ltrScrptTheme3

అధికారానికి ఆద్యంతాలు ప్రజలే!

Oct 12 2021 @ 01:17AM

భారత ప్రజాస్వామ్య దీప్తి కొడిగట్టిన రోజు 1967 అక్టోబర్ 12. భారత ప్రజాస్వామ్య ప్రవక్త కాకపోయినా, దాని పరిరక్షకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా మరే ఇతర కారణాల కంటే, చికిత్స పొందుతున్న ప్రభుత్వ వెల్లింగ్టన్ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మరణించారు. ఒక సామాన్యుడిలా ఆయన అస్తమించారు. అది ఎంతైనా దురదృష్టకరం. ఇంకా ఒకటి రెండు సంవత్సరాలు ఆయన జీవించి ఉంటే భారత ప్రజాసామ్య ప్రస్థాన చరిత్ర మరోలా ఉండేది. 1967 సార్వత్రక ఎన్నికలలో, ఆరేడు రాష్ట్రాలలో ఎస్‌విడి (సంయుక్త విధాయక్ దళ్) సంకీర్ణానికి ఆయన ఘనవిజయం సాధించిపెట్టారు. ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిందో లేదో డాక్టర్ లోహియా కీర్తిశేషుడు కావడం, ప్రజాస్వామిక సోషలిస్ట్ సమాజ నిర్మాణాన్ని సంకల్పించుకున్న భారత్‌కు పెనుఘాతమయింది. 


ప్రజాస్వామిక స్ఫూర్తిని మనసా వాచా కర్మణా ఆచరించిన లోహియా గురించి ఆలోచిస్తున్నప్పుడు మరో ఇద్దరు ధీమంతులు తప్పక మన మనస్సులను ఆవహిస్తారు. ఆ ఇరువురు నవ రాజనీతి సిద్ధాంతాల ప్రవర్థకులయిన మానవేంద్రనాథ్ రాయ్, జయప్రకాశ్ నారాయణ్. రాయ్ భావన అయిన ‘పార్టీరహిత ప్రజాస్వామ్యం’తో లోహియా తీవ్రంగా విభేదించారు. అయితే ఆ అపూర్వ ఆలోచనాశీలి ప్రతిపాదించి, అభివృద్ధిపరిచిన ‘నవ్య మానవవాదం’ అనే ప్రజాస్వామిక తాత్వికతను మాత్రం అమితంగా గౌరవించారు. లోక్‌నాయక్‌గా సుప్రసిద్ధుడయిన జయప్రకాశ్ నారాయణ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో లోహియాతో కలిసి పనిచేశారు. స్వాతంత్ర్యానంతరం ఆయనతో విభేదించిన జయప్రకాశ్ సర్వోదయవాది అయ్యారు. 1967 సార్వత్రక ఎన్నికల అనంతరం సంయుక్త విధాయక్‌దళ్ సంకీర్ణ ప్రభుత్వాల ప్రయోగంలో లోహియా నిర్వహించిన పాత్రనే 1974–77 మధ్య కాలంలో దేశ రాజకీయాలలో సంభవించిన పరిణామాలు, ముఖ్యంగా జనతా ప్రభుత్వ ప్రయోగంలో లోక్ నాయక్ నిర్వహించారు. 


లోహియా హృదయంలో హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ప్రధాన రచనలలో ఒకటి అయిన ‘ది వీల్ ఆఫ్ హిస్టరీ’ (ఇతిహాస చక్రం)ను ఆయన నిజాం కళాశాలలో వెలువరించిన ప్రసంగాల సంపుటి. ఈ పుస్తకంతో పాటు లోహియా రాసిన మార్క్స్, గాంధీ, సోషలిజం; ది క్యాస్ట్ సిస్టమ్; గిల్టీ మెన్ ఆఫ్ ఇండియాస్ పార్టిషన్‌ను హైదరాబాద్‌లోని సమతాన్యాస్ అనే సంస్థ ప్రచురించింది. లోహియా -సోషలిస్ట్ సాహిత్యం ఈ నగరం నుంచే ప్రచురితమయింది. హైదరాబాద్‌తో లోహియా అనుబంధం గురించి చెప్పేటప్పుడు తప్పక ప్రస్తావించాల్సిన వ్యక్తి బద్రి విశాల్ పిట్టి. నిజాం నవాబ్ ఫైనాన్షియర్ కుమారుడైన బద్రి విశాల్ పిట్టిని చాలా మంది ‘బడే బాప్ కా బడే బేటా’గా అపార్థం చేసుకున్నారు. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన వాస్తవంగా జన్మతః సోషలిస్టు అని చెప్పవచ్చు. ఈ దృష్ట్యా ఆయన ‘బడే బాప్‌కే సహీ బేటె’ అని చెప్పాలి. లోహియా హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చినా సోమాజిగూడలోని పిట్టి విశాల సౌధంలో బస చేస్తుండేవారు. లోహియా అనుయాయి అయిన మరో హైదరాబాదీ కేశవ్ రావు జాదవ్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ఆచార్యుడైన జాదవ్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అవిస్మరణీయమైన పాత్ర నిర్వహించారు. లోహియా అనుయాయులయిన హైదరాబాదీల పేర్ల జాబితా చాలా సుదీర్ఘమైనది. ఎవరైనా సరే ఒకసారి లోహియాతో సంభాషించడం జరిగిందంటే ఆ వ్యక్తి తన జీవితాంతం ఆయన నిశిత మేధ, వ్యక్తిత్వం పట్ల ఆకర్షితుడవుతూనే ఉంటాడనడంలో సందేహం లేదు. అలాగే ఆయన సిద్ధాంతాలు, రాజకీయ, రచనా కార్యకలాపాల పట్ల కూడా విశేష శ్రద్ధాసక్తులు చూపుతూనే ఉంటాడు. 


