చెరలో చెరువులు.. కబ్జాలో కుంటలు

ABN , First Publish Date - 2021-03-07T04:14:36+05:30 IST

విశాలమైన నల్లమల, పుణ్య క్షేత్రాలకు నిలయమైన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రనతినిధులు చెరువులను చెరబట్టి, కుంటలను కబ్జా చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

చెరలో చెరువులు..  కబ్జాలో కుంటలు
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండి సంజయ్‌

- పుణ్యక్షేత్రాల నాగర్‌కర్నూల్‌ జిల్లాను దోచుకుంటున్నారు

- టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే సూత్రాధారులు

- సోమశిల-సిద్దేశ్వరంలో బ్రిడ్జికి రాష్ట్ర వాటా అడిగితే చేతులెత్తేశారు

- పట్టభద్రుల చేతిలోనే తెలంగాణ భవిష్యత్‌

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మార్చి 6 : విశాలమైన నల్లమల, పుణ్య క్షేత్రాలకు నిలయమైన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రనతినిధులు చెరువులను చెరబట్టి, కుంటలను కబ్జా చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్‌లో శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు అధ్యక్షతన నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ పట్టభధ్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. సమ్మేళనానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు నాయకులు బస్‌డిపో నుంచి బైక్‌ ర్యాలీతో వారిని సభా స్థలికి తీసుకువచ్చారు. అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ సోమశిల-సిద్దేశ్వరం బిడ్జీ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందని, రాష్ట్రం వాటా ఇవ్వాలని ఎల్లేని సుధాకర్‌రావు, జిల్లా నాయకులు సీఎం కేసీఆర్‌ను కలిస్తే మొత్తం నిధులు మీ జిల్లాకే ఇవ్వాలా చేతులేత్తేసారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం, మంత్రులు బీజేపీని ఇష్టం వచ్చి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకుంటే లాగులు వదిలిచ్చి తొండలు ఎక్కించి కొడతామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయారని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్టభధ్రులు, మేధావుల చెతిలో ఉందని అన్నారు. రాష్ట్రంలో అమలువుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, రైతువేదికులు, కమ్యునిటీ హాళ్లు, మిషన్‌ భగీరథ, హరితహారం పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే కొనసాగుతున్నా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం ప్రధాని మోదీ ఫొటోను ఎక్కడా పెట్టడం లేదని చెప్పారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో బీజేపీ ముందుండి పోరాటాలు చేసిందని, పోలీసులతో దెబ్బలు తిన్నదని అన్నారు. పోలీసులకు బీజేపీ వ్యతిరేకం కాదని, కేవలం కేసీఆర్‌ మోచేతి నీళ్లు తాగే కొందరు అధికారులకే వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. 

డీకే అరుణ మాట్లాడుతూ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసే వాళ్లు తెలంగాణ ద్రోహులని అన్నారు. తెలంగాణ ద్రోహులను తన పార్టీలో చేర్చుకొని, మంత్రి పదవులు కట్టబెట్టిన తెలంగాణ గాంధీనని చెప్పుకుంటున్న కేసీఆర్‌, దొంగ గాంధీ అని విమర్శించారు. బీజేపీ అఽభ్యర్థి రామచందర్‌రావు శాసన మండలిలో అత్యధిక సమయం ప్రజా సమస్యలు, నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన వ్యక్తి అని, ఆయనను మళ్లీ గెలిపించుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు బంగారు శ్రుతి, కట్టా సుధాకర్‌రెడ్డి, నాయకులు కపిలవాయి దిలీప్‌కుమార్‌, ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మృత్యుంజయరెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జి దిలీపాచారి, పార్లమెంటు ఇన్‌చార్జి బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, నాయకులు రఘువర్దన్‌రెడ్డి, మణెమ్మ పాల్గొన్నారు. 

కేసీఆర్‌కు దిమాక్‌ పని చేస్తలేదు

కల్వకుర్తి టౌన్‌ : దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తాని చూసి కేసీఆర్‌కు దిమాక్‌ పని చేయడం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ అంటేనే టీఆర్‌ఎస్‌ నాయకులు భయం పట్టుకుందని చెప్పారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాకుండా, కేసీఆర్‌ కుటుంబంలో ఉద్యోగ భద్రత కల్పించుకునేందుకు మాత్రమే తెలంగాణ ఏర్పడినట్లుగా మారిందని అన్నారు. ఆయన అహంకారం తగ్గాలంటే పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను తుక్కుతుక్కుగా ఓడించి, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ జాతీయ ఎస్సీ సెల్‌ నాయకురాలు బంగారు శ్రుతి, నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు సుఽధాకర్‌రావు, నాయకులు దుర్గాప్రసాద్‌, రాఘవేందర్‌గౌడ్‌, కృష్ణగౌడ్‌, శేఖర్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.


Updated Date - 2021-03-07T04:14:36+05:30 IST