చెక్‌డ్యామ్‌ నిర్మాణంలో నాణ్యతాలోపం

ABN , First Publish Date - 2021-07-28T05:51:31+05:30 IST

మానేరు వాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల పనుల్లో నాణ్యతాలేమి కొట్టొచ్చినట్లు కనబడుతున్నది.

చెక్‌డ్యామ్‌ నిర్మాణంలో నాణ్యతాలోపం
ఇటీవల కురిసిన వర్షాలకు కుంగిన నీరుకుళ్ల చెక్‌ డ్యామ్‌

- వరదలకు కుంగిన నీరుకుళ్ల చెక్‌డ్యామ్‌

- పగుళ్లుబారిన బేస్‌.. నాసిరకంగా పనులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మానేరు వాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల పనుల్లో నాణ్యతాలేమి కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. అధికారుల పర్యవేక్షణ కొరవడిన కారణంగానే సంబంధిత కాంట్రాక్టర్‌ పనులను నాణ్యతగా చేయలేదని తెలుస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు మానేరు డ్యామ్‌ నిండడంతో గేట్ల ద్వారా నీటిని వదిలిపెట్టారు. ఆ వరద అంతా మానేరులో నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల మీదుగా పోయింది. సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్ల వద్ద రూ.15కోట్ల 95 లక్షలతో నిర్మిస్తున్న పనుల డొల్లతనం వర్షాలతో బయటపడింది. ఈ పనిని వేసవిలో ప్రారంభించారు. మానేరులో సగం దూరం వరకు అడుగు లోతు నుంచి పునాది తీసి కాంక్రీట్‌తో పెద్దఎత్తున బెడ్‌ను నిర్మించారు. దానిపై మానేరులో నీళ్లు నిల్వ ఉండేందుకు గాను నాలుగైదు అడుగుల ఎత్తున డ్యామ్‌ను, ఇరువైపులా సైడ్‌వాల్స్‌ను కూడా నిర్మిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పనులను కాంట్రాక్టర్‌ నిలిపివేశారు. ఒక్క ఇక్కడే గాకుండా గొల్లపల్లి, గట్టెపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ముత్తారం, మంథని మండలాల పరిధిలో కూడా చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తున్నారు. వీటన్నింటికీ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలకు పైగా మంజూరుచేసింది. ఇందులో చాలా చెక్‌డ్యామ్‌ల పనులను అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడికి సంబంధించిన కాంట్రాక్టు సంస్థ దక్కించుకున్నది. నీరుకుళ్ల వద్ద నిర్మిస్తున్న చెక్‌ డ్యామ్‌ పనుల్లో నాణ్యత కొరవడింది. అడుగు భాగంలో మట్టి గట్టితనాన్ని బట్టి డ్యామ్‌ను నిర్మించాల్సి ఉంటుంది. అడుగుభాగం నుంచి నిర్మించిన బేస్‌ కుంగిపోవడంతో దానిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ రెండు ముక్కలైంది. దాని ముందుభాగంలోగల బేస్‌ కూడా పగుళ్లు బారింది. పనులపై సంబంధిత నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడినట్లుగా దీనిని బట్టి తెలుస్తున్నది. భవిష్యత్తులో ఇటీవల కురిసిన వర్షాలకంటే భారీవర్షాలు కురిసి పెద్దఎత్తున వరద వస్తే ఈ చెక్‌డ్యామ్‌లు కొట్టుకుపోవడం ఖాయమని తెలుస్తున్నది. ఓదెల మండలం మడక వద్ద గత ఏడాది నిర్మించిన చెక్‌డ్యామ్‌ ఒకపక్క కుంగిపోయి బీటలు వారింది. దానిని అధికారులు తిరిగి నిర్మాణం చేపట్టలేదు. మానేరు వాగు వెడల్పు ఎక్కువగా ఉన్న కారణంగా దీనిపై నిర్మించే చెక్‌ డ్యామ్‌లు పెద్ద వరదలకు తట్టుకోవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నాణ్యత లేమితో నిర్మించే చెక్‌డ్యామ్‌ల వల్ల కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా అవుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే నీరుకుళ్ల వద్ద నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ కుంగి పోయి బీటలు వారిందని ఈప్రాంత రైతాంగం చెబుతున్నది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చెక్‌డ్యామ్‌ పనుల నాణ్యతపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-07-28T05:51:31+05:30 IST