కోళ్ల ఫారాల క్రాప్‌ హాలీడే

ABN , First Publish Date - 2022-06-20T05:49:29+05:30 IST

కోళ్ల ఫారాల క్రాప్‌ హాలీడే

కోళ్ల ఫారాల క్రాప్‌ హాలీడే
కేసముద్రం మండలంలో క్రాప్‌ హాలీడేతో ఖాళీగా వెలవెలబోతున్న కోళ్ల ఫాం

కంపెనీలతో ఏర్పడ్డ కూలి రేట్ల వివాదంతో రైతుల నిర్ణయం

సమస్యల పరిష్కారానికి సంఘటితమైన ఫామ్‌ రైతులు

ఈ నెల 8 నుంచి కోళ్ల పెంపకం నిలిపివేత

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 330 ఫామ్‌ల బంద్‌ 

రాబోయే రోజుల్లో మరింత పెరగనున్న చికెన్‌ ధర

ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలి : రైతుల విన్నపం


కేసముద్రం, జూన్‌ 19 : పౌలీ్ట్ర రైతుల కష్టాన్ని కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు దోచుకుంటున్నాయని, రైతులకు కనీస కూలీ గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫౌలీ్ట్రఫామ్‌లు క్రాప్‌ హాలిడే (లాక్‌డౌన్‌) పాటిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చిన్న, మధ్య, పెద్దతరహా 500 ఫౌలీ్ట్రఫామ్‌లు ఉండగా, దాదాపు 300 ఫామ్‌ల వరకు సంఘటితమై ఈనెల 8 నుంచి కోళ్ల పెంపకాన్ని నిలిపివేశాయి. ఫలితంగా రాబోయే నెలరోజుల్లో చికెన్‌షాపులకు కంపెనీల నుంచి కోళ్ల సరఫరాలో ఆటంకం ఏర్పడనుంది. అయితే కంపెనీలు మాత్రం పొరుగు రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకొని సరఫరా చేసే అవకాశం లేకపోలేదు. రవాణాఖర్చు పెరగనున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే చికెన్‌ ఇప్పుడున్న ధరలకు దాదాపు రెట్టింపు అయి కిలో రూ.400లకుపైగా చేరే ప్రమాదం ఉందని చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు అంచనాలు వేస్తున్నారు. 


కంపెనీలతో వివాదం

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న కోళ్ల ఫామ్‌లలో కొన్ని ప్రైవేటు కార్పొరేట్‌ కంపెనీలు ఇంటిగ్రేటెడ్‌ ఫామింగ్‌ పేరిట రైతులకు కోడిపిల్లలను ఇచ్చి వాళ్ల ఫారాలలో పెంపకం చేయాలని ఒప్పందం చేసుకుంటాయి. కంపెనీలు కోడిపిల్లలు, దాణా, మందులు, శాస్త్రీయ పర్యవేక్షణ అందిస్తుంటాయి. ఒక కోడి పెరగడానికి 45 నుంచి 50 రోజుల సమయం రేయింబవళ్లు కష్టపడాల్సి ఉంటుంది. 45 రోజుల అనంతరం కంపెనీ వాహనాలు ఫామ్‌ వద్దకు ఆ కోళ్లను తీసుకుంటాయి. ఇలా కోళ్లను పెంచినందుకు కంపెనీలను బట్టి కిలో బరువుకు రూ.4.5 నుంచి రూ.7ల చొప్పున ఫౌలీ్ట్ర రైతులకు కూలీ చార్జీల కింద చెల్లిస్తున్నాయి. అయితే కూలీ చార్జీలు గిట్టుబాటు కాకపోగా.. పెంపకంలో చనిపోయిన కోళ్లకు అయినఖర్చు, పర్యవేక్షకుడి ఖర్చు అంతా రైతుకు చెల్లించే మొత్తంలోంచి కోత విధిస్తున్నారు. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకువచ్చి, లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఫామ్‌లో పనిచేసిన రైతుకు చివరకు కనీసం కూలీ కూడా మిగలడంలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


డిమాండ్లు ఇవే..

