ధాన్యం.. దైన్యం

ABN , First Publish Date - 2022-01-21T05:58:10+05:30 IST

ఆరుగాలం శ్రమించి చమటోడ్చి సాగు చేసిన పంట చేతికి వచ్చే దశలో వర్షార్పణం అయింది.

ధాన్యం.. దైన్యం

ధాన్యం విక్రయించేందుకు నెలరోజులుగా ఎదురుచూపులు

కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నిరసనలు  

ప్రభుత్వ జాప్యంలో రైతుల్లో ఆగ్రహం


పంట పండించిన అన్నదాతలు దానిని విక్రయించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు దారుల కోసం ఎదురు చూస్తున్నారు. పొన్నూరు, చేబ్రోలు మండలాల్లో గత నెల రోజులుగా ధాన్యం అమ్ముకోవడానికి అనేక ప్రయాసలు పడుతున్నారు. కొనేవారు లేక ఏ రహదారిపై చూసిన ధాన్యం రాశులే దర్శనమిస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వం కొనుగోలుకు ఆసక్తి చూపకపోవడం మరో వైపు దళారులు ధాన్యాన్ని సగం ధరకు కొనుగోలు చేయడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.  


పొన్నూరుటౌన్‌, జనవరి 20:  ఆరుగాలం శ్రమించి చమటోడ్చి సాగు చేసిన పంట చేతికి వచ్చే దశలో వర్షార్పణం అయింది. మండలంలో నవంబరు నెల చివరిలో తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. వరి పంట కోత దశ, గింజ పాలు పోసుకునే దశలో భారీ వర్షాలు కురవడంతో పంట నేలవాలి పూర్తిగా దెబ్బతింది. నేల వాలిన పంట రంగు మారిపోవడం, గింజ నుంచి మొలకలు రావడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అయితే ఆ సమయంలో ప్రభుత్వ పాలకులు అధికారులు పర్యటించి రైతులను ఆదుకుంటామని హామీలు గుప్పించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కానీ నెలల గడుస్తున్నా దెబ్బతిన్న ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్వర్వులు వెలువడ లేదు. కాగా వర్షాల బారిన పడకుండా రైతులు శ్రమకోర్చి కాపాడుకున్న పంట బాగానే ఉన్నా ఆ ధాన్యం కొనుగోలుకు సైతం ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో అన్నదాతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మద్ధతు ధరకు ప్రతి గింజ కొంటామంటూ పాలకులు, అధికారులు పదేపదే  ప్రకటలను ఇస్తున్నప్పటికీ అది వాస్తవ రూపంలో విరుద్ధంగా ఉంది. కొన్ని కొనుగోళ్ల కేంద్రాల్లో రైతుల నుంచి శాంపిల్స్‌ సేకరించి కొనుగోలుకు టోకెన్‌లు ఇచ్చి పది రోజులు గడుస్తున్నప్పటికీ కేంద్రాల నిర్వాహకులు ముందుకు రావడం లేదు. కొందరి అనుకూల రైతుల నుంచి మాత్రమే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఎక్కువ మంది రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో నిబంధనల సాకుతో తిరస్కారానికి గురైన రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను, రైస్‌ మిల్లర్లను ఆశ్రయించినా వారి నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా తాము ధాన్యం కొనుగోలు చేయలేమని మిల్లర్లు చెబుతున్నారు. గ్రామాలలో రైతు దుస్థితిని ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు రంగ ప్రవేశం చేసి ధాన్యం బస్తా రూ.900 నుంచి రూ.1000కు కొనుగోలు చేస్తామని బేరం ఆడుతూ రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. అదే దళారులు రైతుల పేరుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి మద్దతు ధరకు అమ్మి జేబులు నింపుకొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు రైతులు అమ్మిన ధాన్యంకు నేటి వరకు నగదు జమ కాలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

  అరకొరగా ధాన్యం కొనుగోళ్లు

 పొన్నూరు, చేబ్రోలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు అరకొరగా సాగుతున్నాయి. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం పొన్నూరు మండలంలోని 29 గ్రామాలలో 15 కొనుగోళ్ల కేంద్రాల ద్వారా 1,596 మెట్రిక్‌ టన్నులు ధాన్యం మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. చేబ్రోలు మండలంలో 13 గ్రామాలలో 16 కేంద్రాల ద్వారా 1856 టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిపారు. పెదకాకాని మండలంలో 11 కేంద్రాల ద్వారా 1336 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. పొన్నూరు, చేబ్రోలు మండలాల్లో 20 వేల హెక్టార్లకు పైగా ఖరీఫ్‌లో వరి సాగు అయింది. మిగిలిన రైతుల అందరూ ధాన్యం అమ్ముకునే దారి కోసం ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ప్రకటించిన విధంగా ధాన్యం మొత్తం కొనుగోళ్లు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-01-21T05:58:10+05:30 IST