ట్రూ అప్‌.. డౌన్‌

ABN , First Publish Date - 2021-11-10T04:56:48+05:30 IST

ట్రూ అప్‌ చార్జీల బాదుడు నుంచి విద్యుత్‌ వినియోగదారులకు ఉపశమనం కలిగింది. ఈ నెలలో జారీ అయిన కరెంట్‌ బిల్లుల్లో ట్రూ అప్‌ చార్జీలు లేకుండానే జారీ చేశారు.

ట్రూ అప్‌.. డౌన్‌

చార్జ్‌ లేకుండా కరెంట్‌ బిల్లులు 

బాదుడుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

రెండు నెలలకు రూ.45 కోట్లపైనే వసూలు

ఇప్పటికే చెల్లించిన చార్జీలపై విద్యుత్‌శాఖ మౌనం

అదనపు బాదుడు ఉపశమనం తాత్కాలికమా.. లేదంటే?


గుంటూరు, నవంబరు 9: ట్రూ అప్‌ చార్జీల బాదుడు నుంచి విద్యుత్‌ వినియోగదారులకు ఉపశమనం కలిగింది. ఈ నెలలో జారీ అయిన కరెంట్‌ బిల్లుల్లో ట్రూ అప్‌ చార్జీలు లేకుండానే జారీ చేశారు.  ట్రూ అప్‌ పేరుతో రెండు నెలలుగా వినియోగదారుల జేబులుకు పెద్దమొత్తంలో చిల్లుపడింది. ఈ చార్జీలపై వినియోదారుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావటం, ప్రతిపక్షాల నిరసనలతో పాటు హైకోర్టు జోక్యం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అదనపు బాదుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఏపీఈఆర్‌సీ ఆదేశాల మేరకు ట్రూ అప్‌ చార్జీలను మొత్తంగా 8 నెలల పాటు వినియోగదారుల నుంచి నెలవారీగా వసూలు చేయాలని విద్యుత్‌శాఖ తొలుత నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి వరకు ట్రూ అప్‌ చార్జీలను వసూలు చేయాలని ప్రణాళిక రూపొందించి ఇప్పటికే రెండు నెలలు వసూలు చేశారు. అయితే ట్రూ అప్‌ చార్జీలను తాత్కాలికంగా నిలిపివేసినా భవిష్యతులో దీనిని కొనసాగిస్తారేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రూ అప్‌ చార్జీల రూపంలో గుంటూరు సర్కిల్‌ పరిధిలో రూ.45.211 కోట్లు వసూలైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. సెప్టెంబరులో జారీ చేసిన బిల్లుతో రూ.22.513 కోట్లు వసూలు కాగా అక్టోబరు నెల బిల్లులో రూ.22.698 కోట్లు వసూలయ్యాయి. కాగా నవంబరు నెల బిల్లులో ట్రూ అప్‌ చార్జీలు లేకుండా ఇవ్వడంతో ప్రజలకు ఉపశమనం లభించినట్లైంది. ట్రూ అప్‌ చార్జీల బాదుడు ఇకపై ఉండదా, భవిష్యతులో ఉంటుందా అనే దానిపై కూడా ఆ శాఖ అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికే చెల్లించిన ట్రూ అప్‌ చార్జీల సంగతి ఏమిటన్న ప్రశ్న వినియోగదారుల నుంచి వ్యక్తమవుతుంటే, ఎటూ చెప్పలేని స్థితిలో ఆ శాఖ యంత్రాంగం ఉంది. 

Updated Date - 2021-11-10T04:56:48+05:30 IST