వెక్కిరింత

ABN , First Publish Date - 2022-08-19T06:01:02+05:30 IST

బందరు పోర్టు నిర్మాణం నవ్వులపాలైంది. రెండు సార్లు జరిపిన శంకుస్థాపన శిలాఫలకాలు పోర్టు నిర్మాణం విషయంలో పాలకుల నిర్లక్ష్య వైఖరిని కళ్లకు కట్టినట్లుగా చూపుతున్నాయి.

వెక్కిరింత

 మూడేళ్లలో అడుగు ముందుకు

 పడని బందరు పోర్టు పనులు

 రెండు విడతలుగా  శంకుస్థాపనలు

మేకావానిపాలెం వద్ద విరిగి పడిన పోర్టు శిలాఫలకం

న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతేనే..

సీఎం జగన్‌ స్పష్టమైన ప్రకటన చేస్తారా!

బందరు పోర్టు నిర్మాణం నవ్వులపాలైంది.  రెండు సార్లు జరిపిన శంకుస్థాపన శిలాఫలకాలు పోర్టు నిర్మాణం విషయంలో పాలకుల నిర్లక్ష్య వైఖరిని కళ్లకు కట్టినట్లుగా చూపుతున్నాయి. పోర్టు  నిర్మాణానికి రెండు సార్లు శంకుస్థాపన జరిగినా,  పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదు. అసలు   పోర్టు నిర్మాణం జరుగుతుందో లేదో కూడా తెలియని స్థితి. ఈనెల 23వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జిల్లా కేంద్రం మచిలీపట్నానికి సమీపంలోని పెడనలో అధికారికంగా పర్యటించనున్నారు. జిల్లాల విభజన జరిగిన సమయంలో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే బందరు పోర్టు నిర్మాణం ఒక్కటే మార్గమని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా బందర ుపోర్టు  నిర్మాణంపై కీలక ప్రకటన చేస్తారా, లేక  మరుగున పెడతారా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి బందరుపోర్టు నిర్మాణ ఆవశ్యకతను వివరించి, ఆయనను ఎంత మేర ఒప్పించ గలరనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణం కాంక్షిస్తూ 2001 నుంచి 2008 వరకు విడతల వారీగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగాయి. ప్రజా ఉద్యమాలకు తలొగ్గిన ప్రభుత్వాలు మొదటి విడతగా 2008 ఏప్రిల్‌ 23వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖరరెడ్డి బందరు మండలం చినకరగ్రహారం సమీపంలోని పల్లెపాలెం వద్ద పోర్టు పనులకు శంకుస్థాపన  చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ శిలాఫలకం శిథిలావస్థకు చేరింది. రెండో విడత 2019 ఫిబ్రవరి 8వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బందరు పోర్టు పనులను ప్రారంభించారు. బందరు మండలం మేకావానిపాలెం వద్ద మంగినపూడి బీచ్‌ రహదారి పక్కనే పోర్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2019లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం మూడు నెలల వ్యవధిలోనే పోర్టు టెండర్లను రద్దు చేసింది. మేకావానిపాలెం వద్ద ఏర్పాటు చేసిన పోర్టు శిలాఫలకంలో కొద్ది భాగం విరిగిపడింది. ఈ సంఘటన చూసిన ప్రజలు పోర్టు నిర్మాణంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను ఈ శిలాఫలకం చాటి చెబుతోందని చెప్పుకుంటున్నారు.

 టెండర్ల ప్రక్రియ ముగిసినా ...

బందరు పోర్టు టెండర్ల ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ముగిసింది. పోర్టు పనులను దక్కించుకునేందుకు మేఘా సంస్థతో పాటు, విశ్వ సముద్ర హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ టెండర్లు దాఖలు చేశాయి. మేఘా సంస్థ బందరుపోర్టు పనులను రూ.3,683.83 కోట్లతో చేసేందుకు టెండర్లు దాఖలు చేసింది. విశ్వ సముద్ర హోల్డింగ్‌ సంస్థ, మేఘా సంస్థ కన్నా 0.05 శాతం అధికంగా టెండర్లు దాఖలు చేసింది. దీంతో తక్కువ మొత్తానికి టెండర్లు దాఖలు చేసిన మేఘా సంస్థకు పనులు అప్పగిస్తూ ఏపీ మారిటైమ్‌బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీన మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పోర్టు నిర్మాణం జరిగే గ్రామాల రైతులు పోర్టు నిర్మాణం చేస్తే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఈ నివేదికను కలెక్టర్‌ కేంద్ర ప్రభుత్వానికి పంపారు. పోర్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రావడం లాంఛన ప్రాయమేనని ఏపీ మారిటైమ్‌ బోర్డు అధికారులు చెబుతున్నారు. 

 కోర్టు కేసు పరిష్కారమైతేనే..

 బందరు పోర్టుకు టెండర్లు పిలవడం, పర్యావరణ అనుమతులకోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపడం, టెండర్లు మేఘా సంస్థకు ఖరారు చేయడం ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ. పోర్టు పనులను దక్కించుకున్న మేఘా సంస్థకు  పను లు అప్పగించే ముందుగానే బందరు పోర్టుపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ నెం.12980/19తో ఉన్న కేసును పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసు పరిష్కారమైతేనే ప్రభుత్వం పోర్టు కాంట్రాక్టు పనులను దక్కించుకున్న సంస్థ నుంచి  లెటర్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌ తీసుకోవాల్సి ఉంది. కోర్టులో ఉన్న కేసును పరిష్కరించే దిశగా ప్రభుత్వ పెద్దలు నవయుగ సంస్థతో ఎంతమేర చర్చలు జరుపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. కోర్టులో కేసు పరిష్కారమైతే పోర్టు పనులను దక్కించుకున్న సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఒప్పందం కుదిరిన నాటి నుంచి 33 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. జిల్లా అభివృద్ధిలో కీలకమైన బందరుపోర్టు నిర్మాణం అంశంపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసి, పనులు ప్రారంభించేలా చర్యలు  తీసుకోవాలని జిల్లా ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. 


Updated Date - 2022-08-19T06:01:02+05:30 IST