కాలుష్య కోరల్లో.. గుంజనేరు

ABN , First Publish Date - 2022-06-28T05:25:45+05:30 IST

గుంజనేరు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పంచాయతీ సిబ్బంది భారీ ఎత్తున ఇక్కడ వ్యర్థాలను వేస్తుండడంతో డంపింగ్‌ యార్డుగా మారింది. దీనికి తోడు చుట్టుపక్కల ఉన్న బొప్పాయి పరిశ్రమల నుంచి వచ్చే అపరిశుభ్ర నీరు నదిలో కలుస్తుండడంతో దుర్వాసన ఎక్కువై స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

కాలుష్య కోరల్లో.. గుంజనేరు
నదిలో వ్యర్థ పదార్థాల డంపింగ్‌

భారీ ఎత్తున వ్యర్థాలు

డంపింగ్‌ యార్డుగా మారిన వైనం

రైల్వేకోడూరు, జూన్‌ 27: గుంజనేరు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పంచాయతీ సిబ్బంది భారీ ఎత్తున ఇక్కడ వ్యర్థాలను వేస్తుండడంతో డంపింగ్‌ యార్డుగా మారింది.  దీనికి తోడు చుట్టుపక్కల ఉన్న బొప్పాయి పరిశ్రమల నుంచి వచ్చే అపరిశుభ్ర నీరు నదిలో కలుస్తుండడంతో  దుర్వాసన ఎక్కువై స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. 

రైల్వేకోడూరు పంచాయతీలోని చెత్త చెదారాన్ని మొత్తం గుంజనేరులోకి తరలిస్తున్నారు. దీంతో మొత్తం నది మూసుకుపోవడంతో పాటు నీరు ప్రవహించక ఒకే చోట నిలబడిపోతున్నాయి. చెత్త, చెదారం, మురుగు వెరశి దుర్వాసనతో అల్లాడిపోతున్నారు. ఈ నది ఒడ్డున రైతుల పొలాలు ఉన్నాయి. పొలాల్లోకి వెళ్లాలంటే రైతులు నది దాటి వెళ్లాల్సి ఉంది. అంతేకాకుండా నదికి సమీపంలో గుర్రప్పపాళెం గిరిజన కాలనీ ఉంది. వీరు నిత్యం ఈ నది దాటి పట్టణానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కువగా ప్లాస్టిక్‌ బాటిళ్లు, పేపర్లు, కవర్లు వేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల పశువులు, మేకలు, పొట్టేళ్లు, గొర్రెలు ఈ నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నాయని కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు తగు చర్యలు తీసుకుని నదిలో కాకుండా వేరొక ప్రాంతంలో చెత్త చెదారాలను డంపింగ్‌ చేయాలని ప్రజలు కోరుతున్నారు. 


తప్పకుండా చర్యలు తీసుకుంటాం

చెత్త చెదారాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. నది శుభ్రంగా ఉండేలా తగు చర్యలు తీసుకుంటాం. నది ప్రవాహానికి ఇబ్బంది కలకుండా చూస్తాం. చెత్త చెదారాలను సంపద కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తాం. 

- రామసుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శి,  రైల్వేకోడూరు


నది మూసుకుపోతోంది

గుంజనేరులో చెత్తచెదారాలను వేయడంతో మూసుకుపోతోంది. నదికి సమీపంలోని రైతులకు ఇబ్బందిగా మారింది. అటు వెళ్లాలంటే విపరీతమైన దుర్వాసనలు వస్తున్నాయి. పైగా నీరు వెళ్లేందుకు దారి లేకుండా పోతుంది. దీంతో రైతుల పొలాలు దెబ్బతినే అవకాశం ఉంది. బొప్పాయి వేస్ట్‌ వాటర్‌, తుక్కు తదితర వ్యర్థాలను నదిలో వేస్తున్నారు. పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలి. 

- విజయ్‌కుమార్‌రెడ్డి, స్థానికుడు, రైల్వేకోడూరు


Updated Date - 2022-06-28T05:25:45+05:30 IST