చెరువు గొడవ

ABN , First Publish Date - 2022-05-23T07:22:06+05:30 IST

అది రౌతులపూడి మండలంలోని ఎన్‌ఎన్‌ పట్నం గ్రామం. ఈ ఊరి లో ఐదురోజులుగా సీతయ్యమ్మ చెరువు చుట్టూ వైసీపీ నేత అయిన సర్పంచ్‌ భర్తకు, దిగువ ప్రాంత రైతులకు వివాదం జరుగుతోంది.

చెరువు గొడవ
సీతయ్యమ్మ చెరువు వద్ద ఆందోళన చేస్తున్న మహిళలు

  • చెరువులో చేపల పెంపకానికి అనధికారికంగా లీజుకిచ్చిన వైసీపీ నేత
  • చేపల పట్టుబడికి సీతయ్యమ్మ చెరువు నీటిని తొలగించే ప్రయత్నం
  • సాగునీరు వృథా అవుతుందని రైతుల అభ్యంతరం
  • ఉపాధి హామీ సాకుతో చెరువు పనులు చేపట్టాలని ఎంపీడీవో ఆదేశం
  • పోలీసులు, అధికారుల సమక్షంలోనే నీటి విడుదల
  • నిస్సహాయులుగా మారిన రైతులు.. రౌతులపూడి మండలంలో ఘటన

రౌతులపూడి, మే 22: అది రౌతులపూడి మండలంలోని ఎన్‌ఎన్‌ పట్నం గ్రామం. ఈ ఊరి లో ఐదురోజులుగా సీతయ్యమ్మ చెరువు చుట్టూ వైసీపీ నేత అయిన సర్పంచ్‌ భర్తకు, దిగువ ప్రాంత రైతులకు వివాదం జరుగుతోంది. చేపల పట్టుబడికోసం చెరువులో నీరు తీయించేందుకు వైసీపీ నేత ప్రయత్నాలు చేస్తుండగా వ్యవసాయ అవసరాలకోసం నీరు పోనివ్వకూడదని రైతులు అడ్డుపడుతున్నారు. నీరు తీసేస్తే పదిరోజుల్లో వేసే నారుమడులకు నీళ్లెక్కడివని వారు వాదిస్తున్నారు. మహిళలు చెరువు వద్దకు వచ్చి ఆందోళన చేసినా అతడు పట్టించుకోలేదు. పోలీసులు, అధికారుల సహాయంతో చెరువులో నీటిని శనివారం తీయించి వేశాడు.

రౌతులపూడి మండలంలోని ఎన్‌ఎన్‌పట్నం గ్రామంలో సీతయ్యమ్మచెరువు ఉంది. ఈ చెరువులో సాగునీరు పుష్కలంగా ఉంది. ఈ ఏడాది ముందుగానే నారుమడులు వేసుకునేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. కాగా ఈ చెరువులో చేపలు పెంచుకునేందుకు పంచాయతీ తీర్మానం కానీ, గ్రామసభ అనుమతి కానీ లేకుండా సదరు వైసీపీ నేత రెండేళ్ల క్రితం లీజుకు ఇచ్చి ఆ సొమ్ములను తన జేబులో వేసుకున్నాడు. చేపలు పెరగడంతో రావడంతో లీజుదారులు చేపలు పట్టేందుకు నీటిని తీయాలని వైసీపీ నేత దృష్టికి తీసుకువచ్చారు. నాలుగురోజు క్రితం చెరువులో నీటిని తీసేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. దీంతో నీరు తీసే ప్రయత్నాన్ని వదులుకున్నారు. మళ్లీ ప్రయత్నించినా అడ్డుకున్నారు. దీంతో ఆ వైసీపీ నేత ఉపాధి పనులు చేపట్టాలని సర్పంచ్‌ భర్త హోదాతో ఎంపీడీవోను కోరాడు. రైతులు కూడా ముందుకు వెళ్లి నీటిని తీయవద్దని ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంపీడీవో వ్యవసాయశాఖాధికారిని సంప్రదించగా ఆయన చెరువు కింద ప్రస్తుతం పంటలు ఏమీ లేవని, వచ్చే నెలలో ఆకుమడులు వేస్తారని నివేదిక ఇచ్చారు. చెరువులో చేపలు ఉన్నట్లు అందులో ప్రస్తావించలేదు. వ్యవసాయాధికారి నివేదిక ఆధారంగా ఎంపీడీవో ఉపాధి పనులు చేయడానికి ఆగమేఘాలపై వర్క్‌ ఐడియా 496980 జీవో జారీ చేసేశారు. ఇదే అదునుగా సోమవారం నుంచి ఉపాధి పనులు చేపడతామని, అక్కడ రైతులు అడ్డుకుంటున్నారని తుని రూరల్‌ పోలీ్‌సలకు ఫిర్యాదు చేశారు. చెరువు వద్దకు పోలీ్‌సలతోపాటు పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి చేరుకుని నీటిని విడుదల చేసేశారు. విషయం తెలిసిన మహిళలు, రైతులు చేరుకుని ఆందోళన చేశారు. ఉపాధి పనులు చేయడానికి చెరువులు చాలా ఉన్నాయని, పదిరోజుల్లో నారుమడులు వేసుకునే సమయంలో నీరు విడుదల చేసి రైతులు పొట్ట కొట్టవద్దని అధికారులను వేడుకున్నారు. అయినా పట్టించుకోకుండా నీటిని విడుదల చేశారు. నీటి విడుదల సమయంలో వల ఎందుకు అడ్డంగా పెట్టారని, చేపల కోసమే నీటి విడుదల చేస్తున్నారని వారితో వాదించారు. అయినా ఎవరూ వినలేదు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-05-23T07:22:06+05:30 IST