రామాయపట్నం పోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు

ABN , First Publish Date - 2021-03-02T07:18:04+05:30 IST

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ప్రాథమికంగా అవసరమని గుర్తించిన 802 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్‌ వెలువడటమే గాక జాతీయరహదారి నుంచి పోర్టు ప్రతిపాదిత తీరం వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు కూడా రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు.

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి  వడివడిగా అడుగులు
రామాయపట్నం పోర్టు ప్రతిపాదిత ప్రాంతం

ప్రారంభమైన భూసేకరణ  ప్రక్రియ 

తుది దశకు చేరిన టెండర్ల ప్రక్రియ

అరబిందో రియల్టీకి నిర్మాణ  బాధ్యతలు 

నెల రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశం

కందుకూరు, మార్చి 1 : రామాయపట్నం పోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ప్రాథమికంగా అవసరమని గుర్తించిన 802 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్‌ వెలువడటమే గాక జాతీయరహదారి నుంచి పోర్టు ప్రతిపాదిత తీరం వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు కూడా రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు టెండర్లను కూడా పూర్తిచేసి త్వరితగతిన పనులు ప్రారంభించాలని పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మారిటైమ్‌ బోర్డు వేగంగా అడుగులు వేస్తోంది. రెండునెలల క్రితమే పోర్టు నిర్మాణం కోసం గ్లోబల్‌ టెండర్లు పిలవగా అర్హత కలిగిన కంపెనీలు ముందుకు రాకపోవటంతో రూ.2,647 కోట్ల అంచనాతో మరోదఫా రాష్ట్రప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. రెండో విడత మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు, అరబిందో రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ రెండు సంస్థల్లో అనుభవం ఉన్న మేఘా అంచనా కన్నా అదనపు మొత్తానికి, అరబిందో రియల్టీ 0.5శాతం తక్కువ మొత్తానికి తమ టెండర్లను దాఖలు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. అయితే అరబిందోకు పోర్టుల నిర్మాణంలో కనీస అనుభవం లేనందున కృష్ణపట్నం పోర్టు నిర్మాణంతోపాటు విస్తరణ, ఇటీవలి వరకు నిర్వహణ బాధ్యతలు చూసిన నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌తో కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నట్లు చెప్తున్నారు.  అధికారులు నాలుగైదు రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి నిర్మాణ  బాధ్యతలు అప్పగించదలచిన సంస్థతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


కొలిక్కి వస్తున్న భూసేకరణ  ప్రక్రియ 

మరోవైపు పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ  ప్రక్రియ కూడా కొలిక్కి వస్తున్నందున ఈ నెలాఖరులోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ప్రతిపాదిత తీరప్రాంత గ్రామాలైన ఆవులవారిపాలెం, మొండివారిపాలెం, కర్లపాలెంల పరిధిలో 802 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని నిర్ధారించిన అధికారులు భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీచేశారు. రెండునెలలుగా ఈ గ్రామాల పరిధిలో సర్వే పూర్తిచేసిన అధికారులు, భూమి కోల్పోతున్న బాధితులకు నగదు చెల్లించేందుకు మరో నెల పట్టవచ్చని భావిస్తున్నారు. పోర్టుకి అవసరమైన భూసేకరణతోపాటు, పోర్టు ప్రతిపాదిత ప్రాంతానికి జాతీయరహదారి నుంచి అనుసంధానంగా నాలుగు లైన్లతో రోడ్డు నిర్మించేందుకు అవసరమైన భూసేకరణకు కూడా ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉన్న చేవూరుకి దక్షిణం వైపు నుంచి ఈ రోడ్డు పోర్టు వద్దకు చేరేలా ఫైనల్‌ చేసి భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. జాతీయ రహదారి నుంచి రమారమి 6 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. చేవూరుకి దక్షిణం వైపు నుంచి అయితే రైల్వే క్రాసింగ్‌ ఉండదు. చెరువులు, కుంటలు అడ్డంకి కూడా లేకపోవటంతో ఆ మార్గాన్ని ఫైనల్‌ చేశారు.  ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో పోర్టు నిర్మాణ  పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 



Updated Date - 2021-03-02T07:18:04+05:30 IST