Advertisement

స్థానికులకు కాలుష్యం.. స్థానికేతరులకు కొలువులా!

Jan 23 2021 @ 00:55AM

ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రాంతంలోని మేళ్లచెరువు మండలం సిమెంట్‌ పరిశ్రమల కేంద్రంగా పేరుపొందింది. మూడు దశాబ్దాల పూర్వం నుంచి ఈ పరిశ్రమలు ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి. మేళ్లచెరువు, మఠంపల్లి మండలంలో సిమెంట్‌ పరిశ్రమకు కావలసిన ముడిసరుకు సున్నపురాయి వేలాది ఎకరాలలో నిక్షిప్తమై ఉండడంతో ఈ ప్రాంతంలో వాటిని ఎక్కువగా స్థాపించారు. ఒక్క మేళ్ళచెరువు మండలంలోనే పదిహేను పరిశ్రమలున్నాయి. 30 సంవత్సరాలకు పూర్వమే నెలకొల్పిన వీటిలో నాటి నుంచి నేటి వరకు 10 శాతం మంది స్థానికులకు మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారు. అది కూడా కాంట్రాక్టు పద్ధతిలోనే. ఈ పరిశ్రమలలో పనిచేస్తున్న మిగిలిన 90 శాతం మంది స్థానికేతరులే. అమాయకులైన స్థానికులను యాజమాన్యాలు మోసం చేస్తున్నా, జిల్లా యంత్రాంగం కట్టడి చేయడం లేదు.


స్థానికులలో ఉన్నత చదువులు చదివినవారు ఎక్కువమందే ఉన్నారు. సాంకేతిక విద్యా కోర్సులు, వృత్తివిద్యా కోర్సులు వంటివి చదివి నిరుద్యోగులుగా ఉన్నవారి సంఖ్య వేలల్లోనే ఉంది. వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా యాజమాన్యాలు స్థానికేతరులకే అవకాశం ఇవ్వడం సహజ న్యాయానికి, సామాజిక న్యాయానికి, చట్టబద్ధ న్యాయానికి విరుద్ధం. మూడు దశాబ్దాలకు పైగా ఇదే విధానం కొనసాగుతోంది. అయినా అధికారులు ఈ అన్యాయంపై ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారో అర్థం కాని విషయం. ఈ ఫ్యాక్టరీల నిర్మాణంలో కూలీలుగా వేలాదిమంది స్థానికులు పని చేశారు. ఆ సందర్భంగా ప్రాణాలు కోల్పోయినవారూ ఉన్నారు. స్థానికుల చెమటచుక్కలతో అంగుళమంగుళం నిర్మాణం జరిగిన ఫ్యాక్టరీలలో స్థానికులకు ఎందుకు అవకాశాలు రావడం లేదు? ఇది నల్లగొండ జిల్లాకే పరిమితం కాలేదు.


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సెక్రటేరియట్‌ నుంచి మారుమూల ఇటుక బట్టీల దాక ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జాతీయ రహదారులపై టోలు వసూలు చేసే, సిబ్బందిని బిహార్‌ నుంచి తీసుకువచ్చి నియమించుకుంటున్నారు. వారికి తెలుగు భాష రాకపోవడంతో తరచూ స్థానికులతో గొడవలు జరుగుతున్నాయి. ఇది శాంతిభద్రతల సమస్యకు కూడ దారితీస్తోంది. హైదరాబాద్‌ పాతనగరంలోని గాజుల పరిశ్రమలో కూడ బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ లాంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి సిబ్బందిని రప్పించుకుని యాజమాన్యాలు కార్మిక చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా స్థానిక నిరుద్యోగ యువకులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నాయి. స్థానికులకు సిమెంట్‌ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఉపాధి అవకాశాలిస్తే, వారికి స్థానిక బలం ఉంటుందని, వారు సంఘటితమైతే తమ చట్టవిరుద్ధ చర్యలు సాగవనే దురుద్దేశ్యంతోనే యాజమాన్యాలు స్థానికులకు అవకాశం ఇవ్వడం లేదు. చట్టబద్ధ సంస్థలు దీనికి సహకరించడం, యాజమాన్యాలు వాటిని లోబరుచుకోవడం ఇంకా ఎంతకాలం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


సిమెంట్‌ పరిశ్రమల ప్రారంభానికి ముందే ఇక్కడి భూముల కొనుగోళ్లలో పెద్ద తంతే జరిగింది. ప్రభుత్వ భూములు, దళిత భూములను పరిశ్రమల యాజమాన్యాలు ఆక్రమించుకున్నాయి. వీటిపై విచారణ జరపాలని అధికారులను స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. భూమి లోపల ఉండే సున్నపురాయి కోసం ఈ పరిశ్రమల యాజమాన్యాలు బ్లాస్టింగ్‌ చేస్తుంటాయి. దానివల్ల ఈ ప్రాంతమంతటా భూకంపం మాదిరిగా ప్రకంపనలు వస్తుంటాయి. రేవూరు, రామాపురం, లంబాడి తండాలు, దొండపాడు తదితర గ్రామాలు బ్లాస్టింగ్‌ ధాటికి విలవిలలాడుతున్నాయి. సున్నపురాయి ఉండడం వల్ల ఈ ఊళ్లలో ప్రజలు లోతైన పునాదులు వేసుకోలేకపోతున్నారు. ఫలితంగా బ్లాస్టింగ్‌కు తట్టుకోలేక ఇళ్లు కూలిపోతున్నాయి. ఈ ముప్పయ్‌ ఏళ్ళలో రెండుమూడుసార్లు పైగానే ఇళ్ళు నిర్మించుకోవలసి రావడంతో పేదలు మరింత పేదలయ్యారు. స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులు, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి అధికారులు కూడా యాజమాన్యాలకు వత్తాసు పలకడం వల్లే స్థానికులకు న్యాయం జరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల కడగండ్లపై దృష్టి సారించాలి. స్థానికులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు లభించేలా చట్టపరమైన విధానాలను అమలులోకి తెచ్చి యాజమాన్యాలు కచ్చితంగా వాటిని పాటించేలా చూడాలి. ఈ విషయంలో ఉపేక్షతో వ్యవహరించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.


సాధం వెంకట్‌, సీనియర్‌ జర్నలిస్టు

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.