అదనపు రైళ్లకు అవకాశం

ABN , First Publish Date - 2021-11-10T06:43:26+05:30 IST

దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌ విజయవాడ.

అదనపు రైళ్లకు అవకాశం

విజయవాడ నుంచి కొత్త రైళ్లు నడిపేందుకు మార్గం సుగమం

కొత్తగా అందుబాటులోకి రెండు పిట్‌లైన్స్‌

ఇప్పటి వరకు నడుస్తున్నవి ఏడు రైళ్లు

అదనంగా మరో ఆరు రైళ్లకు అవకాశం 

రైల్వేబోర్డు చర్యలు తీసుకుంటేనే ప్రయోజనం


దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌ విజయవాడ. ఈ మార్గంలో నిత్యం వందలాది రైళ్లు పరుగులు పెడుతుంటాయి. కానీ ప్రస్తుతం విజయవాడ నుంచి బయలుదేరుతున్నవి ఏడు రైళ్లు మాత్రమే. ఇక్కడి నుంచి అదనంగా రైళ్లను నడిపేందుకు అవకాశం లేకపోవడమే అందుకు కారణం. ఇప్పుడిక ఆ సమస్య లేదు. ఇక్కడ అదనంగా రెండు పిట్‌లైన్స్‌ ఏర్పడ్డాయి. దీంతో విజయవాడ నుంచి నేరుగా మరో ఆరు రైళ్లను ప్రారంభించే అవకాశం వచ్చింది. ఇప్పటి వరకూ విజయవాడ డివిజన్‌పై శీతకన్ను వేసిన రైల్వే బోర్డు ఇకపైనైనా ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్‌. ఇది దేశంలోనే రెండో అతి పెద్ద జంక్షన్‌. ఈ మార్గంలో ప్రతి రోజూ 200కు పైగా ప్రయాణికుల రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో ఏడు రైళ్లు మాత్రమే విజయవాడ స్టేషన్‌ నుంచి నడుస్తున్నాయి. ఈ స్టేషన్‌కు మూడు పిట్‌లైన్లను మాత్రమే ఏర్పాటు చేయడం ఇందుకు కారణం. పిట్‌లైన్ల కొరత కారణంగా మరికొన్ని రైళ్లను మచిలీపట్నం, నర్సాపూర్‌ల నుంచి నడుపుతున్నారు. ఇంతకాలానికి ఇప్పుడు సీవీఆర్‌ ఫ్లై ఓవర్‌ ఆవల ఎట్టకేలకు మరో రెండు పిట్‌లైన్లను అదనంగా ఏర్పాటు చేశారు. వీటితోపాటు మరో రెండు వెయిటింగ్‌ లైన్లను కూడా సిద్ధం చేశారు. ఇటీవలే ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇక్కడి నుంచి అదనంగా మరో ఆరు రైళ్లను నడిపేందుకు అవకాశం ఏర్పడుతోంది. 


ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు ఇవీ.. 

విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి నడుస్తున్న ఏడు రైళ్లలో విజయవాడ-విశాఖ మధ్య నడిచే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ-చెన్నై పినాకిని ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ-సికింద్రాబాద్‌ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ-గూడురు మధ్య నడిచే విక్రమసింహపురి ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ-హుబ్లీ అమరావతి ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ-ఽ దర్మవరం మధ్య ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ-లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు మాత్రమే ఉన్నాయి. 


డిమాండ్‌ ఉన్న ప్రాంతాలివీ.. 

విజయవాడ నుంచి దేశంలోని అనేక ప్రాంతాలకు డిమాండ్‌ ఉంది. కానీ అందుకనుగుణంగా రైళ్లు లేవు. టెక్‌ నగరం బెంగళూరుకు ఎంతో డిమాండ్‌ ఉంది. కానీ అందుకనుగుణంగా ఆ నగరానికి ఇక్కడి నుంచి ఒక్క ట్రైన్‌ కూడా లేదు. ఒకపక్క ఆర్టీసీ బెంగళూరుకు నేరుగా బస్సులు నడుపుతోంది. మరోపక్క విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి కూడా అక్కడికి విమానాలు నడుస్తున్నాయి. రైల్వే మాత్రం విజయవాడ స్టేషన్‌ నుంచి బెంగళూరుకు ఒక్క రైలును కూడా నడవటం లేదు. విజయవాడ మీదుగా బెంగళూరు వెళ్లే ఇతర ప్రాంతాల రైళ్లు ఉన్నా, వాటిలో సీటింగ్‌ దొరకటం దుర్లభం. దీంతో ప్రయాణికులు బస్సులను, విమానాలను ఆశ్రయిస్తున్నారు. బెంగళూరుకు నేరుగా విజయవాడ నుంచి రైలు లేకపోవటం వల్ల తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే అవకాశం లేకుండా పోతోంది. విజయవాడ నుంచి నేరుగా రైలు ఉంటే ఈ ప్రాంతం వారికి సీట్లు అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి చెన్నైకు కూడా డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నైకు ఒక్క రైలే నడుస్తోంది. మరో రెండు రైళ్లయినా ఇక్కడి నుంచి నడపాల్సిన అవసరం ఉంది. విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నేరుగా రైలు నడపాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. విజయవాడ  నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబయికి కూడా డిమాండ్‌ ఉంది. ఈ రెండు ప్రాంతాలకూ ఇక్కడి నుంచే రైళ్లు నడిపితే మన ప్రాంతవాసులకు రిజర్వేషన్‌ అందుబాటులో ఉంటుంది. విజయవాడ నుంచి షిర్టీ, వారణాసి వంటి పుణ్య క్షేత్రాలకు కూడా ఎంతో డిమాండ్‌ ఉంది. వీటితో పాటు దేశంలోని అనేక ప్రాంతాలకు రైళ్లను ఏర్పాటు చేయవచ్చు. కానీ రైల్వే ఈ దిశగా దృష్టి సారించటం లేదు. 

Updated Date - 2021-11-10T06:43:26+05:30 IST