కయ్యలు ఖాళీ!

ABN , First Publish Date - 2022-01-06T04:56:30+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సాగునీటి సరఫరాలో జాప్యం వల్ల ఈ ఏడాది పోతిరెడ్డిపాళెంలోని సుమారు 100 ఎకరాలు మొదటి పంటకు నోచుకోలేదు.

కయ్యలు ఖాళీ!
పంటకు నోచుకోని పొలాలు

పోతిరెడ్డిపాళెంలో పంటకు నోచుకోని పొలాలు

సుమారు 100 ఎకరాలు బీడు 

అప్పుడు వరదలు, ఇప్పుడు సాగునీటి జాప్యం

రెండో పంటపై రైతుల ఆవేదన


కోవూరు, జనవరి 5: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సాగునీటి సరఫరాలో జాప్యం వల్ల ఈ ఏడాది పోతిరెడ్డిపాళెంలోని సుమారు 100 ఎకరాలు మొదటి పంటకు నోచుకోలేదు. నెలరోజుల పాటు భారీ వర్షాలు కురుస్తుండటంతో పోతిరెడ్డిపాళెం పరిసర ప్రాంత పొలాల్లో వరి నాట్లే వేసేందుకు వీలుకాలేదు. వేసిన నారు కూడా పాచిపోయింది. పొలాల్లో వరద నీరు పదిహేను రోజుల పాటు నిల్వ ఉండడంతో రైతులు దిక్కుతోచని స్ధితికి చేరుకున్నారు. దీంతో   సీజన్‌ కూడా దాటిపోయింది. వరద నీరు పోయిన తర్వాత పంట వేద్దామంటే వాతావరణం అనుకూలంగా కన్పించలేదు. దీంతో చేసేదేమీ లేక పంట పొలాలను బీడుగా వదిలేశారు. కాగా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం కూడా ఓ కారణంగా రైతులు చెబుతున్నారు. రెండో పంటకు సిద్ధం అవుదామనుకుంటే సాగునీటి విడుదలపై నీటిపారుదల అధికారులు ఇంత వరకు ప్రకటన చేయలేదని రైతులు వాపోతున్నారు.  

 

వరదల వల్ల పంట వేయలేదు

సోమశిల జలాశయంలో అధికారుల అవగాహనా రాహిత్యం వల్ల నీటిని నిల్వ  చేయడంతో వరద నీరు మా ప్రాంతంలో పోటెత్తింది. వరదల వల్ల సకాలంలో మొదటి పంట వేయలేకపోయాం. ఇప్పుడు వేస్తే మార్చి నెలాఖరులోగా పంట చేతికందదు. రెండో పంటకు సిద్ధం అవుదామనుకుంటున్నాం.  

- తిరుమూరు రవీంద్రరెడ్డి, రైతు, పోతిరెడ్డిపాళెం


బాధగా ఉంది..

పొలంలో పంట వేయకపోవడం బాధగా ఉంది. వరదనీరు ఎక్కువ కాలం పొలంలోనే ఉన్నందువల్ల సకాలంలో వరినాట్లు వేయలేకపోయాం. నెల రోజులు కురిసిన వర్షాలకు నారు పాచిపోయింది. నారుమడుల్లో వరదనీరు ఉన్నందువల్ల నారు పాచిపోయినప్పటికీ అధికారులెవ్వరూ పట్టించుకోలేదు. నష్టపరిహారం గురించి కూడా  పట్టించుకోలేదు. 

- దంపూరు శ్రీనివాసులురెడ్డి, రైతు, పోతిరెడ్డిపాళెం


Updated Date - 2022-01-06T04:56:30+05:30 IST