‘ఆదర్శ గ్రామ’ పథకం అమలు అధ్వానం

ABN , First Publish Date - 2021-10-27T08:22:18+05:30 IST

మారుమూల గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సమగ్ర గ్రామాభివృద్ధి కోసం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 11న ప్రారంభించారు..

‘ఆదర్శ గ్రామ’ పథకం అమలు అధ్వానం

మారుమూల గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సమగ్ర గ్రామాభివృద్ధి కోసం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 11న ప్రారంభించారు.. అయితే దీని అమలు తీరు నిరాశా జనకంగా ఉంది. ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడు మూడు గ్రామాల చొప్పున దత్తత తీసుకుని వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, తమ నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలని, ఎంపీ నిధులే కాక ఇతర నిధులతో ఒక సంవత్సరంలో గ్రామాలను అభివృద్ధి పరచాలని నిర్దేశించినా వాస్తవానికి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. లోక్‌సభ సభ్యులే కాకుండా రాజ్యసభ సభ్యులు కూడా తాము ఎన్నికైన రాష్ట్ర పరిధి లేక దేశంలో ఎక్కడైనా, సంవత్సరానికి ఒక గ్రామాన్ని అభివృద్ధి పరచాలని మార్గదర్శకాలు ఉన్నా ఆ లక్ష్యం నెరవేరకపోవడం బాధాకరం. ఒక మంచి లక్ష్యంతో ప్రారంభమైన పథకం అమలుతీరు అపసవ్యంగా ఉండడంతో అభివృద్ధి పూర్తిస్థాయిలో జరగడంలేదు. ఇప్పటికైనా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు చిత్తశుద్ధితో కృషి చేసి తమ నియోజకవర్గాలలో గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలి.

వావిలాల రాజశేఖర శర్మ

Updated Date - 2021-10-27T08:22:18+05:30 IST