విపక్ష సర్పంచులపై పెత్తనం

ABN , First Publish Date - 2021-08-03T06:01:21+05:30 IST

క్షేత్రస్థాయిలో డీపీవో ఆదేశాలను కిందిస్థాయి అధికారులు, వైసీపీ నాయకులు బేఖాతరు చేస్తున్నారు.

విపక్ష సర్పంచులపై పెత్తనం
దేవరాపల్లి మండలం నాగయ్యపేటలో అమూల్‌ బల్క్‌ కూలింగ్‌ కేంద్రానికి పనులు ప్రారంభించిన దృశ్యం

అభివృద్ధి పనులు తమ ఆధ్వర్యంలోనే జరగాలని వైసీపీ నేతల పట్టు

కింది స్థాయి అధికారులపై ఒత్తిళ్లు

మొదలెట్టిన పనులకు అడ్డంకులు

డీపీవో ఆదేశాలు కూడా బేఖాతరు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)



‘‘ప్రస్తుతం ఆర్బీకేలు, పంచాయతీలు, సచివాలయాలు, వెల్‌నెస్‌ సెంటర్లకు భవనాల నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు/మాజీ సర్పంచులకు పూర్తిగా సహకరించండి. బిల్లుల చెల్లింపులో అవాంతరాలు పెట్టొద్దు. కొత్తగా వచ్చే పనులు మాత్రం ప్రస్తుత సర్పంచుల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ విషయంలో ఎవరిపైనైనా ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం’’.

- జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి కొత్తగా ఎన్నికైన సర్పంచులకు గత నెల 9వ తేదీన జారీచేసిన సర్క్యులర్‌ ఇది.


...కానీ క్షేత్రస్థాయిలో డీపీవో ఆదేశాలను కిందిస్థాయి అధికారులు, వైసీపీ నాయకులు బేఖాతరు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులు సర్పంచులుగా వున్న గ్రామ పంచాయతీల్లో కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులకు మోకాలడ్డుతున్నారు. తమ పార్టీ అధికారంలో వుందని, అందువల్ల పంచాయతీల్లో అభివృద్ధి పనులను తామే చేపడతామని స్పష్టం చేస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను తమ పంచాయతీలో అమలు చేసేది లేదని కరాఖండిగా చెబుతున్నారు. వీరికి స్థానిక అధికారులు వంత పాడుతున్నారు. దీంతో ప్రతిపక్షాలకు చెందిన సర్పంచులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికార పార్టీ నేతలు హరించివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా దేవరాపల్లి మండలం నాగయ్యపేట పంచాయతీ సర్పంచ్‌కు ఈ తరహా అనుభవమే ఎదురైంది. ఈ పంచాయతీకి అమూల్‌ కంపెనీకి సంబంధించి బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్‌ మంజూరైంది. మండల ఇంజనీరింగ్‌ అధికారి సూచనలతో సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ భవన నిర్మాణానికి మార్కింగ్‌ ఇచ్చారు. గత శనివారం భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కొందరు వచ్చి, భవన నిర్మాణ పనులు చేయవద్దంటూ సర్పంచ్‌ (టీడీపీ) కర్రి పుష్పను హెచ్చరించారు. ఆమె ససేమిరా అనడంతో వారంతా మండల ఇంజనీరింగ్‌ అధికారి ఉమామహేశ్‌ను కలిసి భవన నిర్మాణ పనులు ఆపాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన...సర్పంచ్‌కు ఫోన్‌ చేసి పనులు ఆపేయాలని ఆదేశించారు. ఎందుకని సర్పంచ్‌ అడగ్గా...వీఆర్వో వద్ద స్కెచ్‌ తీసుకున్న తరువాత చేపట్టాలన్నారు. గతంలో చేపట్టిన మూడు భవన నిర్మాణాల విషయం గురించి అడిగితే...‘నిన్నగాక మొన్న సర్పంచ్‌గా వచ్చారు. నిర్మాణాలు ఆపే హక్కు మీకు లేదు’ అంటూ హెచ్చరిక స్వరంతో బెదిరించారని, సర్పంచ్‌గా ఎన్నికైన తనకు అధికారాలు లేవా? అంటూ ఆమె ఆవేదనతో ప్రశ్నించారు.


అమూల్‌ పాల సేకరణ భవనాల్లోనూ....


అమూల్‌ సంస్థకు పాల సేకరణ కోసం జిల్లాలో 590 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద ప్రతి భవనానికి రూ.15 లక్షలు కేటాయించింది. ఈ భవనాలను సర్పంచుల అధ్వర్యంలోనే నిర్మించాలి. కానీ ప్రతిపక్షాల మద్దతుదారులు సర్పంచులుగా వున్న పంచాయతీల్లో వైసీపీనేతలు అడ్డుపడుతూ, భవనాలను తామే నిర్మిస్తామని తెగేసి చెబుతున్నారు. ఇందుకు ఆయా సర్పంచులు ఒప్పుకునేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. 

Updated Date - 2021-08-03T06:01:21+05:30 IST