తండాలు ఇక పవర్‌ ఫుల్‌

ABN , First Publish Date - 2021-02-26T05:50:19+05:30 IST

మెదక్‌ జిల్లాలోని గిరిజన తండాల్లో ఇన్నాళ్లు సింగిల్‌ ఫేజ్‌ కరెంటు సరఫరా కావడంతో బోరుమోటారును, ఉపాఽధి కోసం పిండిగిర్ని, ఇతర యంత్రాలను ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఇక ఈ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. ప్రభుత్వం జిల్లాలోని 149 తండాల్లో త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయిచింది. ఈ మేరకు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ తీగల కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది.

తండాలు ఇక పవర్‌ ఫుల్‌

జిల్లాలోని 149 తండాలకు త్రీఫేజ్‌ కరెంటు సరఫరా 

తీరనున్న విద్యుత్‌ సమస్యలు

ట్రాన్స్‌ఫార్మర్‌, విద్యుత్‌ తీగల ఏర్పాటుకు నిధులు మంజూరు


మెదక్‌ రూరల్‌, పిబ్రవరి 25 : జిల్లాలోని గిరిజన తండాల్లో ఇన్నాళ్లు సింగిల్‌ ఫేజ్‌ కరెంటు సరఫరా కావడంతో బోరుమోటారును, ఉపాఽధి కోసం పిండిగిర్ని, ఇతర యంత్రాలను ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఇక ఈ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. ప్రభుత్వం జిల్లాలోని 149 తండాల్లో త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయిచింది. ఈ మేరకు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ తీగల కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. 

జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 63 తండా పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 86  చిన్న చిన్న తండాలు కలుపుకొని జిల్లాలో 149 వరకు తండాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు దూరంగా వ్యవసాయ పొలాల్లో నివాసాలు ఉంటడంతో తండాల్లో విద్యుత్‌ సరఫరా పెద్దగా లేదు. అన్ని తండాలకు ఇప్పటివరకు సింగిల్‌ ఫేజ్‌ కరెంటునే అందిస్తున్నారు. కేవలం ఇంటి అవసరాలకే మాత్రమే ఈ సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అవుతున్నది.  కొంతకాలంగా తండాల్లో త్రీ ఫేజ్‌ కరెంటు ఏర్పాటు చేయాలని గిరిజనుల నుంచి వచ్చిన విజ్ఞాపనలతో ప్రభుత్వం జిల్లాలో ఉన్న అన్ని తండాల వివరాలను సేకరించారు. జిల్లాలో 149 తండాల్లో కేవలం సింగిల్‌ ఫేజ్‌ కరెంటు మాత్రమే సరఫరా అవుతుండడంతో అందులో త్రీఫేజ్‌ కోసం ప్రతిపాదనలు పంపారు.


త్రీఫేజ్‌ ఏర్పాటుకు రూ.4.85 కోట్లు మంజూరు

149 తండాల్లో త్రీఫేజ్‌ కరెంటును సరఫరా చేసేందుకు రూ.4.85 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అన్ని తండాల్లో స్తంభాలతో పాటు సింగిల్‌ ఫేజ్‌ తీగలు ఉన్నాయి. వాటితో పాటు మరో రెండు తీగలను ఏర్పాటు చేసి, త్రీఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించనున్నారు. ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ స్థానంలో కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తారా.. లేక మరో రెండు సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలా అన్నదానిపై అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.  జిల్లాకు కేటాయించిన నిధులతో కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించి త్వరలోనే చేయించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.


తండాల్లో త్వరలోనే పనులు చేపడుతాం

త్వరలోనే త్రీఫేజ్‌ పనులు చేపడుతాం. జిల్లాలో సింగిల్‌ ఫేజ్‌ సరఫరా అవుతున్న తండాల వివరాలను పంపించగానే వెంటనే ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి స్తంభాలు, విద్యుత్‌ తీగల పనులకు సంబంధించిన అంచనాలు తయారు చేస్తున్నాం. త్వరలోనే పనులు ప్రారంభించి త్రీఫేజ్‌ను అందుబాటులోకి తెస్తాం.

- శ్రీనాథ్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ


తీరనున్న కరెంటు సమస్య 

మల్కాపూర్‌ తండా అంతటా సింగిల్‌ ఫేజ్‌ కరెంటు మాత్రమే ఉంది. త్రీఫేజ్‌ లేకపోవడంతో ఇళ్ల వద్ద బోరు మోటార్లు ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొన్నది. పిండిగిర్నీ, ఇతర యంత్రాలను పెట్టుకోలేకపోతున్నాం. త్రీఫేజ్‌ ఏర్పాటుతో అన్ని సమస్యలు తీరనున్నాయి.     

- మేఘావత్‌ మోహన్‌, మల్కాపూర్‌


తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తుంది. గతంలో రోడ్లు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి ఇబ్బందులను తొలగించింది. ప్రస్తుతం త్రీఫేజ్‌ కరెంటు ఇవ్వడం వల్ల ఏళ్లుగా తలెత్తుతున్న కరెంటు కష్టాలు తొలగిపోనున్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది.           

- యశోద, సర్పంచ్‌, స్కూల్‌ తండా 


Updated Date - 2021-02-26T05:50:19+05:30 IST