పోషణ్‌ అభియాన్‌.. నిధులు అందేనా?

ABN , First Publish Date - 2022-10-03T04:40:46+05:30 IST

పోషణ్‌ అభియాన్‌ నిధుల కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.1.02 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన చెందుతున్నారు.

పోషణ్‌ అభియాన్‌.. నిధులు అందేనా?
అంగన్వాడీ కేంద్రంలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం

- అంగన్‌వాడీ కేండ్రాల్లో భారంగా వేడుకల నిర్వహణ
- జిల్లాలో రూ.1.02 కోట్ల బకాయిలు
- చేతిచమురు వదులుతోందంటున్న కార్యకర్తలు
(ఇచ్ఛాపురం రూరల్‌)

పోషణ్‌ అభియాన్‌ నిధుల కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.1.02 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన చెందుతున్నారు.  అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంపై పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెలా ఒకటి, మూడో బుధవారం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. గర్భిణులకు ఆరోగ్య వేడుకలు, అన్నప్రాసనం, ప్రీస్కూల్‌ పిల్లల సంసిద్ధత, సామాజిక ఆరోగ్యం, సుపోషణ వేడుక కార్యక్రమాలను  నిర్వహిస్తున్నారు. గతంలో కరోనాతో కొన్ని నెలల పాటు సామూహిక కార్యక్రమాలు నిర్వహించలేదు. గత ఏడాది సెప్టెంబరు నుంచి సామూహిక వేడుకలు తిరిగి ప్రారంభించారు. జిల్లాలో 15 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 3436 అంగన్‌వాడీ కేంద్రాల్లో 18,781 బాలింతలు, 17,398 గర్భిణులు, 1,09,839 మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ రోజువారీ పోషకాహారంతో పాటు ప్రభుత్వం సరఫరా చేస్తున్న చక్కీలు, కోడిగుడ్లు, బాలామృతం, పీచు పదార్థాలు కలిగిన కూరలు వంటి ఆహారంలో తీసుకోవాలని చైతన్యపరుస్తున్నారు. పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా పాయసం, వివిధ రకాల పండ్లు, పోషకాహార సామగ్రి కొనుగోలు చేసి అందజేస్తున్నారు. గర్భిణులకు సీమంతంతోపాటు పోషణ కార్యక్రమాల కోసం ఒక్కో కేంద్రానికి నెలలో రెండు కార్యక్రమాలకు రూ.500 చొప్పున అంగన్‌వాడీ కార్యకర్తలకు అందజేయాలి. కాగా.. ప్రభుత్వం గత ఏడాది నవంబరు నుంచి తమకు పోషణ్‌ అభియాన్‌ నిధులు మంజూరు చేయడం లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.1.02 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొంటున్నారు. రెండు నెలలుగా వేతనాలు కూడా చెల్లించకపోవడంతో అప్పు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

ఖాతాల్లో జమ చేస్తాం :
పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు అంగన్‌వాడీ కేంద్రాల నుంచి సీడీపీవోల ద్వారా సేకరించాం. వాటిని సీఎఫ్‌ఎంఎస్‌లో ఆప్‌లోడ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే.. అంగన్‌వాడీ కార్యకర్తల ఖాతాల్లో జమ చేస్తాం.
- అనంతలక్ష్మీ, ఐసీడీఎస్‌ పీడీ, శ్రీకాకుళం.

Updated Date - 2022-10-03T04:40:46+05:30 IST