చరిత్రకు సాక్ష్యాలు

ABN , First Publish Date - 2021-04-22T05:22:38+05:30 IST

దేశ చరిత్రలో నెల్లూరుకు విశిష్ట స్థానముంది. దానిని గుర్తిస్తూ, గౌరవిస్తూ జిల్లా తపాలాశాఖ కూడా జిల్లా చరిత్ర దేశ నలుమూలలా వ్యాపించేందుకు కృషి చేస్తోంది.

చరిత్రకు సాక్ష్యాలు
పినాకినీ ఆశ్రమం చిత్రాలతో కవరు

ఆకట్టుకుంటున్న పోస్టల్‌ కవర్లు

తపాలా శాఖ ప్రత్యేక ముద్రణ


నెల్లూరు(సాంస్కృతిక ప్రతినిధి), ఏప్రిల్‌ 21 : దేశ చరిత్రలో నెల్లూరుకు విశిష్ట స్థానముంది. దానిని గుర్తిస్తూ, గౌరవిస్తూ జిల్లా తపాలాశాఖ కూడా జిల్లా చరిత్ర దేశ నలుమూలలా వ్యాపించేందుకు కృషి చేస్తోంది. దక్షిణ సబర్మతి ఆశ్రమంగా పేరుపొందిన పల్లెపాడు పినాకినీ ఆశ్రమం చిత్రాలతో రూపొందించిన ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని 1921 ఏప్రిల్‌ 7వ తేదీన మహాత్మా గాంధీ స్వయంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదితో ఆ మధుర ఘట్టానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తపాలా శాఖ ప్రత్యేక కవర్లను విడుదల చేసింది.  అలాగే మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధురాలు పొణకా కనకమ్మ చిత్రం, మహిళల కోసం ఆమె ఏర్పాటు చేసిన కస్తూరిదేవి బాలికల హైస్కూలు చిత్రం కలిపి ఐదు రూపాయల కవరును తపాలా శాఖ విడుదల చేసింది. అలాగే ప్రసిద్ధ డౌనీహాలు చర్చి, బారాషహీద్‌ దర్గాల చిత్రాలతో కూడా దేశస్థాయిలో కవర్లను విడుదల చేసింది. సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృత్యకంగానూ ఓ కవరును విడుదల చేసింది.


ఆనందదాయకం

- వెంకటేశ్వరరావు, పోస్టల్‌ శాఖ జిల్లా సూపరిండెంటెంట్‌

జిల్లా చరిత్రను తరచి చూస్తే ఎంతో మంది మహనీయుల గురించి తెలుస్తుంది.  అలాంటి వారితోపాటు విశిష్ఠ ప్రాంతాలు, స్థలాలను గుర్తించి భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక కవర్లు విడుదల చేయడం ఆనందంగా ఉంది. 

Updated Date - 2021-04-22T05:22:38+05:30 IST