అని ఆయన అంటున్నారు. అమెరికాలో ప్రధానమైన, భౌతికమయిన ఓటింగ్‌ మంగళవారం జరుగుతున్నది. ఏమి అల్లర్లు జరుగుతాయో అని దుకాణాలు, వ్యాపారసంస్థలు మూసి వేస్తున్నారట. భారీ ఎత్తున ఆయుధాల సమీకరణ జరిగిందని వదంతులు వ్యాపించాయి. ట్రంపు గెలిస్తే సరే, ఓడితే మాత్రం బీభత్సం ఉంటుందని భయాందోళనలు వ్యాపించాయి. ఈలోగా, లెక్కకు మించిన పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ఒక ఆసక్తికర సుదీర్ఘ కార్యక్రమం. ఈ సమాచారంలో అతిశయోక్తులు కూడా ఉండవచ్చును కానీ, అమెరికా ఎన్నికలు కూడా ఒకనాటి బిహార్‌ వాతావరణాన్ని గుర్తుచేస్తున్నాయి.


అమెరికాలో ఎన్నికలయినా, బిహార్‌లో అసెంబ్లీ పోరాటమయినా, ఉప ఎన్నికను మించిన రాజకీయ వినోదం ఇవ్వలేవని తెలంగాణలో దుబ్బాక ఉదంతం నిరూపించింది. మంగళవారం నాటి పోలింగ్‌ ప్రశాంతం గానే గడిచింది కానీ, అంతకు ముందు నడచిన రసవత్తర ఉత్కంఠ భరిత బీభత్సం అంతా ఇంతా కాదు. ధనప్రవాహాలు, భౌతికదాడులు, గృహనిర్బంధాలు, సవాళ్ల మీద సవాళ్లు– దుబ్బాక పోరు వర్ణనాతీతం.

Updated Date - 2020-11-04T06:32:00+05:30 IST