MLA Katasani మంత్రాంగం.. బావమరిది కోసం పోస్టు ఖాళీ!

ABN , First Publish Date - 2021-12-19T08:08:14+05:30 IST

MLA Katasani మంత్రాంగం.. బావమరిది కోసం పోస్టు ఖాళీ!

MLA Katasani మంత్రాంగం.. బావమరిది కోసం పోస్టు ఖాళీ!

  • కర్నూలు జడ్పీ చైర్మన్‌ సుబ్బారెడ్డి రాజీనామా 

కర్నూలు, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): బామమరిది కోసం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేసిన ఒత్తిళ్లు ఫలించాయి. కర్నూలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కలెక్టర్‌ పి.కోటేశ్వరరావుకు శనివారం తన రాజీనామా పత్రాన్ని అందించారు. వరుసకు బావమరిది అయిన ఎర్రబోతుల పాపిరెడ్డిని ఆ పీఠంపై కూర్చోబెట్టేందుకు కొన్నాళ్లుగా కాటసాని ప్రయత్నాలు చేస్తున్నారు. జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన సుబ్బారెడ్డిని తక్షణమే రాజీనామా చేయాలని ఆయన ఫోన్లు చేసి ఒత్తిడి చేశారు. అయితే తనకు పదవి రావడానికి ముఖ్య కారణమైన ఎంపీ అవినాశ్‌రెడ్డితో మాట్లాడి రాజీనామా చేస్తానని మల్కిరెడ్డి స్పష్టం చేశారు. అనంతరం పార్టీ జిల్లా కో-ఆర్డినేటర్‌ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా ఎమ్మెల్యేకు వంత పాడుతూ మల్కిరెడ్డిపై ఒత్తిళ్లు పెంచారు. దీంతో సుబ్బారెడ్డి నేరుగా సీఎం జగన్‌ను కలిసి తన మొర వినిపించుకోవాలని రెండురోజుల పాటు అమరావతిలో వేచి చూశారు. అయినా సీఎం నుంచి సుముఖత వ్యక్తం కాలేదు. ఆశాభంగంతో వెనుతిరిగిన మల్కిరెడ్డి కర్నూలు తిరిగి వచ్చి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


వెంకటరెడ్డి మరణంతో... 

2020లో స్థానిక ఎన్నికల్లో జడ్పీ చైర్మన్‌గా కొలిమిగుండ్లకు చెందిన ఎర్రబోతుల వెంకటరెడ్డిని, కర్నూలు మేయర్‌గా బీవై రామయ్యను అధిష్ఠానం నిర్ణయించింది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడే సమయానికి కొలిమిగుండ్ల జడ్పీటీసీగా అప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటరెడ్డి సెప్టెంబరులో కొవిడ్‌ కారణంగా మరణించారు. ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగేలోపే సంజామల జడ్పీటీసీ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని జడ్పీ చైర్మన్‌గా నియమించారు. ఆయన సెప్టెంబరు 25న ప్రమాణ స్వీకారం చేశారు. నవంబరులో నిర్వహించిన ఉప ఎన్నికల్లో కొలిమిగుండ్ల నుంచి ఎర్రబోతుల పాపిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి తనను జడ్పీ చైర్మన్‌ను చేయాలని కాటసానితో సంప్రదింపులు జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-19T08:08:14+05:30 IST