కాలుష్యం కుమ్మరింత

ABN , First Publish Date - 2022-05-24T06:49:43+05:30 IST

నగరంలో వాతావరణ కాలుష్యం పెరగడానికి విశాఖపట్నం పోర్టుతో పాటు గంగవరం పోర్టు కూడా కారణమవుతోంది.

కాలుష్యం కుమ్మరింత

యార్డుల నిర్వహణలో గంగవరం పోర్టు నిబంధనల ఉల్లంఘన

భారీగా బొగ్గు నిల్వలు

గాజువాక, పెదగంట్యాడ వరకూ ధూళి

మచ్చుకైనా కనిపించని టార్పాలిన్లు

పరిసిర ప్రాంతాల వారికి ఒళ్లంతా దురదలు...శ్వాసకోశ వ్యాధులు

కంటి తుడుపుగా నివారణ చర్యలు

పట్టని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో వాతావరణ కాలుష్యం పెరగడానికి విశాఖపట్నం పోర్టుతో పాటు గంగవరం పోర్టు కూడా కారణమవుతోంది. వన్‌టౌన్‌, డాబాగార్డెన్స్‌, గురుద్వారా, సీతమ్మధార, అక్కయ్యపాలెం, కంచరపాలెం, నావల్‌ డాక్‌యార్డు వరకు విశాఖపట్నం పోర్టు కాలుష్యం కమ్మేస్తుంటే...కొత్త గాజువాక నుంచి పెదగంట్యాడ మండలం వెంకన్నపాలెం వరకు అనేక ప్రాంతాలను గంగవరం పోర్టు కాలుష్యం కబళిస్తోంది.

విశాఖ పోర్టు ప్రభుత్వ సంస్థ కావడంతో కొన్ని నివారణ చర్యలైనా చేపడుతోంది. అదే గంగవరం పోర్టు విషయానికి వచ్చేసరికి అది పూర్తిగా ప్రైవేటు పోర్టు కావడం, రాజకీయ అండదండలు ఉండడంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. నివేదికలు ఇస్తున్నారే తప్ప చర్యలకు ఒత్తిడి తేవడం లేదు. 


యథేచ్ఛగా యార్డుల నిర్వహణ

గంగవరం పోర్టుకు భారీగా బొగ్గు దిగుమతి అవుతోంది. బొగ్గును యార్డుల్లో నిల్వ చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. పరిసరాల్లోని గ్రామాల్లోకి ధూళి వెళ్లకుండా కవర్డ్‌ గోదాములు ఉండాలి. ఓపెన్‌ యార్డులైతే వాటిపై టార్పాలిన్లు కప్పాలి. ధూళి కణాలు రేగకుండా నీటిని గంటకొకసారి చిమ్ముతూ ఉండాలి. అదేవిధంగా కనీసం 10 మీటర్ల ఎత్తున గోదాములు చుట్టూ ప్రహరీ నిర్మించాలి. అయితే వీటిలో చాలా నిబంధనలను గంగవరం పోర్టు అమలు చేయడం లేదు. ఎవరైనా అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే బొగ్గు నిల్వలపై నీటిని చిమ్ముతున్నారు. ఇక్కడ టార్పాలిన్లు మచ్చుకైనా కనిపించవు. పైగా గంగవరం పోర్టు గోదాముల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోని భూములను కూడా బొగ్గు వ్యాపారులు స్టాక్‌ యార్డులుగా వాడుకుంటున్నారు. గంగవరం పోర్టుకు సమీపంగా వున్న వెంకన్నపాలెంలో రాజకీయ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న తిప్పల కుటుంబానికి భారీగా భూములు ఉన్నాయి. ఆ కుటుంబానికి చెందిన వారంతా వారి భూములను మార్వాడీలకు లీజుకు ఇచ్చేశారు. వాటిలో బొగ్గును నిల్వ చేస్తున్నారు. అటు గంగవరం బొగ్గు ధూళితో పాటు ఇటు వెంకన్నపాలెం స్టాక్‌యార్డుల నుంచి కూడా కాలుష్యం పరిసర ప్రాంతాలను కమ్మేస్తోంది.


