కంపు.. కంపు..

ABN , First Publish Date - 2020-11-30T05:07:56+05:30 IST

ఓ కర్మాగారం నుంచి వెలువడుతున్న కాలుష్యంతో రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కంపు.. కంపు..
అంతారం గ్రామ సమీపంలోని జిప్సం కర్మాగారం నుంచి వచ్చిన కలుషితనీరు

  • జిప్సం కర్మాగారం కాలుష్య కోరల్లో గ్రామాలు
  • వెదజల్లుతున్న దుర్వాసన... చెరువులోకి చేరుతున్న కర్మాగార కలుషిత నీరు 
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిసర గ్రామాల ప్రజలు


ఓ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలు, రసాయనాలు పరిసరాలనే కాదు.. ప్రజల ప్రాణాలను కూడా హరించే ప్రమాదం నెలకొంది. ఆ కర్మాగారారం నుంచి విడుదలయ్యే కాలుష్య కోరల్లో చిక్కుకొని రెండు గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే కలుషిత నీటితో సమీప చెరువులు విషతుల్యం కావడమే కాకుండా.. తీవ్రమైన దుర్వాసన వెలువడుతోంది. సమీప గ్రామ ప్రజలు  సంబంధిత అధికారులుకు సమస్యను విన్నవించినా స్పందించడం లేదు. కర్మాగారంపై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.


తాండూరు రూరల్‌/తాండూరు : ఓ కర్మాగారం నుంచి వెలువడుతున్న కాలుష్యంతో రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్మాగారం నుంచి వెదజల్లే దుర్వాసన ముక్కపుటాలను అదరగొడుతుంది. దీనికితోడు ఆ కర్మాగారం నుంచి వెలువడుతున్న నీటితో చెరువు కలుషితమవుతోంది. దీంతో గ్రామస్థులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. తాండూరు మండలం అంతారం పెద్ద చెరువు పైభాగం అటవీ ప్రాంతం సమీపంలో కొనసాగుతున్న జిప్సం కర్మాగారం నుంచి కొన్నిరోజులుగా కలుషిత నీరు విడుదలవుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు కర్మాగారం కలుషిత నీరంతా సమీపంలోని పెద్ద చెరువులోకి చేరి ఎర్రగా మారి దుర్వాసనను వెదజల్లుతుంది. అంతేకాకుండా కర్మాగారం నుంచి వెలువడే దుర్వాసనతో తీవ్రఇబ్బందులు పడుతున్నామని సమీపంలోని అంతారం, కందనెల్లి తండా ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం చెరువులో నుంచి నీటి దుర్వాసన అధికంగా కావడంతో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వడ్డె శ్రీనివాస్‌ అంతారం గ్రామస్థులు వడ్డె చంద్రయ్య, లాలప్ప, అబ్రహం,  అనంతయ్య, మాత్యరి దేవప్ప, పెద్ద నర్సింహులు,  శాంతి, అం జయ్య,  రాములు, రజనికాంత్‌, సామెల్‌, స్వామిదాస్‌, సంజీవ, మల్లప్ప, ఆలప్ప, వెంకట్‌, రాజు, రైతులు పలువురు పెద్ద ఎత్తున చెరువు వద్దవెళ్లి పరిశీలించారు. చెరువులో నీరు కలుషితమై దుర్వానస వెదజల్లుతుండటంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. అడవులకు మేత కోసం వచ్చే పశువులు పెద్ద చెరువులో దాహార్తిని తీర్చుకునేవి. చెరువులోకి కలుషిత నీరు చేరడంతో దుర్వాసనకు పశువులు నీరు తాగకుండా తిరిగి వెళ్లిపోతున్నాయి. ఈ కలుషిత నీటి వల్ల చెరువులోని చేపలు కూడా మృతి చెందే ప్రమాదముందని గ్రామస్థులు, తండావాసులు పేర్కొంటున్నారు. చెరువుకింద ఉన్న పొలాల్లో పంట కోసేందుకు కూలీలు కూడా ఈ దుర్వాసనకు రావడం లేదని ఆ ప్రాంత రైతులు పేర్కొంటున్నారు. జిప్సం కర్మాగారం నుంచి వెలువడే దుర్వాసనతో అనారోగ్యం పాలయ్యే ప్రమాదముందని, వెంటనే కర్మాగారాన్ని మూసి వేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలాఉండగా, జిప్సం కర్మాగారం మూసివేయాలని గతంలో ఆయా గ్రామాల ప్రజలు తాండూరులో ధర్నాలు నిర్వహించారు. అంతేకాకుండా కర్మాగారం యాజమాన్యం అటవీ ప్రాంతంలో హ ద్దులు ఏర్పర్చుకొని గుంతలు తవ్వుకున్నారు. ఆ గుంతల్లో కూడా కలుషిత నీటిని వదులుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ప్రజలు, మూగజీవాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే జిప్సం కర్మాగారాన్ని మూసి వేయించకపోతే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని గ్రామస్థులు హెచ్చరించారు.  


