వైసీపీ వల్లే విద్యుత్‌ సంక్షోభం

ABN , First Publish Date - 2022-04-09T07:42:55+05:30 IST

వైసీపీ ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాలు, అనాలోచిత విధానాలే రాష్టంలో విద్యుత్‌ సంక్షోభానికి కారణమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

వైసీపీ వల్లే విద్యుత్‌ సంక్షోభం

  • లోపభూయిష్ఠ నిర్ణయాలే కారణం
  • చార్జీలు తగ్గిస్తామని 57% పెంచారు
  • 200 యూనిట్ల వరకూ ఉచితమన్నారు
  • ఫ్యాన్లు, లైట్లు వేసుకోకుండా చేశారు
  • సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో వైద్యం
  • పవర్‌ హాలీడేతో పరిశ్రమలకు నష్టం
  • 36 లక్షల మంది కార్మికులపై ప్రభావం
  • వైసీపీపై జనసేనాని పవన్‌ విమర్శలు
  • నోటికొచ్చినట్లు మాట్లాడి
  • సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరిక


అమరావతి, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాలు, అనాలోచిత విధానాలే రాష్టంలో విద్యుత్‌ సంక్షోభానికి కారణమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఏపీలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభంపై శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. పల్లెల్లో 11-14 గంటలు, పట్టణాల్లో 5-8 గంటలు, నగరాల్లో 4-5 గంటలు చొప్పున అనాధికార విద్యుత్‌ కోతలతో జనం అల్లాడిపోతున్నారన్నారని అన్నారు. సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో ఆస్పత్రుల్లో ఆపరేషన్లు, ప్రసవాలు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. విభజన సమయంలో ఏపీ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఉండేదని గుర్తుచేశారు. 2014-19 మధ్య విద్యుత్‌ కోతల ప్రభావం పెద్దగా ఉండేది కాదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసిందన్నారు. యూనిట్‌ రెండు రూపాయిలకే గ్రీన్‌ ఎనర్జీనీ తీసుకొస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు కోల్‌ ఎనర్జీని రూ.20 పెట్టి కొనుగోలు చేస్తుందన్నారు. 


తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన వైసీసీ ఇప్పుడు 57 శాతం విద్యుత్‌ చార్జీలు పెంచిందని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. అల్పాదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ ఇస్తామని, ఇప్పుడు చార్జీలు పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేసిందని విమర్శించారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు కరెంట్‌ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పరిశ్రమలకు ఇప్పటికే వారాంతంలో ఒక రోజంతా విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నారన్నారు. తాజాగా మరో రోజు పవర్‌ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూత పడుతున్నాయన్నారు. 50 శాతం నిబంధనతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు నష్టాల పాలవుతున్నారన్నారు. దీనివల్ల పారిశ్రామికాభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. 36 లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడుతుందన్నారు. 


ఎవరినెలా ఎదుర్కోవాలో తెలుసు..

వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదని పవన్‌ సృష్టం చేశారు. ప్రజలు బాగుపడాలని, వారిని పల్లకీ ఎక్కించాలనే ఉద్దేశంతోనే పార్టీని ప్రారంభించానని మరోసారి సృష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి పెరిగిన విద్యుత్‌ చార్జీల వరకూ ప్రజల పక్షానే పోరాటం చేస్తున్నామన్నారు. ‘‘ఉద్యోగులు రోడ్డెక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణం మేం కాదు. మీ విధానాలే. మేం ప్రభుత్వ విధానాలు, పాలసీల గురించి మాట్లాడితే నన్ను రాక్షసుడు, దుర్మార్గుడు అని దూషిస్తున్నారన్నారు. మీరు వ్యక్తిగతంగా దూషణలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. మీరు నోటికొచ్చినట్లు మాట్లాడి మా సహనాన్ని పరీక్షించవద్దు’’ అని హెచ్చరించారు. వైసీపీ అనాలోచిత విధానాలతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో జనసైనికులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.

Updated Date - 2022-04-09T07:42:55+05:30 IST