OMG: పట్టించుకోం గానీ ఈ కారణం వల్ల ఏడాదికి అన్ని లక్షల మంది చచ్చిపోతున్నారంట..!

ABN , First Publish Date - 2022-05-21T23:13:22+05:30 IST

గాలి కాలుష్యాన్ని మనం పెద్దగా పట్టించుకోకుండా గాలికొదిలేస్తుంటాం గానీ దీనివల్ల ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో తెలిస్తే మాత్రం ఆందోళన కలగక మానదు. తాజాగా Lancet Studyలో..

OMG: పట్టించుకోం గానీ ఈ కారణం వల్ల ఏడాదికి అన్ని లక్షల మంది చచ్చిపోతున్నారంట..!

గాలి కాలుష్యాన్ని మనం పెద్దగా పట్టించుకోకుండా గాలికొదిలేస్తుంటాం గానీ దీనివల్ల ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో తెలిస్తే మాత్రం ఆందోళన కలగక మానదు. తాజాగా Lancet Studyలో తేలిన విషయం ఏంటంటే.. భారత్‌లో కాలుష్యం కారణంగా అనారోగ్యం బారిన పడి 23 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని అధ్యయనంలో తేలింది. ఇందులో గాలి కాలుష్యం కారణంగా రోగాల బారిన పడి 16 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, 5 లక్షల మందికి పైగా నీటి కాలుష్యం కారణంగా జబ్బులు సోకి చనిపోయారు. Lancet Commission On Pollution and Helath రిపోర్ట్ చెప్పిందేంటంటే.. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కాటుకు సుమారు 90 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారు. నమోదవుతున్న మరణాల్లో ఆరుగురిలో ఒకరు కాలుష్యం కారణంగా మృత్యువాత పడుతున్నారు. భారత్‌లో ప్రతీ సంవత్సరం 10 లక్షల మందికి పైగా గాలి కలుషితం కావడం వల్ల అనారోగ్యం బారిన పడి కాల గర్భంలో కలిసిపోతున్నారని ల్యాన్సెట్ అధ్యయనంలో తేలింది.



అంతేకాదు.. కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాల్లో 90 శాతం తక్కువ ఆదాయం, మధ్యస్థంగా ఆదాయం ఆర్జిస్తున్న దేశాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయని ఈ స్టడీలో తేలింది. ఈ జాబితాలో 2.36 మిలియన్ మరణాలతో భారత్ అగ్ర స్థానంలో ఉండగా, 2.1 మిలియన్ మరణాలతో చైనా నెంబర్.2లో ఉంది. భారత్ గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తోందని, అందులో భాగంగానే.. 2016లో ‘ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన’ స్కీమ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారని రిపోర్ట్ పేర్కొంది. గ్రామాల్లో ఉండే మహిళలు కట్టెలు, పుల్లలను వంట కోసం వినియోగించి గాలిని కలుషితం చేయకుండా ప్రత్యామ్నయంగా ఈ పథకం కింద వంట గ్యాస్‌ను అందించడమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని సదుద్దేశంతోనే తీసుకొచ్చినా ఆశించిన స్థాయిలో మార్పు కనిపించలేదు.



భారత్‌లోని నగరాలు అభివృద్ధిలో కంటే Global Pollution Rankingsలో ముందు వరుసలో ఉంటున్నాయని Lancet పేర్కొనడం ఆందోళన కలిగించే విషయం. గతేడాది సెప్టెంబర్‌లో University of Chicago Energy Policy Institute సమర్పించిన డేటా ప్రకారం.. దేశ రాజధానిలో బతుకుతున్న వారు ఢిల్లీలో గాలి కాలుష్యం నియంత్రణలోకి వస్తే మరో 10 ఏళ్లు ఎక్కువ బతికే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు.. భారత్‌లో కాలుష్యం కారణంగా భారతీయుల ఆయుష్షు 10 ఏళ్లు తగ్గిపోతోందని US Research Group ఓ అధ్యయనంలో తేల్చింది. 480 మిలియన్ల మంది Northern India ప్రజలు ప్రపంచంలోనే ఎవరూ ఎదుర్కోనంత గాలి కాలుష్యాన్ని ఎదుర్కుంటున్నారని సదరు స్టడీ పేర్కొంది.

Updated Date - 2022-05-21T23:13:22+05:30 IST