పాక్ నుంచి చైనాకు రేడియోయాక్టివ్ పదార్థాలు... ముంద్రా పోర్టులో పట్టివేత...

ABN , First Publish Date - 2021-11-19T21:56:19+05:30 IST

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రేడియోయాక్టివ్ పదార్థాలను

పాక్ నుంచి చైనాకు రేడియోయాక్టివ్ పదార్థాలు... ముంద్రా పోర్టులో పట్టివేత...

న్యూఢిల్లీ : గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రేడియోయాక్టివ్ పదార్థాలను గురువారం కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు జప్తు చేసినట్లు అదానీ పోర్ట్స్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అప్రకటిత ప్రమాదకర సరుకు ఉన్నట్లు ఆందోళన కలగడంతో ఓ విదేశీ నౌక నుంచి వీటిని సీజ్ చేసినట్లు పేర్కొంది. ముంద్రా పోర్టును అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ (ఏపీఎస్ఈజెడ్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 


ఏపీఎస్ఈజెడ్ విడుదల చేసిన ప్రకటనలో, ఓ విదేశీ నౌకలోని కొన్ని కంటెయినర్లను జాయింట్ కస్టమ్స్, డీఆర్ఐ బృందం ముంద్రా పోర్టులో జప్తు చేసినట్లు తెలిపింది. ఈ కార్గోను నాన్ హజార్డస్‌గా లిస్ట్ చేసినప్పటికీ, ఈ కంటెయినర్లకు హజార్డ్ క్లాస్ 7 మార్కింగ్స్ ఉన్నట్లు తెలిపింది. హజార్డ్ క్లాస్ 7 అంటే రేడియోయాక్టివ్ పదార్థాలు అని అర్థం. ఈ కంటెయినర్ల గమ్యస్థానం ముంద్రా పోర్టు కానీ, మన దేశంలోని ఇతర పోర్టు కానీ కాదని పేర్కొంది. అవి పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి చైనాలోని షాంఘైకి వెళ్తున్నట్లు తెలిపింది. 


తాము డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులకు సాధ్యమైనంతగా సాయపడినట్లు ఏపీఎస్ఈజెడ్ తెలిపింది. సమన్వయంతో వేగంగా స్పందించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. అప్రమత్తంగా స్పందించినందుకు గౌరవ వందనం చేస్తున్నట్లు పేర్కొంది. భారత దేశాన్ని సురక్షితంగా ఉంచే ఏ చర్యకైనా తాము సంపూర్ణ సహకారాన్ని కొనసాగిస్తామని తెలిపింది. 


భారత ప్రభుత్వాధికారులు ఈ సరుకును తదుపరి తనిఖీలు నిర్వహించేందుకు ముంద్రా పోర్టులో దించేశారు. 


Updated Date - 2021-11-19T21:56:19+05:30 IST