పొల్లూరు జలపాతంలో పడి మృతి

ABN , First Publish Date - 2022-07-01T06:30:00+05:30 IST

పొల్లూరు జలపాతం అందాలను చూడానికి వచ్చిన నలుగురిలో ఒకరు మృత్యువాత పడ్డారు. కాకినాడ నుంచి నలుగురు యువకులు రెండు బైక్‌లపై పొల్లూరు జలపాతం వద్దకు గురువారం వచ్చారు.

పొల్లూరు జలపాతంలో పడి మృతి

మోతుగూడెం, జూన్‌ 30: పొల్లూరు జలపాతం అందాలను చూడానికి వచ్చిన నలుగురిలో ఒకరు మృత్యువాత పడ్డారు. కాకినాడ నుంచి నలుగురు యువకులు రెండు బైక్‌లపై పొల్లూరు జలపాతం వద్దకు గురువారం వచ్చారు. జలపాతం వద్ద స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగుతుండగా కాకినాడ పబ్లిక్‌ హెల్త్‌ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ డిపార్టుమెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న హసన్‌ప్రీతమ్‌ (21) లోయలో పడి చనిపోయాడు. స్నేహితుడిని కాపాడే ప్రయత్నంలో మరో యువకుడు నీటిలో మునిగిపోగా మిగిలిన వారు రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్న మృతితో ఒంటరైన చెల్లి
 తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ ఒక్కగానొక్క సోదరిని అంతా తానై ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్న ఓ అన్నను జలపాతం మింగేసింది. దీంతో ఆ యువతి కుటుంబంలోని అందరినీ కోల్పోయింది. కాకి నాడకు చెందిన పలివెల హసన్‌కు ప్రీతమ్‌(21) తల్లి పద్మశ్రీ రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ కేన్సర్‌తో 2020లో మృతి చెందారు. దీంతో హసన్‌కు ప్రభుత్వం కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చింది. తల్లి మరణంనుంచి కోలుకునేలోపు తండ్రి బులి వెంకటరత్నం 2021, డిసెంబర్‌లో మృతి చెందడంతో హసన్‌, చెల్లెలు ఇద్దరే మిగిలారు. అన్నా, చెల్లెలు హర్షిత కలిసి ఉంటున్నారు. 2021, జనవరి 7న కాకినాడ పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్నాడు. సెలవు రోజుల్లో అన్నా చెల్లెలిద్దరూ మండపేటలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తుంటారు. హసన్‌ చెల్లి హర్షిత విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లో విద్యాభ్యాసం చేస్తోంది. సెలవులకు తన అన్నయ్య వద్దకు వస్తుంటుంది. తల్లిదండ్రుల మృతితో అన్నాచెల్లెళ్ల మనసుకు తగిలిన గాయం ఇప్పుడిప్పుడే మానుతూ సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఇప్పుడు అన్నను కోల్పోయిన ఆ సోదరి గుండెలవిసేలా రోదిస్తోంది.   హసన్‌ మృతి పట్ల ఆ శాఖలోని సహచర సిబ్బంది, అధికారులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. అందరితో తోబుట్టువులా ఉండేవాడని, ఎటువంటి చెడు వ్యసనాలు లేని మంచి లక్షణాలు గల హసన్‌ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-07-01T06:30:00+05:30 IST