ltrScrptTheme3

సూపర్ ‌‘ఫిట్‌’ గర్ల్‌

Feb 14 2021 @ 12:50PM

టాలీవుడ్‌ కథానాయికల్లో టాప్‌ వన్‌ రేసులో ముందున్న సుందరి పూజా హెగ్డే. ‘అల వైకుంఠపురంలో..’ సినిమాతో అమ్మడి గ్రాఫ్‌ అంతెత్తుకు చేరింది. నటనతో పాటూ ఆమె అందం, ఫిట్‌నెస్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ప్రత్యేక పాత్ర పోషించాయి. ఈ బుట్టబొమ్మ ఫిట్‌నెస్‌ రహస్యాలేంటో తెలుసుకుందామా.


ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌

హీరోయిన్‌ అనగానే అందానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని అనుకుంటాం కానీ పూజా డిఫరెంట్‌. ఆమె మొదటి ప్రాధాన్యం మాత్రం ఫిట్‌నె్‌సకే. పూజ ఇన్‌స్టా ఖాతా తెరిస్తే చాలు అన్నీ ఫిట్‌నెస్‌ ఫోటోలే దర్శనమిస్తాయి. బాలీవుడ్‌కు చెందిన ఉత్తమ ఫిట్‌నెస్‌ ట్రైనర్లను శిక్షకులుగా నియమించుకుంది. నమ్రతా పురోహిత్‌, అదితి దేశ్‌పాండే, హారిసన్‌ జేమ్స్‌ ఆమెకు రోజూ చేయాల్సిన వర్కవుట్లను ముందే వివరిస్తారు. సినిమా షెడ్యూల్‌తో బిజీగా ఉన్నా కూడా కచ్చితంగా ట్రైనర్లు చెప్పిన సమయానికి వర్కవుట్లు చేసి తీరుతుంది పూజ.


‘పలాటీ్‌స’తో మొదలు

పూజ తొలి సినిమా ‘మొహెంజదారో’. హృతిక్‌రోషన్‌తో నటించిన ఆ సినిమాలో పూజను చూసి బక్కపల్చటి పిల్ల, అన్‌ఫిట్‌ గర్ల్‌ అంటూ కామెంట్లు చేశారు. ఆ మాటలే ఆమెలో కసిని పెంచి ‘ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌’ను చేశాయి. రోజూ 45 నిమిషాల పాటూ వర్కవుట్లు చేయడం ప్రారంభించింది. ‘పలాటీ్‌స’తో తన వర్కవుట్‌ సెషన్‌ మొదలుపెడుతుంది. కేలరీలను కరిగించడంలో పలాటీస్‌ ముందుంటాయి. అంతేకాదు పొట్ట దగ్గర కొవ్వు తగ్గేలా చేస్తాయి. పూజ దాదాపు పావుగంట సేపు పలాటీస్‌ చేస్తుంది. పొట్ట నుంచి కింది భాగాన్ని దృఢంగా చేయడానికి ఈ వర్కవుట్‌ ఉపకరిస్తుంది. 


కెలోరీల లెక్క

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం, ఫిట్‌నెస్‌ రెండూ అవసరమని చెబుతుంది పూజ. ఆ క్రమంలో ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని అంటోంది. తాజా పండ్ల రసంతో తన రోజును మొదలుపెడుతుంది. టోస్ట్‌, కప్పు పెరుగు, ఓట్స్‌ వంటివి బ్రేక్‌ఫా్‌స్టలో తింటుంది. లంచ్‌లో రైస్‌ లేదా రోటీలు, ఉడికించిన కూరగాయలు, పప్పు, పండ్ల రసంతో ముగిస్తుంది. రాత్రి పూట చాలా తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటుంది.  ప్రతి రెండు గంటలకోసారి ఏదో ఒకటి తింటుంది. ఏది తిన్నా ఎన్ని కెలోరీలు తింటుందో లెక్కచూసుకుంటుంది. బరువు పెరగకుండా జాగ్రత్త పడుతుంది. నెయ్యి, కొబ్బరినూనెతోనే వంటకాలు వండించుకుంటుంది. జంక్‌ ఫుడ్‌ తింటే మాత్రం ఆ రోజు ఎక్కువ సేపు జిమ్‌లోనే గడుపుతుంది. 


గాలిలో వేలాడే ఏరియల్‌ సిల్క్స్‌ 

ఇది కష్టతరమైనదే. అయినా  పావుగంటసేపు ఏరియల్స్‌ సిల్క్స్‌ వర్కవుట్లు చేస్తుంది. ఇందులో పైనుంచి వేలాడుతున్న పొడవాటి తాళ్లలాంటి వస్త్రాల సాయంతో గాలిలోనే రకరకాల వర్కవుట్లను చేస్తారు. వాటిని చేయడంలో పూజ దిట్ట. పొట్ట నుంచి పైభాగం (అప్పర్‌ బాడీ) దృఢంగా మారేందుకు ఏరియల్‌ సిల్క్స్‌ ఉపకరిస్తాయి. అందుకే రోజూ కచ్చితంగా వీటిని చేస్తుంది. దీంతో గుండె కండరాలకు సత్తువ లభిస్తుంది. శరీరం దృఢంగా ఉంటే ఎంత సేపయినా అలసట లేకుండా, ఉత్సాహంగా షూటింగ్‌లో పాల్గొనవచ్చని అంటోంది పూజ. 


క్రాస్‌ఫిట్‌ ట్రైనింగ్‌

ఇవి ఇంట్లోనే ఎవరికి వారు చేసుకోగలిగిన సులభమైన వర్కవుట్లు. పూజ రోజూ రకరకాల క్రాస్‌ఫిట్‌ వర్కవుట్లు చేస్తుంది. రోజులో దాదాపు పావుగంట  సేపు ఈ ట్రైనింగ్‌లోనే ఉంటుంది. ఇందులో భాగంగా బరువులు ఎత్తడం, తాడు పట్టుకుని గెంతడం, పరిగెత్తడం, రోయింగ్‌, బరువైన కెటిల్‌బాల్‌ను ఎత్తి దించడం వంటి చాలా రకాల వర్కవుట్లు ఉంటాయి. వీటి వల్ల శరీరంలోని కండరాలు దృఢంగా మారతాయి. గుండె పనితీరు మెరుగుపడుతుంది. బరువు పెరగకుండా ఉండేందుకు క్రాస్‌ఫిట్‌ ట్రైనింగ్‌ తనకు సహకరిస్తుందని చెబుతోంది పూజ.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.