పరిశ్రమలకు పవర్‌ కట్‌!

ABN , First Publish Date - 2022-04-08T08:25:47+05:30 IST

కరెంటు కోతలు ఖరారయ్యాయి! అనధికారిక కోతలతో జనాన్ని ఉక్కపోతల పాలు చేస్తున్న సర్కారు... పరిశ్రమలకు అధికారికంగా ‘పవర్‌ కట్స్‌’ ప్రకటించింది. పరిశ్రమలకు వారంలో ఒక రోజు పూర్తిగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేయనున్నట్లు..

పరిశ్రమలకు పవర్‌ కట్‌!

వారంలో ఒక రోజు ‘పూర్తిగా కోత’

ప్రాసెసింగ్‌ పరిశ్రమలు సగమే వాడుకోవాలి

వాణిజ్య సంస్థల్లో సగం ఏసీలు బంద్‌

ప్రకటనల సైన్‌ బోర్డుల లైట్లూ ఆర్పాలి

8 ఏళ్ల తర్వాత తొలిసారిగా ‘పవర్‌ హాలిడే’

రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయింది: చంద్రబాబు


కరెంటు కోతలతో ప్రాణాలు విలవిల

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లికి చెందిన మంజేటి నాగమణికి బుధవారం రాత్రి 10.30 గంటలప్పుడు నొప్పులొచ్చాయి. అదే సమయంలో ఆస్పత్రిలో కరెంటు పోయింది.. జనరేటర్‌ పనిచేయలేదు. ఎక్కడా కొవ్వొత్తులు దొరకలేదు. చివరకు సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులోనే పురుడుపోశారు. ఇక రెండో చిత్రంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో కరెంటు పోవడంతో రోగులకు విసనకర్రతో విసురుతున్న బంధువులు. వరుస కోతలతో రాష్ట్రమంతా ముసురుకున్న చీకట్లకు అద్దంపడుతున్న దృశ్యాలివి!


విజయవాడ/తిరుపతి/అమరావతి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కరెంటు కోతలు ఖరారయ్యాయి! అనధికారిక కోతలతో జనాన్ని ఉక్కపోతల పాలు చేస్తున్న సర్కారు... పరిశ్రమలకు అధికారికంగా ‘పవర్‌ కట్స్‌’ ప్రకటించింది. పరిశ్రమలకు వారంలో ఒక రోజు పూర్తిగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. దీంతో... రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా పరిశ్రమలకు ‘పవర్‌ హాలిడే’ అమలులోకి వస్తున్నట్లవుతోంది. శుక్రవారం నుంచే ఈ ‘పవర్‌ హాలిడే’ అమలులోకి వస్తుంది. కొన్ని పరిశ్రమలకు ఇప్పటికే వారాంతపు సెలవు దినంలో విద్యుత్తు సరఫరా చేయడంలేదు. ఇప్పుడు ఇంకో రోజూ కరెంటు ఇవ్వరు. ఇక... తప్పనిసరిగా నడిచి తీరాల్సిన ప్రాసెసింగ్‌ పరిశ్రమలు తమ సామర్థ్యంలో 50 శాతం మాత్రమే ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశారు. అంటే... సగం కరెంటునే వాడుకోవాలని తేల్చి చెప్పారు. వాణిజ్య సంస్థలు సగం ఏసీలను మాత్రమే వినియోగించుకోవాలని విద్యుత్తు శాఖ ఆదేశించింది. సాయంత్రం కాగానే... వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన సైన్‌ బోర్డుల లైట్లను కూడా ఆర్పేయాలని తూర్పు డిస్కమ్‌ సీఎండీ సంతోషరావు ఆదేశించడం విశేషం.


ఇక వ్యవసాయానికి ఏడు గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేయాలని నిర్ణయించారు. వారంలో ఒకరోజు పరిశ్రమలకు కరెంటు కోత పెడుతూనే... దీనిని ‘పవర్‌ హాలిడే’గా పరిగణించరాదని ఇంధన శాఖ చెప్పడం గమనార్హం. ‘‘రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ పతాకస్థాయికి చేరుకుంది. 40 నుంచి 50 మిలియన్‌ యూనిట్ల మేర లో టు ఉంటోంది’’ అని ఇంధన శాఖ తెలిపింది. విద్యుత్తు డిమాం డ్‌, సరఫరాపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ గురువారం విద్యుత్తు సౌధలో సమీక్షించారు. గ్రిడ్‌పై ప్రతికూల ప్రభావం చూపకుండా.. గృహ విద్యుత్తుకు రోజుకు 4 గంటల వరకూ సరఫరాను నిలిపివేస్తున్నట్లుగా అధికారులు వివరించారు.


తప్పడంలేదు

‘‘వేసవిలో ఎండల తీవ్రత కారణంగా గృహ విద్యుత్‌ వినియోగం 5 శాతం, వ్యవసాయ విద్యుత్‌ వినియోగం 15 శాతం పెరిగింది. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు లభించడంలేదు. ఈ నేపథ్యంలో గృహ వినియోగానికి మెరుగైన విద్యుత్‌సరఫరా చేసేందుకు పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్‌ హాలిడే అమలు చేయనున్నాం. ఈ నెల 22వ తేదీ వరకూ ఇది అమలులో ఉంటుంది.’’

హరనాథరావు, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ, తిరుపతి



విద్యుత్‌ ఆఫీసు వద్ద రైతు రోదన

కూడేరు, ఏప్రిల్‌ 7: అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని ఇప్పేరుకు చెందిన మల్లికార్జున అనే రైతు కూడేరు మండల కేంద్రంలోని విద్యుత్‌ కార్యాలయం వద్ద బోరున విలపించారు. కోతల కారణంగా చీనీతోట ఎండిపోతోందని రోదిం చాడు. రైతులతో కలిసి అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నాడు. ఒకానొక స్థితితో సొమ్మసిల్లే పరిస్థితి రావడంతో అక్కడున్న సిబ్బంది రైతుకు మంచినీరు ఇచ్చి ఓదార్చారు. గురువారం ఉదయం ఏడు గంటలకే రైతులు విద్యుత్‌ శాఖ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం రాస్తారోకో చేశారు. 

Updated Date - 2022-04-08T08:25:47+05:30 IST