పోస్టల్ ఓటింగ్.. యూఏఈ, జీసీసీలోని ఎన్నారైలకు గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2021-02-23T21:16:02+05:30 IST

విదేశాల్లోని ఎన్నారైల కోసం పోస్టల్ ఓటింగ్ విషయమై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ), భారత ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

పోస్టల్ ఓటింగ్.. యూఏఈ, జీసీసీలోని ఎన్నారైలకు గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: విదేశాల్లోని ఎన్నారైల కోసం పోస్టల్ ఓటింగ్ విషయమై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ), భారత ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషయం తమ పరిశీలనలో ఉన్నట్లు తాజాగా సంబంధిత అధికారులు కూడా తెలియజేశారు. అన్నీ కుదిరితే ప్రధానంగా యూఏఈ, గల్ఫ్ దేశాల్లోని ఎన్నారైలు రానున్న కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో పోస్టల్ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని ఈసీఐ అధికారులు తెలిపారు. ఇటీవల యూఏఈకి చెందిన వీపీఎస్ హెల్త్‌కేర్ చైర్మన్ అండ్ ఎండీ డా. షంషీర్ వయాలిల్.. ఎన్నారైలకు పోస్టల్ ఓటింగ్ విషయమై సుప్రీంకోర్టులో పీటిషన్ దాఖలు చేయడంతో పాటు చీఫ్ ఎలక్షన్ కమీషనర్(సీఈసీ) ఆఫ్ ఇండియా సునీల్ ఆరోరాను కూడా కలిసిన నేపథ్యంలో సోమవారం ఈసీఐ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.


'డా. వయాలిల్ సీఈసీని కలిశారు. విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులకు చాలా కాలంగా ఉన్న పోస్టల్ ఓటింగ్ సమస్య పరిష్కారం విషయమై మాట్లాడారు. ఎన్నారైలకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటేడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్(ఈటీపీబీఎస్) అవశ్యకతను తెలియజేశారు. ఈ విషయం మా పరిశీలనలో ఉంది.' అని ఈసీఐ తన ప్రకటనలో పేర్కొంది. కాగా, గల్ఫ్ యేతర దేశాల్లోని ఎన్నారైలకు పోస్టల్ ఓటింగ్ హక్కును ప్రభుత్వం మొదటి దశలో అమలు చేయాలని యోచిస్తున్నట్లు వచ్చిన నివేదికల సమాచారం మేరకు తాజాగా డాక్టర్ షంషీర్ ఈసీఐని కలిసినట్లు తెలుస్తోంది.  

Updated Date - 2021-02-23T21:16:02+05:30 IST