కేసీఆర్‌ కుటుంబానికి పదవులు.. ప్రజలకు బాధలు

ABN , First Publish Date - 2022-06-30T10:22:45+05:30 IST

సూర్యాపేటటౌన్‌, జూన్‌ 29: కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదవులు సీఎం కేసీఆర్‌ కుటుంబానికి వస్తే.. తెలంగాణ ప్రజలకు బాధలు మిగిలాయని

కేసీఆర్‌ కుటుంబానికి పదవులు.. ప్రజలకు బాధలు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌, కోల్డ్‌స్టోరేజ్‌ యూనిట్లు ఎటుపోయాయి?

స్కూటర్‌పై తిరిగిన జగదీశ్‌రెడ్డి వేల కోట్లు ఎలా కూడబెట్టారు?

కేసీఆర్‌ మోసానికి గురికాని వర్గంలేదు: వైఎస్‌ షర్మిల

సూర్యాపేటటౌన్‌, జూన్‌ 29: కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదవులు సీఎం కేసీఆర్‌ కుటుంబానికి వస్తే.. తెలంగాణ ప్రజలకు బాధలు మిగిలాయని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర 109వ రోజు బుధవారం చివ్వెంల మండలం బీబీగూడెం నుంచి జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఖమ్మం క్రాస్‌రోడ్డు, కొత్తబస్టాండ్‌, గాంధీ విగ్రహం, పొట్టిశ్రీరాములు సెంటర్‌, సైనిక్‌పురి కాలనీ వరకు ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. పట్టణంలోని గాంధీచౌక్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేతుల్లో పెడితే ప్రస్తుతం రూ.4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ప్రతి వ్యక్తిపై రూ.4 లక్షల అప్పు పెట్టారన్నారు. గ్రామ పంచాయతీలు నడపలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం ఖాళీ బీరు సీసాలు అమ్మి గ్రామపంచాయతీలు నడపాలని మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి, రావి నారాయణరెడ్డి, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ, బెల్లి లలిత వంటి ఎంతోమంది వీరులను కన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాపై దివంగత సీఎం వైఎ్‌స.రాజశేఖర్‌రెడ్డికి ఎనలేని ప్రేమ ఉండేదన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చి పూర్తి చేసిన ఘనత వైఎ్‌సకే దక్కిందన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, కోల్డ్‌స్టోరేజ్‌, యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ఎటుపోయాయని ప్రశ్నించారు. వీళ్ల పాలన తీరు తాగుబోతు తాగి నిద్రపోయిన్నట్లు ఉందన్నారు.  స్కూటర్‌పై తిరిగిన మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి రూ.5 వేల కోట్లు ఎలా సంపాదించారో  చెప్పాలన్నారు. ఇసుక, ల్యాండ్‌ మాఫియా, చెరువుల ఆక్రమణ, అసైన్డ్‌ ప్రభుత్వ భూముల ఆక్రమణ అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయని విమర్శించారు. విద్యుత్తు బిల్లులు చూస్తే ప్రజలకు షాక్‌ కొడుతోందన్నారు.  ప్రభుత్వ సంస్థల నుంచి రూ.13 వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉండగా అడిగే దమ్ములేని మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రజల నుంచి ముక్కుపిండి రూ.6 వేల కోట్ల బకాయిలు మాత్రం వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ మోసానికి గురికాని వర్గమంటూ లేదని చెప్పారు. 

Updated Date - 2022-06-30T10:22:45+05:30 IST