కర్మాగారంపై చర్యలు తీసుకోవాలని..

తాండూరు మండలం అంతారం, పెద్దేముల్‌ మండలం కందనెల్లితండా సమీపంలో కొనసాగుతున్న జిప్సం కర్మాగారంపై చర్యలు తీసుకోవాలని గతంలో పెద్దేముల్‌ వైస్‌ఎంపీపీ మధులతశ్రీనివాస్‌ తాండూరు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కర్మాగారం యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతారం పెద్ద చెరువులోకి కలుషిత నీరు చేరి దుర్వాసన వెదజల్లుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కర్మాగారంపై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన , ధర్నా చేపడతామని వైస్‌ఎంపీపీ మధులతశ్రీనివాస్‌, అంతారం ఎంపీటీసీ శ్యామలమ్మ, శాంతు హెచ్చరించారు. 


రోగాల బారిన పడుతున్నాం..

 పొలాలు పూర్తిగా కాలుష్యంతో కూరుకుపోయాయి. వరిపొలం కోసేందుకు కూలీలు రావడం లేదు. దుర్వాసనతో పాటు వరి పొలాంలో కాలు పెడితే దురద పెట్టి మండుతుండటంతో కూలీలు వెనుదిరిగిపోతున్నారు.ఎంతో ఇబ్బందులతో పొలాన్ని సాగు చేస్తున్నాను.ఈ దుర్వాసన కార్మగారం చుట్టూ ఉన్న ప్రజలందరికీ రావడంతో ఆనారోగ్యాల పాలవుతున్నారు.

- వడ్డీ పాల చంద్రయ్య,  రైతు 


 రసాయన పరిశ్రమను వెంటనే మూసి వేయాలి 

 కందనెళ్లి శివారులో వెలసిన రసాయన పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో తండా వాసులు రోగాల బారిన పడుతున్నారు. తండా ప్రజలు పరిశ్రమతో వచ్చే దుర్వాసనతో నానా అవస్థలు పడుతున్నారు. వెంటనే పరిశ్రమ  మూసివేయాలి. ఈ మేరకు ఆర్డీవోకు అప్పట్లో  రాత పూర్వకంగా పిర్యాదు కూడా చేశాను.ఈ రసాయన పరిశ్రమకు కాలుష్య నియంత్రణ మండలి ఎలా అనుమతి ఇచ్చారో మరోసారి ఉన్నతాధికారులు విచారణ జరుపాలి.

- మధులత,  వైస్‌ ఎంపీపీ పెద్దేముల్‌ 


కర్మాగారం మూసివేయించాలని కలెక్టర్‌కు నివేదిస్తాం..

తాండూరు మండల పరిధిలో కొనసాగుతున్న జిప్సం కర్మాగారం అనుమతులు రద్దు చేయాలని, కాలుష్య నియంత్రణ బోర్డుకు ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ కర్మాగారం యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. వారిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే అటవీశాఖ పరిధిలోకి వచ్చి గుంతలు తవ్వుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తీవ్ర కాలుష్యాన్ని పెంచుతున్నారు. వెంటనే కర్మాగారం మూసివేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు నివేదిస్తాం.

- శ్యాంసుందర్‌రావు, అటవీ రేంజ్‌ అధికారి, తాండూరు.



Updated Date - 2020-11-30T05:07:56+05:30 IST