ఇరాక్ షియా మత పెద్దతో పోప్ ఫ్రాన్సిస్ భేటీ

ABN , First Publish Date - 2021-03-07T01:58:08+05:30 IST

ముస్లిం-క్రైస్తవుల శాంతియుత సహజీవనాన్ని ఆకాంక్షిస్తూ

ఇరాక్ షియా మత పెద్దతో పోప్ ఫ్రాన్సిస్ భేటీ

న్యూఢిల్లీ : ముస్లిం-క్రైస్తవుల శాంతియుత సహజీవనాన్ని ఆకాంక్షిస్తూ పోప్ ఫ్రాన్సిస్ ఇరాక్‌లోని నజఫ్ నగరంలో ఇస్లాం షియా సీనియర్ మత పెద్ద గ్రాండ్ అయతొల్లా అలీ అల్-సిస్టానీతో భేటీ అయ్యారు. ఇరాక్‌లోని మైనారిటీ క్రైస్తవులను ముస్లింలు ఆదరించాలని పోప్ కోరారు. ఈ చారిత్రక సమావేశం అల్-సిస్టానీ నివాసంలో జరిగింది. వాటికన్, అయతొల్లా కార్యాలయం అన్ని వివరాలను చర్చించిన తర్వాత ఈ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. 


షియాలకు ప్రపంచంలో ముఖ్యమైన ప్రార్థనా స్థలాల్లో నజఫ్‌లోని ఇమామ్ అలీ ఒకటి. షియా మత పెద్ద అల్-సిస్టానీ నివాసానికి వెళ్ళే మార్గంలో సంప్రదాయ దుస్తులు ధరించిన ఇరాకీలు పోప్ ఫ్రాన్సిస్‌కు ఘన స్వాగతం పలికారు. శాంతిని కోరుకుంటూ తెల్ల పావురాలను ఎగురవేశారు. 


ఇరాక్‌లో షియాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ క్రైస్తవులు మైనారిటీలో ఉన్నారు. షియాలపై అల్-సిస్టానీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆయనను షియాలు అత్యున్నత స్థాయిలో గౌరవిస్తారు. మతపరమైన, ఇతర విషయాల్లో ఆయన అభిప్రాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలు గౌరవిస్తారు. 


Updated Date - 2021-03-07T01:58:08+05:30 IST