ఎడాపెడా విద్యుత్‌ కోత

ABN , First Publish Date - 2022-05-27T06:34:08+05:30 IST

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొద్దిరోజులుగా అనధికార విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయి.

ఎడాపెడా విద్యుత్‌ కోత

లోడ్‌ రిలీఫ్‌ పేరిట అనధికారికంగా సరఫరా నిలిపివేత

వినియోగదారుల గగ్గోలు


విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):


ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొద్దిరోజులుగా అనధికార విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయి. ఇటీవల విశాఖపట్నం వచ్చిన విద్యుత్‌ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకపోయినా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, పరిశ్రమలకు విద్యుత్‌ ఆంక్షలు ఎత్తివేశామని ప్రకటించారు. అయితే వాస్తవంగా చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆంక్షలు ఎత్తివేసినా, ఎప్పుడు విద్యుత్‌ ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు బుధవారం రాత్రి సుమారు మూడు నుంచి నాలుగు గంటలు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పవన్‌ విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోయినందున ఇబ్బందులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఇది ఒక్క పూట సమస్య కాదని, కొద్దిరోజులు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ప్రస్తుతం బొగ్గు సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో కోటా మేరకు విద్యుత్‌ కేటాయింపులు జరగడం లేదు. అధికారులు కూడా ఎంత విద్యుత్‌ అవసరమో సరైన అంచనా వేయలేకపోతున్నారు. డిమాండ్‌ ఎంతో లెక్కించి, ఇండెంట్‌ పెడితే...అందుకు తగినంత విద్యుత్‌ అటుఇటుగా వస్తుంది. కానీ అంచనాలు వేరుగా ఉండడం, వినియోగం మించిపోవడంతో ‘లోడ్‌ రిలీఫ్‌’ పేరుతో ఎక్కడికక్కడ అనధికార కోతలు విధిస్తున్నారు. గురువారం విశాఖనగరంలోని పోతినమల్లయ్యపాలెం, పెదవాల్తేరు, రేసపువానిపాలెం, సీతంపేట, అక్కయ్యపాలెం, మురళీనగర్‌, అనకాపల్లి జిల్లాలోని మాకవరపాలెం, కోటవురట్ల, గూడెంకొత్తవీధి తదితర ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు సరఫరా ఆగిపోయింది. అత్యధిక ప్రాంతాల్లో రోజుకు ఐదారుసార్లు విద్యుత్‌ సరఫరా ఆపేసి, ఆ తరువాత ఇస్తున్నారు. ఇలా ఆపి ఆపి ఇవ్వడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చిన్న తరహా పరిశ్రమల ప్రతినిధులు వాపోతున్నారు. విద్యుత్‌ కోతల వల్ల వినియోగదారులకు చెప్పిన సమయానికి సేవలు అందించలేకపోతున్నామని ఆటోనగర్‌, మర్రిపాలెం ఇండస్ట్రియల్‌ ఏరియాలోని పలు సర్వీసు సంస్థలు వాపోతున్నాయి. 

Updated Date - 2022-05-27T06:34:08+05:30 IST