
అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందని Power Minister Peddireddy Ramachandrareddy అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 186 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉందని తెలిపారు. పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేను ఉపసంహరిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు వినియోగించాల్సిన విద్యుత్ ను కూడా 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఆహారశుద్ధి, కోల్డ్ స్టోరేజీ, ఆక్వా పరిశ్రమలకు 100 శాతం విద్యుత్ వినియోగానికి అనుమతి ఇచ్చామన్నారు. ప్రస్తుతం ఏపీ అవసరాల కోసం 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే కొనుగోలు చేస్తున్నామని, చాలా రాష్ట్రాల్లో ఇంకా విద్యుత్ కొరత ఉందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని పేర్కొన్నారు. ఆరు నెలల్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ద్వారా ఏడాదిలో 33 శాతం మేర విద్యుత్ ఆదా అయిందని తెలిపారు. ఆ మేరకు డిస్కమ్ లు తీసుకునే సబ్సిడీ తగ్గిందని, ప్రస్తుతం ఏపీలో వ్యవసాయ సబ్సీడీగా 10 వేల కోట్లు ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి