కాలుష్యం కాటు

ABN , First Publish Date - 2022-06-30T04:44:40+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి వచ్చి కలుస్తున్న కలుషిత నీటి వల్ల కొండేరు లచ్చమ్మ చెరువులోని చేపలు వేలాదిగా మృత్యు వాత పడుతున్నాయి.

కాలుష్యం కాటు
కలుషిత నీటితో మృతి చెందిన చేపలు

గద్వాల జిల్లా కొండేరు లచ్చమ్మ చెరువులో చేపలు మృత్యువాత

సమీపంలోని ఫ్యాక్టరీ కలుషిత నీరే కారణమంటున్న గ్రామస్థులు

ఈ కలుషిత నీటిపై గతంలోనే ‘ఆంధ్రజ్యోతి’లో కథనం..

పట్టని కాలుష్య నియంత్రణ, రెవెన్యూ, భూగర్భజల శాఖల అధికారులు


 గద్వాల, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి వచ్చి కలుస్తున్న కలుషిత నీటి వల్ల కొండేరు లచ్చమ్మ చెరువులోని చేపలు వేలాదిగా మృత్యు వాత పడుతున్నాయి. ఆ చెరువులో ప్రభుత్వం ఏటా చేపలను విడుదల చేస్తోంది. గ్రామ మత్స్యకారులు కూడా కొంతమేర చేపలను కొనుగోలు చేసి, పెంచుతున్నారు. సొసైటీ ఆధ్వర్యంలో వాటిని పెంచిన తర్వాత విక్రయించి, ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. అయితే ఈ గ్రామం సమీపంలో నిర్మించిన ఓ ఫ్యాక్టరీ నుంచి వెలువడే డీలింటింగ్‌ వాటర్‌ చెరువులోకి వచ్చి చేరుతోందని గ్రామస్థులు, మత్స్యకార సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ఈ కలుషిత నీటిని తాగడం వల్ల గతంలో మూగజీవా లు మృత్యువాత పడ్డాయి. అప్పుడు కానీ, ఇప్పుడు కానీ కాలుష్య నియంత్రణ బోర్డు, భూగర్భ జల శాఖ, రెవెన్యూ అధికారులు, పోలీసులు ఎవరూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏదైన ఘటన జరిగినప్పుడు పైసలు చెల్లించి, సెటిల్‌ చేసు కోవాలనే ధోరణిని ఫ్యాక్టరీ నిర్వాహకులు అవలం భిస్తుండటం ఇందుకు కారణం కావచ్చు. నెల రోజుల కిందట ‘ఆంధ్రజ్యోతి’లో ‘కాలుష్య కాసారం’ శీర్షికన కంపెనీ డీలింటింగ్‌ వాటర్‌ వల్ల భూగర్భ జలాలు, నదీ జలాలు, చెరువు నీరు కలుషితం కావడంపై కథనం ప్రచురితమైంది. అయినా అధికారుల్లో చలనం లేకపోవడం వల్లనే ప్రస్తుతం లచ్చమ్మ చెరువులో సుమారు రూ.20 లక్షల విలువ చేసే చేపలు మృత్యువాతపడ్డాయి. గడిచిన మూడు నాలుగు రోజులుగా చేపలు మృతి చెందడం గమనించిన సొసైటీ అధ్యక్షుడు మద్దిలేటి ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడగా కంపెనీ యాజమా న్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పినట్లు తెలిసింది. అయితే చేపలు మృతి చెందడం పెరగడంతో ఆందోళన చెందిన సొసైటీ సభ్యులంతా మంగళవారం ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. దాంతో ఫ్యాక్టరీ నిర్వాహకులు మాట మార్చారని సభ్యులు తెలిపారు. తమ ఫ్యాక్టరీ నీరు అసలు చెరువులోనే కలవలేదని చెబుతున్నారని అంటున్నారు.


పోలీసుల బెదిరింపులు

కంపెనీ వాళ్లు డయల్‌ 100కి ఫోన్‌ చేసి, విషయం చెప్తే తమకు ఫిర్యాదు చేయకుండా అక్కడకు ఎలా వెళ్తారని పోలీసులు ప్రశ్నించారని మత్స్యకారులు వాపోతున్నారు. తప్పు చేసిన వారిని వదిలేసి తమను బెదిరించడం సరికాదని అంటు న్నారు. ఇదే విషయమై సొసైటీ అధ్యక్షుడు మద్ది లేటి జిల్లా మత్స్యశాఖ అధికారికి ఫిర్యాదు చేశా రు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడటానికి ఫ్యాక్టరీ నిర్వాహకులు ఎంత కారణమో.. అధికారులు అంతే కారణమని చెప్పొచ్చు. కాలు ష్యంపై అధికారులకు పూర్తి సమాచారం ఉన్నా ఆ మ్యామ్యాలకు ఆశపడి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ సారైనా చర్యలు తీసుకుంటారో? లేక మళ్లీ మామూళ్ల మత్తులో మునుగుతారో వేచి చూడాలి. 


రూ.20 లక్షల నష్టం

ఇటీవల వర్షాలు కురిసినప్పుడు సమీపంలోని ఎస్‌ఎన్‌ఎస్‌ ఫ్యాక్టరీ నుంచి భారీగా వ్యర్థ జలాలను వదిలారు. కలుషిత నీరు చేరడంతో చెరువులో ఉన్న చేపలన్నీ మృత్యువాత పడుతున్నాయి. మూడు, నాలుగు రోజులుగా చనిపోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.20 లక్షల నష్టం జరిగింది. ఇదే మని కంపెనీ నిర్వాహకులను అడిగితే ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామన్నా రు. మంగళవారం వెళ్లి న్యాయం చేయాలని కోరితే తమ కంపెనీ నీరు కలవడం లేదని, డయల్‌ 100కి ఫోన్‌ చేశారు. పోలీసులు కూడా తమకు ఫిర్యాదు చేయకుండా ఫ్యాక్టరీ దగ్గరకు ఎలా వెళ్లారని మమ్మల్నే అడుగుతున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి. 

- మద్దిలేటి, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు, కొండేరు

Updated Date - 2022-06-30T04:44:40+05:30 IST