పేదల బియ్యం.. ఆధార్‌తో లింక్‌!

ABN , First Publish Date - 2020-12-03T06:54:50+05:30 IST

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలు ఇకపై బియ్యం పొందాలంటే ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. ఆధార్‌తో అనుసంధానమై ఉన్న

పేదల బియ్యం.. ఆధార్‌తో లింక్‌!

పీడీఎస్‌ లబ్ధి పొందడానికి తప్పనిసరి.. రేషన్‌ డీలర్‌కు ఓటీపీ చెప్పాల్సిందే

కార్డు లేని వారు తక్షణమే తీసుకోవాలి.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలు ఇకపై బియ్యం పొందాలంటే ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. ఆధార్‌తో అనుసంధానమై ఉన్న ఫోన్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ(వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) చెబితేనే రేషన్‌ డీలర్లు సరుకులు పంపిణీ చేస్తారు. ఈ మేరకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బయోమెట్రిక్‌, ఐరిస్‌ ద్వారా చౌకడిపోల్లో పేదలకు బియ్యం పంపిణీ చేస్తుండగా... ఇక నుంచి ‘ఆధార్‌’ నంబర్‌ను కూడా ప్రామాణికంగా తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. దీంతో ఆధార్‌ కార్డులు లేని వారు తక్షణమే నమోదు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.


పీడీఎస్‌ ప్రయోజనాలు పొందడానికి ‘ఆధార్‌’ను తప్పనిసరి చేస్తూ 2017 ఫిబ్రవరి 8వ తేదీనే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకనుగుణంగా రాష్ట్రంలోనూ కొంత మంది వినియోగదారుల ఆధార్‌ నంబర్లను పౌరసరఫరాల శాఖ సేకరించింది. ఇంకా కొంతమందివి సేకరించాల్సి ఉంది. ప్రస్తుతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆహార భద్రత కార్డుల ఆధారంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. కార్డుల జారీ సమయంలోనే వినియోగదారుల నుంచి బయోమెట్రిక్‌(వేలిముద్రలు), ఐరి్‌ష(కనుపాపలు) సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చౌక డిపోల్లో ఈ-పాస్‌ మిషన్లు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత బయోమెట్రిక్‌ ద్వారా బియ్యం అందజేస్తున్నారు.




అయితే,  కొందరు వినియోగదారుల వేలిముద్రలను ఈ-పాస్‌ మిషన్లు స్కాన్‌ చేయలేకపోతున్నాయి. ఉపాధిహామీ, వ్యవసాయ పనులు చేసే కూలీల చేతి వేళ్లపై రేఖలు అరిగిపోయిన సందర్భారాల్లో బయోమెట్రిక్‌ నమోదు కావడం లేదు. ముడతలు రావటంతో వృద్ధుల బయోమెట్రిక్‌ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు ‘కొవిడ్‌-19’ తోడవటంతో బయోమెట్రిక్‌ పూర్తి శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ మేరకు ఆహారభద్రత కార్డులో నమోదై ఉన్న ప్రతి వినియోగదారుడు.. తమ ఆధార్‌ జిరాక్స్‌ కాపీని సంబంధిత డీలర్‌కు ఇవ్వాలి. ఆధార్‌తో అనుసంధానమై ఉన్న ఫోన్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీతోనే డీలరు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 87.55 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా, వీటిలో 2.97 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఆధార్‌ కార్డులు లేని వారు తక్షణమే నమోదు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ సూచించారు.


Updated Date - 2020-12-03T06:54:50+05:30 IST