రామ్ మనోహర్ లోహియా అపూర్వ భావ సమన్వయవాది. ప్రాచ్య, పాశ్చాత్య మేధోచరిత్రను సమగ్రంగా అధ్యయనం చేసిన విద్వజ్ఞుడు. కనుకనే పరస్పరం పూర్తిగా భిన్నమైన కార్ల్ మార్క్స్, మహాత్మా గాంధీ భావస్రవంతులు ఆయన ‘ప్రపంచ దృక్పథం’లో సమన్వయమై మానవతా పరిపూర్ణమైన ‘ప్రజాస్వామిక సమాజవాదం’ (డెమొక్రటిక్ సోషలిజం) గా ప్రభవించాయి.  


ప్రజాస్వామిక సామ్యవాద భావోద్యమంలో రామ్ మనోహర్ లోహియా, మానవేంద్రనాథ్ రాయ్, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మహోన్నత మేధో శిఖరాలు. ఉదాత్త చరిత్ర పావనులు. మరి నేడు మన భారతీయ సమాజంలోనూ, రాజకీయ జీవితంలోనూ కన్పిస్తున్నదేమిటి? ప్రజల సంకల్పాలు, ఆకాంక్షలను ప్రతిబింబించే నిజమైన ప్రజాస్వామిక సంప్రదాయాలకు బదులు మెజారిటీవాద ప్రజాస్వామ్యం, జనాకర్షక రాజకీయాలే కాదూ? నిజానికి, ఈ ధోరణులు మన దేశం లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజాస్వామిక దేశాలలో కూడా అత్యంత ప్రబలంగా ఉన్నాయి. 


‘సమస్త అధికారమూ ప్రజల నుంచే వస్తుంది. అయితే అది ఎక్కడకు వెళుతోంది’ అని జర్మన్ నాటకకర్త బెర్టోల్ట్ బ్రెహ్ట్ ఆశ్చర్యపడ్డారు. ఆయన విస్మయం సహేతుకమే. ఎందుకంటే జనాకర్షక పాలన ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమైనది. నేటి ‘ప్రజాస్వామిక’ ప్రభుత్వాలు రాజ్యవ్యవస్థను హైజాక్ చేస్తున్నాయి. అవి ఆచరిస్తున్న ఎన్నికల రాజకీయాల మూలంగా సర్వత్రా అవినీతి ప్రబలిపోతోంది. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు విచక్షణరహితంగా వ్యవహరిస్తూ తమ మద్దతుదారులకు ఆర్థికంగా, ఇతరత్రా ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఫలితంగా పాలనావ్యవస్థలో అవినీతి అక్రమాలు విశ్వరూపం దాలుస్తున్నాయి. పౌరసమాజాన్ని కఠినంగా అణచివేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణిస్తున్నారు. జనాకర్షక ప్రభుత్వానికి ఎక్కడైనా, ఎప్పుడైనా నిరంకుశంగా వ్యవహరించే నాయకుడే నేతృత్వం వహించడం పరిపాటి. ఎన్నికలలో ప్రజలు తమను గెలిపించిన కారణంగానే ఈ పరిపాలకులు ‘ప్రజలంటే తామే’ అన్న అతిశయానికి పోతున్నారు! నిజమైన ప్రజాస్వామికవాది అయిన లోహియా స్ఫూర్తితో మన ప్రజాస్వామ్యంలోని సకల అపసవ్య ధోరణుల నిర్మూలనకు పునరంకితమవుదాం. ప్రజాస్వామ్యాన్ని రోజువారీ రాజకీయ జీవిత విధానంగా మార్చుకుందాం. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల నుంచి అధికారం మళ్ళీ ప్రజలకు బదిలీ అయినప్పుడు మాత్రమే వాస్తవ ప్రజాస్వామ్యం వర్థిల్లగలుగుతుంది.

ఎ. నిరూప్

సుప్రీంకోర్టు న్యాయవాది 

(నేడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా 54వ వర్ధంతి)

ఈ సందర్భంగా రాం మనోహర్‌ లోహియా సమతా ట్రస్ట్‌, లోహియా విచార్‌ మంచ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ శ్రీకృష్ణదేవరాయ తెలుగుభాషా నిలయంలో ‘విశ్వమానవ రాగం–లోహియా మానసగానం పుస్తకావిష్కరణ జరుగుతుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.