కోళ్ల ఫామ్‌లలో పెంచిన కిలో కోడి బరువుకు రూ.12 చొప్పున రైతులకు కూలీ చార్జీలు ఇవ్వాలని ఫౌలీ్ట్ర రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కిలో కోడికి 1.7కిలోల దాణాను మాత్రమే కంపెనీ సరఫరా చేస్తుంది. 40 రోజుల అనంతరం కోడి బరువు పెరగడం నిలిచిపోతుంది. ఆ సమయంలో కోడికి అయ్యే దాణా ఖర్చు రైతుపైనే పడుతోంది. 40 నుంచి 50 రోజుల మధ్య కోళ్లను కంపెనీ తీసుకువెళ్లకుండా రైతు వద్దనే ఉంచడంవల్ల రైతులకు దాణా రూపంలో నష్టం జరుగుతున్నందున సకాలంలో కోళ్లను ఫామ్‌ను నుంచి మార్కెట్‌కు తరలించాలని కోరుతున్నారు. పెంపకంలో చనిపోయే కోడిపిల్లల నష్టాన్ని కంపెనీయే భరించాలని, కంపెనీ ఇచ్చిన కోడిపిల్లల పెంపకంలో విధానాన్ని కంపెనీయే పర్యవేక్షించుకోవాలని, అయితే పర్యవేక్షణ ఉద్యోగికి కిలోకు రూ.6ల చొప్పున రైతు వద్ద కంపెనీ వసూలు చేస్తుందని, ఈ ఉద్యోగి ఖర్చును కంపెనీయే భరించాలని కోరుతున్నారు. కోళ్ల ఫామ్‌లకు వాడుకునే విద్యుత్‌ కనెక్షన్‌ను వాణిజ్యం కాకుండా వ్యవసాయ కనెక్షన్‌గా మార్చాలని కోరుతున్నారు. చనిపోయిన కోడిపిల్ల ధరను రూ.30లుగా లెక్కిస్తున్నందున రూ.22లకు తగ్గించాలని, కోళ్ల పెంపకం చేపట్టే రైతుకు కంపెనీయే బీమా ప్రీమియం చెల్లిస్తూ రక్షణ కల్పించాలని అడుగుతున్నారు. కోళ్ల బ్యాచ్‌ల మధ్య విరామం ఇవ్వకుండా వెంటనే కోడిపిల్లలను ఇవ్వాలని కోరుతున్నారు. 


సంఘటితమైన కోళ్ల రైతులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫౌలీ్ట్ర రైతుల సమస్యలను ప్రభుత్వం, కంపెనీల దృష్టికి తీసుకువెళ్లేందుకు సంఘటితమయ్యారు. కొద్దినెలల కిందటే ఓరుగల్లు ఇంటిగ్రేటెడ్‌ బ్రాయిలర్‌ ఫౌలీ్ట్ర ఫార్మర్స్‌ అసోసియేషన్‌్‌ పేరిట రైతులు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఉమ్మడి  జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 300 ఫామ్‌ల రైతులు సభ్యత్వాన్ని తీసుకున్నట్లు సంఘం బాధ్యులు తెలిపారు. అన్ని మండలాల్లో సంఘం తరపున పర్యటిస్తూ సంఘాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. 


ఉపాధి దూరం

ఫౌలీ్ట్రఫామ్‌లపై కేవలం రైతులే కాకుండా వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ క్రాప్‌హాలీడే మూలంగా ఆయా కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయి. కంపెనీలకు, ఫౌలీ్ట్ర రైతులకు మధ్య ఉన్న సమస్యలను ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కరించాలని ఫౌలీ్ట్ర రైతులు, చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు కోరుతున్నారు.


గిట్టుబాటు కావడం లేదు : ఉప్పునూతుల రమేష్‌, ఫౌలీ్ట్ర రైతు, కేసముద్రం విలేజి 

కంపెనీ ఇచ్చే కూలీ చార్జీలు గిట్టుబాటు కావడంలేదు. ఈ వేసవిలో కోడిపిల్లలు అధికంగా చనిపోవడంతో కూలీచార్జీల్లో కోత భారీగా విధించారు. రేయింబవళ్లు  కష్టపడితే నెలకు రూ.15వేల చొప్పున వచ్చాయి. అవన్నీ కూలీలకు ఇచ్చే చార్జీలు, కరెంటు బిల్లులకే సరిపోయాయి. 


ప్రభుత్వం చొరవ తీసుకోవాలి : సూదుల రత్నాకర్‌రెడ్డి,  ఫౌలీ్ట్ర ఫార్మర్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు 

ఫౌలీ్ట్రఫామ్‌ రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఈ రంగంపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. క్రాప్‌హాలీడేతో వారంతా ఉపాధి కోల్పోతున్నారు. బ్యాంకు రుణాలు, బయట తీసుకువచ్చిన అప్పులు చెల్లించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కార్పోరేట్‌ కంపెనీలతో చర్చలు జరిపి రైతులకు గిట్టుబాటు కూలీ చార్జీలను ఇప్పించాలి. 

Updated Date - 2022-06-20T05:49:29+05:30 IST