ప్రజావిజయం

ABN , First Publish Date - 2021-06-04T05:53:55+05:30 IST

చిలీలో ఇటీవల రాజ్యాంగ రచనా పరిషత్‌ కోసం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు సభ్యులను ఎన్నుకున్న తీరు కచ్చితంగా ఆశ్చర్యం కలిగించేదే....

ప్రజావిజయం

చిలీలో ఇటీవల రాజ్యాంగ రచనా పరిషత్‌ కోసం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు సభ్యులను ఎన్నుకున్న తీరు కచ్చితంగా ఆశ్చర్యం కలిగించేదే. నూతన రాజ్యాంగం ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నారో వారు ముందే ఈ ఎంపిక ద్వారా స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిషత్తుతో పాటు, గవర్నర్లు, మేయర్లు, కౌన్సిలర్ల స్థానాలకు కూడా జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు మితవాదులను తుడిచిపెట్టేశారు. నియంత ఆగస్టో పినొచెట్‌ కాలంలో రూపుదిద్దుకున్న అమానవీయమైన, పెట్టుబడిదారీ అనుకూల రాజ్యాంగం స్థానంలో సామాన్యుల, పేదల మెరుగైన భవిష్యత్తుకు పూచీపడే రాజ్యాంగం కావాలని ప్రజలు ఈ ఓటుద్వారా స్పష్టం చేశారు.


కొత్త రాజ్యాంగసభలోని 155 స్థానాల్లో 65 స్థానాలు స్వతంత్రులే గెలిచారు. వీరంతా నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకులు. అలాగే, మధ్యేవాద, కమ్యూనిస్టు కూటములూ గణనీయమైన సీట్లు గెలుచుకున్నాయి. మొత్తంగా నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన శక్తులే 117 స్థానాల్లో విజయం సాధించి కొత్త రాజ్యాంగసభను ఆక్రమించుకున్నాయి. ఆర్థిక అసమానతలకు, కార్పొరేట్‌ దోపిడీకీ మారుపేరైన చిలీలో పేదల పక్షాన, వారి ఆశలూ ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన చేయవలసిన బాధ్యత వీరిపై ఉన్నది. ప్రస్తుత అధ్యక్షుడు పినేరా నేతృత్వంలోని మితవాద వామోస్‌ పార్టీ ముప్పై ఏడు సీట్లకు పరిమితం కావడంతో, సభకు నాయకత్వం వహించగలిగే అవకాశాన్ని కోల్పోయింది. ప్రపంచంలో అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుగా ఉన్న తమ దేశంలో, ఆర్థిక అసమానతలు పెరిగిపోవడానికీ, దేశం సర్వవిధాలా కునారిల్లిపోవడానికీ పినోచెట్‌ రాజ్యాంగమూ, ఆయన అనుయాయుల తదనంతరపాలనేనని ప్రజల నమ్మకం. ఈ కారణంగానే అధికారంలో ఉన్నవారికి కొత్త రాజ్యాంగాన్ని రాసే అవకాశం ఇవ్వకుండా, లిబరలైజేషన్‌ వ్యతిరేకులనూ, అధికశాతం యువకులనూ ఎన్నుకున్నారు. ఈ రాజ్యాంగ పరిషత్‌ కొత్త రాజ్యాంగ ముసాయిదాను ఏడాదిలోగా తయారుచేయాల్సి ఉంది. దేశవ్యాప్త రెఫరెండమ్‌తో దీనిపై ఆ తరువాత ప్రజాభిప్రాయం కోరతారు.


రెండేళ్ళక్రితం చిలీలో రేగిన ప్రజాపోరాటం నుంచి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరపాలన్న డిమాండ్‌ అంతిమంగా పుట్టుకొచ్చింది. మెట్రోచార్జీలను మూడోవంతు పెంచుతూ పినేరా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థిలోకం ఆరంభించిన ఉద్యమం అచిరకాలంలోనే అన్ని తరగతుల, వర్గాల ప్రజలను ఆకర్షించింది, విస్తరించింది. టిక్కెట్టు చార్జీలు తగ్గించాలన్న డిమాండ్‌కు ప్రజలు పరిమితం కాలేదు. సంక్షేమానికి చిల్లుపెట్టి, దోపిడీకి ద్వారాలు తెరిచిన రాజ్యాంగాన్నీ, రాజకీయ వ్యవస్థనీ సమూలంగా మార్చుకుంటే తప్ప బతుకులు బాగుపడవని నిర్ణయించుకున్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు పినేరా ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది, మిలటరీని దింపింది. అంతర్గత శత్రువులకు వ్యతిరేకంగా రాజ్యం చేస్తున్న యుద్ధం అని అధ్యక్షుడే దానిని అభివర్ణించాడు. సాయుధ దళాలు అత్యాచారాలకు, అకృత్యాలకు తెగబడ్డాయి. ఉద్యమం మరిన్ని వర్గాలకు విస్తరించిందే తప్ప తగ్గింది లేదు. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల నిర్ణయాలు తీసుకోవడానికీ, ప్రతిఘటించినవారిపై కిరాతకంగా విరుచుకుపడటానికీ కారణం ప్రస్తుత వ్యవస్థే కనుక దానిని మార్చాలన్న లక్ష్యంతో ప్రతీ దశలోనూ నిరసనకారులు చావుకు తెగించి పోరాడారు. నియంతల రాజ్యాంగాన్ని రద్దుచేసి, ప్రజల పక్షాన కొత్తది రాయడానికి పరిషత్తు ఏర్పాటు కావాల్సిందేనన్నారు. రాజ్యాంగాన్ని మేమే రాస్తామంటూ పాలకులు గట్టిగా పట్టుపట్టినా జనం ఒప్పుకోలేదు. 


సామాన్యుల చదువు, ఆరోగ్యం, సంక్షేమాలకు ఏ మాత్రం పూచీపడని పినోచెట్‌ రాజ్యాంగం పెట్టుబడిదారుల, బడావ్యాపారుల దోపిడీకి ద్వారాలు తెరిచింది. ఒకపక్క నిరుద్యోగం, పేదరికం తాండవిస్తుంటే, మరోపక్క ఏటా కొత్త శతకోటీశ్వరుల అవతరణ ప్రజల కళ్ళముందే సాగిపోతున్నది. ఈ పరిస్థితులను వారు భరించలేకపోయారు. అసమానతలను కరోనా మరింతగా స్పష్టంగా చూపి కళ్ళుతెరిపించింది. కొత్త రాజ్యాంగ పరిషత్తులో పురుషులకంటే మహిళలే ఎక్కువ. మూలవాసులకూ ప్రాధాన్యం దక్కింది. సభ్యుల సగటు వయసు కూడా నలభైఐదేళ్ళే. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రాజ్యాంగం రూపొంది, వారి పోరాటాలకు, త్యాగాలకు విలువా గౌరవం దక్కుతాయని ఆశిద్దాం. 

Updated Date - 2021-06-04T05:53:55+05:30 IST