సీల్డ్‌కవర్‌లో పదవులు

ABN , First Publish Date - 2021-05-06T05:30:00+05:30 IST

సిద్దిపేట మున్సిపల్‌ నూతన పాలకవర్గం శుక్రవారం కొలువుదీరనున్నది.

సీల్డ్‌కవర్‌లో పదవులు

నేడు సిద్దిపేట చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్ల ఎంపిక

అనుభవానికే  అధిష్టానం మొగ్గు

రెండు పదవులకు ఆరుగురి పేర్ల పరిశీలన

కొలువుదీరనున్న మున్సిపల్‌ నూతన పాలకవర్గం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 6: సిద్దిపేట మున్సిపల్‌ నూతన పాలకవర్గం శుక్రవారం కొలువుదీరనున్నది. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎంపిక ప్రక్రియను ఇదే రోజు చేపట్టనున్నారు. ఈ రెండు పదవులకు పలువురు  పోటీ పడుతున్నప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పవచ్చు. పార్టీలో సీనియర్‌గా, ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన అనుభవజ్ఞులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. మొత్తంగా ఆరుగురి పేర్లను  పరిశీలించి రెండు  పదవులకు సంబంధించిన ఇద్దరి పేర్లను సీల్డ్‌కవర్‌లో  పంపించనున్నారు. 


పరిశీలకుల నియామకం

సిద్దిపేట మున్సిపాలిటీలోని 43 వార్డుల్లో 36 వార్డులు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. స్వతంత్రులుగా గెలిచిన నలుగురు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీలోనే చేరడంతో వీరి బలం 40కి చేరింది. పూర్తి మెజార్టీ ఉన్నందున చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ల ఎంపిక బాధ్యత పార్టీ అధిష్టానం తీసుకున్నది. ఇందుకోసం ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌లను పరిశీలకులుగా నియమించింది. 


 అనుభవానికే చైర్‌పర్సన్‌ పీఠం..!

సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని జనరల్‌ మహిళకు కేటాయుంచారు. ఈ క్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కడవేర్గు రాజనర్సు సతీమణి మంజుల పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. రాజనర్సు నాలుగుసార్లు కౌన్సిలర్‌గా గెలవడంతోపాటు రెండుసార్లు చైర్మన్‌గా ఉన్నారు. పట్టణంపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ప్రస్తుతం ఆయన భార్య గెలవడంతో  వారి కుటుంబం నుంచి ఐదుసార్లు మున్సిపాలిటీకి ప్రాతినిథ్యం వహించిన అనుభవాన్ని పొందారు. అందుకే 24వ వార్డు జనరల్‌ స్థానంలో మహిళను బరిలోకి దింపి గెలిపించారు. పార్టీ అధిష్టానం కూడా సీనియర్లకే పట్టం కట్టేలా చర్యలు చేపట్టడంతో రాజనర్సు భార్య మంజుల పేరు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


‘వైస్‌చైర్మన్‌’ సీటుకు ఐదుగురి పేర్లు..

చైర్‌పర్సన్‌గా మహిళ ఉండడంతో వైస్‌చైర్మన్‌గా మగవాళ్లు ప్రాతినిథ్యం వహిస్తే సమన్వయం లోపం ఉండదని భావిస్తున్నారు. మరోవైపు ఇద్దరు మహిళలు ఉన్నా ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా వైస్‌చైర్మన్‌ పదవి కోసం కూడా ఐదుగురు సీనియర్ల పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో నాలుగుసార్లు కౌన్సిలర్‌గా గెలిచిన బర్ల మల్లికార్జున్‌, జంగిటి కనకరాజు ఉన్నారు. ఆ తర్వాత మూడుసార్లు విజయం సాధించిన ధర్మవరం బ్రహ్మం (గత రెండుసార్లు బ్రహ్మం భార్య స్వప్న కౌన్సిలర్‌), గుడాల సంధ్యాశ్రీకాంత్‌, మహ్మద్‌ ఫాతిమాబేగం వజీర్‌ల పేర్లనూ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఐదుగురిలో ఒకరికి వైస్‌చైర్మన్‌ పదవి దక్కుతుందనే చర్చ జరుగుతున్నది. 


కొత్తవారికి నో ఛాన్స్‌..

మొదటిసారి, రెండోసారి గెలిచిన కౌన్సిలర్ల పేర్లను చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవుల కోసం పరిశీలించలేదని తెలిసింది. ప్రధానంగా అనుభవానికి పెద్దపీట వేయడంతో సీనియర్‌ కౌన్సిలర్ల పేర్లనే పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నారు. కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు, రెండోసారి గెలిచిన కౌన్సిలర్లలోని పలువురు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను ఆశించారు. కానీ వీరికి భంగపాటు తప్పదన్నట్లుగా అధిష్టానం చర్యల ఆధారంగా తెలుస్తున్నది. సిద్దిపేట మున్సిపాలిటీపై తనదైన ముద్రవేసి పార్టీని గెలిపించిన మంత్రి హరీశ్‌రావు సైతం ఈ రెండు  పదవుల ఎంపిక ప్రక్రియను అధిష్టానానికే వదిలేసినట్లు తెలిసింది. 


ఆ ముగ్గురి ఓటమితోనే చిక్కులు..

వాస్తవానికి ఈసారి వైశ్య సామాజికవర్గానికి వైస్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని భావించారు. అందుకే మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని 35వ వార్డులో మాంకాల నాగరాణి, 42వ వార్డులో కూర రాధికను పార్టీ తరపున రంగంలోకి దింపారు. ఈ రెండు వార్డుల్లో పార్టీకి చెందిన సీనియర్లు పోటీ పడ్డప్పటికీ సామాజిక వర్గం కోణంలో ఆలోచించి రెండు సీట్లను వైశ్యులకు ఇచ్చారు. ఇద్దరూ ఓడిపోయారు. ఇక 29వ వార్డులో బరిలో నిలిచిన మహ్మద్‌ అబ్దుల్‌ వహీద్‌ పేరును కూడా వైస్‌చైర్మన్‌ పదవి కోసం ఆలోచిం చారు. కానీ ఈయన కూడా ఓడారు. ఈ ముగ్గురి ఓటమితో చిక్కులు ఏర్పడ్డాయి. అందుకే వైస్‌చైర్మన్‌ ఎంపికపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది.  

Updated Date - 2021-05-06T05:30:00+05:30 IST