ధరణిలో పది సవరణలకు అవకాశం

ABN , First Publish Date - 2021-03-09T08:54:01+05:30 IST

భూరికార్డుల్లో పది రకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుగా సోమవారం నుంచి ‘మీసేవ’ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు.

ధరణిలో పది సవరణలకు అవకాశం

మీసేవలో దరఖాస్తుల స్వీకరణ షురూ

విజ్ఞప్తులన్నీ కలెక్టర్ల లాగిన్‌లలోకి

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): భూరికార్డుల్లో పది రకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుగా సోమవారం నుంచి ‘మీసేవ’ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. మీసేవలో రైతులు/భూముల యాజమానులు దరఖాస్తులు సమర్పించగానే ఆ విజ్ఞప్తులన్నీ కలెక్టర్ల లాగిన్‌లలోకి చేరుతున్నాయి. వాటిని రికార్డుల ఆధారంగా పరిశీలించే అధికారం కలెక్టర్లకే ఉంది. తిరస్కరిస్తే ఏ కారణాలతో తిరస్కరించారో లిఖితపూర్వకంగా రైతులు/భూముల యాజమానులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆమోదిస్తే తదుపరి ఏయే చర్యలు తీసుకోవాలో తెలుపుతూ భూయజమానుల మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ వెళ్లనుంది. ఇక సోమవారం నుంచి ధరణిలో విజ్ఞప్తుల స్వీకరణకు అవకాశం ఇచ్చిన ఆప్షన్‌లలో.. ఆధార్‌లో తప్పుల సవరణ, ఆధార్‌ అందుబాటులో లేని కేసులు ఉన్నాయి. అలాగే, తండ్రి  లేదా భర్త పేరులో మార్పు కోసం, ఫొటో మారితే, లింగం తప్పుగా పడితే మార్పులు, కులం వివరాలు తప్పుగా పడితే(సవరణ కోసం), సర్వే నంబర్‌ గల్లంతైన కేసులు, భూముల కొనుగోలు/గిఫ్ట్ /పంపకాలు, వారసత్వం, కోర్టు డిక్రీ ద్వారా భూములు సంక్రమించాయా వంటి వివరాల ఆధారంగా దరఖాస్తు చేసుకోవడం వంటి అంశాలున్నాయి. భూమి స్వభావం(తరీ, ఖుష్కీ, సాగు భూమి వ్యవసాయేతరగా పడిందా?) వంటివి సరిచేసుకోవడం, ల్యాండ్‌ క్లాసిఫికేషన్‌ వంటి అంశాల సవరణకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. 

Updated Date - 2021-03-09T08:54:01+05:30 IST