డిప్యూటీ తహసీల్దార్లకు పోస్టింగ్‌లేవి?

ABN , First Publish Date - 2020-07-07T07:53:14+05:30 IST

‘మన కొలువులు మనకే’ అన్న నినాదంతో పురుడు పోసుకున్న రాష్ట్రంలో గ్రూప్‌-2 పరీక్షలు రాసి డిప్యూటీ తహసీల్దార్లుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చి ఎనిమిది నెలలు దాటినా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా

డిప్యూటీ తహసీల్దార్లకు పోస్టింగ్‌లేవి?

  • అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చినా ఎదురుచూపులే
  • చేస్తున్న ఉద్యోగాలు వదులుకున్న 130 మంది 
  • ఎనిమిది నెలలుగా ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు


హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ‘మన కొలువులు మనకే’ అన్న నినాదంతో పురుడు పోసుకున్న రాష్ట్రంలో గ్రూప్‌-2 పరీక్షలు రాసి డిప్యూటీ తహసీల్దార్లుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చి ఎనిమిది నెలలు దాటినా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మొత్తం 1032ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైతే.. కీలకమైన 259 డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులకు వివిధ శాఖల్లో పని చేస్తున్న 130మంది.. తమ ఉద్యోగాలు వదులుకొని మరీ వచ్చారు. ఇద్దరు ఎంపీడీవోలు, ముగ్గురు అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు(ఏఎ్‌సవోలు), 20మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఒక ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌, 40 మంది ఉపాధ్యాయులు, 9 మంది అటవీ అధికారులు, విద్యుత్తు, బ్యాంకు, కేంద్రప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులందరినీ కలుపుకొని 130 మంది... ఆయా ఉద్యోగాలను వదులుకొని గ్రూప్‌-2 పరీక్ష రాసి డీటీలుగా ఎంపికయ్యారు. ఇదే వారికి శాపంగా పరిణమించింది. వాస్తవానికి 2015 డిసెంబరులో నోటిఫికేషన్‌ విడుదలైతే... 2016లో పరీక్షలు జరిగాయి. 2017లో ఫలితాలు విడుదల కాగా... న్యాయస్థానం తీర్పుతో 2019 అక్టోబరులో తుది ఫలితాలు ప్రకటించారు. ఇందులో 13 కేటగిరీలకు చెందిన 1032 మందిని ఎంపిక చేసి... ఆయా శాఖలకు జాబితాలు పంపించారు. 12 కేటగిరీల్లోని అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తుండగా... ఒక్క డిప్యూటీ తహసీల్దార్ల పోస్టింగ్‌లకు మాత్రం దిక్కులేకుండా పోయింది. 2019డిసెంబరు 11న అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందుకొని 2020 ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొంతకాలం శిక్షణ పూర్తి చేసుకున్న వీరు... పోస్టింగ్‌ల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరికి వేతనాలు ఇచ్చేందుకు వీలుగా సూపర్‌ న్యుమరరీ పోస్టులు సృష్టించాలని నెల కిందట ఫైలు వెళ్లినా ఇప్పటిదాకా మోక్షం కలగలేదు. 


464 మందికే వేతనాలు

గ్రూప్‌-2 కింద 748 మందికి పోస్టింగ్‌లు రాగా, 464 మంది మాత్రమే 7నెలలుగా వేతనాలు పొందుతున్నారు. డిప్యూటీ తహసీల్దార్లతోపాటు పోస్టుల్లేవన్న కారణాలతో 284మంది ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు సైతం  జీతాలు అందలేదు. తొలినాళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని పోస్టింగ్‌లు ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఆయా పోస్టుల్లో పదోన్నతులతో ఇతరులు పనిచేస్తున్నందున వారికి రివర్షన్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. దాంతో వీరి పరిస్థితి దయనీయంగా మారింది.


  • ‘రెవెన్యూ శాఖలో కొలువు అంటే సమాజంలో గౌరవం ఉంటుంది. నాలుగేళ్లలో కార్యనిర్వహక మెజిస్ట్రేట్‌(తహసీల్దార్‌) కావొచ్చు. సమాజానికి సేవ చేసే అవకాశం ఉంటుందని ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నా. డబ్బే ప్రధానమైతే గ్రూప్‌-2లో అరడజనుపైగా ఉద్యోగాలున్నాయి. వాటిని వదులుకున్నందుకు ఇప్పుడు బాధపడే పరిస్థితి తెచ్చారు’.. ఇదీ ఓ అభ్యర్థి ఆవేదన. 
  • ‘డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికైతే... భవిష్యత్తులో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ కావొచ్చు. ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉంటుందని చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామాలు చేసి దీన్ని ఎంచుకున్నాం... ఇప్పుడు నిరుద్యోగులమయ్యాం’... సచివాలయంలో ఏఎ్‌సవోలుగా పని చేసిన ముగ్గురి ఆందోళన ఇది.
  • ‘గ్రూప్‌-1 అధికారులమైౖనప్పటికీ డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టును ఏరి కోరి... ఆ ఉద్యోగాలను వదులుకున్నాం. సమాజంలో గౌరవం ఉంటుందనే రెవెన్యూ పోస్టును కోరుకొని ఇందులోకి వచ్చాం. ఎనిమిది నెలలైనా పోస్టింగ్‌లు ఇవ్వలేదు’.. ఇదీ ఇద్దరు అభ్యర్థుల మనోవేదన. 

Updated Date - 2020-07-07T07:53:14+05:30 IST