అక్కడంతా బాధితులే...!

గంగవరం, పల్లిపాలెం, జాలరి పల్లిపాలెం, వెంకన్నపాలెం, యాతపాలెం, కొంగపాలెం, సత్యనారాయణపురం, కొత్త దిబ్బపాలెం, అశోక్‌నగర్‌, ప్రియదర్శిని కాలనీ, పెదగంట్యాడ, నెల్లిముక్కు, సిద్ధేశ్వరం, కొత్త గాజువాక, బాలచెరువు రోడ్డు, నడుపూరు, నెల్లిముక్కు, హౌసింగ్‌ బోర్డు కాలనీ వరకు గంగవరం పోర్టు కాలుష్యం వస్తోంది. అక్కడ పీల్చే గాలి కలుషితమైనట్టు స్థానిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.


ఒళ్లంతా దురదలు

బొగ్గు ధూళి మంచినీటి కుండీల్లో చేరుతోంది. ఆ నీటితో స్నానం చేస్తే దురదలు వస్తున్నాయి. పిల్లలకు చర్మవ్యాధులు, వృద్ధులకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. తరచూ గ్రామస్థులు ఏదో ఒక అనారోగ్యంతో బాధ పడుతున్నారు.


లారీలతో మరింత

పోర్టు నుంచి బొగ్గుతో బయటకు వెళ్లే లారీలు కూడా పైన ఎటువంటి టార్పాలిన్లు లేకుండానే వెళుతున్నాయి. దాంతో అవి వెళ్లే మార్గమంతా ధూళి మేఘాలు రేగుతున్నాయి. కొన్ని నిమిషాల వరకు ఆ దుమ్ము పోవడం లేదు. 


ఇవీ ఎల్‌అండ్‌టి సూచనలు

గత ఏడాది ఎల్‌ అండ్‌ టి బృందం గంగవరం పోర్టులో పర్యటించి, అన్నింటినీ పరిశీలించి పలు సూచనలు చేసింది. పోర్టు ఆవరణలో రెడ్‌ కేటగిరీలోకి వచ్చే పారిశ్రామిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వెల్లడించింది.

- వాతావరణ కాలుష్యం ఉందని, నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. 

- వ్యర్థాలు ప్రమాదకరంగా ఉన్నాయని, వాటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 

- సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ చేయాలని సూచించింది. 

- పరిసర గ్రామాల్లో ఆర్థిక, సామాజిక స్థితిగతులు బాగా లేవని కార్పొరేట్‌ పర్యావరణ బాధ్యత కింద నిధులు వెచ్చించాలని పేర్కొంది.

- గ్రీన్‌బెల్డ్‌ను చుట్టూ అభివృద్ధి చేయాలని రాసింది.

- సముద్ర (మెరైన్‌) కాలుష్యం కూడా ఉందని, నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది.

- వరద నీటి నిర్వహణ సరిగా లేదని, తగిన చర్యలు చేపట్టాలని పేర్కొంది.

- పోర్టులో భూమి కోతకు గురవుతోందని, నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది.

- ప్రమాదకరమైన ప్రాసెసింగ్‌ జరుగుతోందని, వాటి వల్ల రిస్క్‌ ఉన్నందున ఎమర్జన్సీ ప్రిపేర్డ్‌నెన్‌ ప్లాన్‌ అమలు చేయాలంది. గత సెప్టెంబరులో ఈ నివేదికను ఇవ్వగా పోర్టు యాజమాన్యం వాటిని పెడచెవిన పెట్టింది. ఇది వేసవి కావడం, గాలుల తీవ్రత అధికంగా ఉండడంతో కాలుష్యం పెరిగిపోయింది. తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని పరిసర గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-05-24T06:49:43+05:30 IST