పాజిటివ్‌లు 11 వేలు

ABN , First Publish Date - 2020-09-22T07:04:00+05:30 IST

నాలుగు నెలల పాటు గ్రీన్‌జోన్‌లో ఉన్న సిద్దిపేట జిల్లాలో ఒక్కసారిగా కరోనా ఉధృతి పెరిగింది

పాజిటివ్‌లు 11 వేలు

గడిచిన 30 రోజుల్లోనే తొమ్మిది వేల మందికి

జిల్లాలో శరవేగంగా కొవిడ్‌ వ్యాప్తి

అంతే వేగంగా కోలుకుంటున్న కరోనా బాధితులు

అతి స్వల్ప మరణాల రేటుతో ఉపశమనం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, సెప్టెంబరు 21: నాలుగు నెలల పాటు గ్రీన్‌జోన్‌లో ఉన్న సిద్దిపేట జిల్లాలో ఒక్కసారిగా కరోనా ఉధృతి పెరిగింది. ఎవరూ ఊహించని స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ కేసుల విషయంలో రాష్ట్రంలో చివరి ఐదు స్థానాల్లో ఉన్న జిల్లా ఇప్పుడు తొలి పదిస్థానాల్లోకి చేరింది. 


జిల్లాలో ఏప్రిల్‌ 19న తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. గజ్వేల్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్‌ సోకగా 14 రోజుల్లో కోలుకున్నాడు. వాస్తవానికి మార్చి 21 నుంచి లాక్‌డౌన్‌ ఉంది. అయితే మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ఒకే ఒక్క కేసుతో జిల్లా మొత్తం సేఫ్‌జోన్‌లో ఉంది. జూన్‌ నెలలో ఒక్కొక్కటిగా పెరిగినప్పటికీ అది వలస కార్మికులకే పరిమితమయింది. ఇక జూలై నెలలో రోజుకు 10 నుంచి 20 కేసులు పెరుగుతూ వచ్చాయి. ఆగస్టు 20వ తేదీ దాకా ఇదే పరిస్థితి కొనసాగింది. 


నెల రోజుల్లోనే 9వేల కేసులు

ఆగస్టు 20వ తేదీ వరకుజిల్లా వ్యాప్తంగా 1,980 కేసులు ఉన్నాయి. సెప్టెంబరు 22వ తేదీ వరకు ఆ సంఖ్య 11,250కి చేరింది. అంటే ఒక్కనెలలోనే దాదాపు 9వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రతీరోజు 200 నుంచి 300 కేసులు జిల్లాలో నమోదు కావడం ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నది. ఇదే విధంగా కొనసాగితే మరో నెల రోజుల్లో 20 వేల కేసులు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 


రోజుకు 3వేలకుపైగా టెస్టులు

మంత్రి హరీశ్‌రావు చొరవతో జిల్లాలో టెస్టుల సంఖ్యను పెంచారు. ప్రత్యేకంగా కొవిడ్‌ టెస్టులు చేసే బస్సును జిల్లాకు తెప్పించారు. ప్రతీరోజు ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని ఆయా ప్రాంతాల ప్రజలకు టెస్టులు చేసి వెంటనే ఫలితాలు ఇస్తున్నారు. అదే విధంగా సిద్దిపేట జనరల్‌ ఆస్పత్రి, గజ్వేల్‌ ప్రధాన ఆస్పత్రి, చేర్యాల, హుస్నాబాద్‌, దుబ్బాక సీహెచ్‌సీలతో పాటు అన్ని మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా నిత్యం టెస్టులు చేస్తున్నారు. ఎలాంటి పరిమితులు లేకుండా వచ్చిన వారందరికీ పరీక్షలు ననిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యారోగ్య శాఖ తరఫున మందులు సైతం అందజేస్తున్నారు. ఇక జిల్లాలో రోజుకు దాదాపు 200 వరకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు. టెస్టుల సంఖ్య భారీగా పెరగడం వల్ల ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్నాయని అంటున్నారు.


మరణాల శాతం తక్కువే

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో 90 శాతం మంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఇతరత్రా అనారోగ్య ఇబ్బందులు ఉన్న వారు మాత్రమే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆస్పత్రితో పాటు ములుగులోని ఆర్వీఎం వైద్య కళాశాల ఆస్పత్రిలో సుమారు 300 పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఉన్నాయి. ఈ పడకలు కూడా పూర్తిస్థాయిలో నిండట్లేదు. అతిగా భయపడేవారు, డబ్బులకు వెనుకాడని వారు మాత్రం హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోయిన వారిలో ఒకరిద్దరు మినహా అంతా 60 ఏళ్లు పైబడినవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారే కావడం గమనార్హం. కేసుల సంఖ్య 11 వేలు దాటినా మరణాల సంఖ్య మాత్రం 45 దాటకపోవడం ఊరటనిచ్చే అంశం. గడిచిన ఆరునెలలుగా కరోనా జాగ్రత్తలు పాటించడం, ఇమ్యూనిటీని పెంచుకోవడం కూడా కరోనా నుంచి త్వరగా కోలుకునేలా చేసిందని కొవిడ్‌ విజేతలు చెబుతున్నారు. 


మనోధైర్యమే పెద్ద వ్యాక్సిన్‌

కరోనా పాజిటివ్‌ అని తెలియగానే మనోధైర్యంతో ఉండాలి. ధైర్యమే సగం వ్యాధిని తగ్గిస్తుంది. నాకు కూడా పాజిటివ్‌ రాగానే కొంత టెన్షన్‌ పడ్డాను. వెంటనే తేరుకొని లైట్‌గా తీసుకున్నాను. మా ఇంటిలోనే ఒక గదిలో ఒంటరిగా ఉన్నాను. నాకు కరోనా వచ్చిందనే విషయాన్ని కూడా మర్చిపోయి గడిపాను. వైద్యులు సూచించిన మెడిసిన్‌ వేసుకున్నాను. ప్రతీరోజు యోగాతో పాటు శ్వాసకు సంబంధించిన ఆసనాలు వేశాను. కేవలం నాలుగు రోజుల్లోనే నేను కోలుకున్నాను. కానీ 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లోనే ఉన్నాను. కరోనా వచ్చిందనే మానసిక స్థితి నుంచి బయటపడి ఏదో ఒక పనిపై బిజీగా ఉండాలి. పాత మిత్రులు, హాయిగా నవ్వించే మిత్రులతో ఫోన్లు మాట్లాడాను. 8 గంటలకు తగ్గకుండా నిద్రపోయాను. బలవర్ధకమైన ఆహారం తీసుకున్నాను. 

-ఓ కరోనా విజేత, సిద్దిపేట

Updated Date - 2020-09-22T07:04:00+05:30 IST