అధికారమే లక్ష్యంగా..!

ABN , First Publish Date - 2022-07-02T08:30:17+05:30 IST

కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఉత్తరాదిలాగే దక్షిఽణాదిన కూడా బలపడటం, తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడం.

అధికారమే లక్ష్యంగా..!

  • తెలంగాణలో పాగా వేసేందుకు రోడ్‌మ్యాప్‌
  • కేంద్రంలో హ్యాట్రిక్‌, దక్షిణాదిన పార్టీ విస్తరణ 
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల లక్ష్యమిదే
  • ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశం
  • ఎజెండాపై అధ్యక్షుడి సమీక్ష.. నేడు తీర్మానాలు

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఉత్తరాదిలాగే దక్షిఽణాదిన కూడా బలపడటం, తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడం.. ఈ మూడు లక్ష్యాలు ఎజెండాగా బీజేపీ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది.  జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇందుకు సంబంధించి రోడ్‌మ్యాప్‌ రూపొందించుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఓవైపు కేంద్రంలో అధికారాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటూనే.. మరోవైపు ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో పట్టు సాధించే దిశగా పార్టీ అగ్రనాయకత్వం పావులు కదుపుతోందని పేర్కొన్నాయి. ఇందులో భాగంగా త్వరలో ఎన్నికలు జరగనున్న హిమాచల్‌ ప్రదేశ్‌, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే గుజరాత్‌, కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు తెలంగాణలోనూ కాషాయ జెండాను ఎగురవేయాలని జాతీయ నాయకత్వం పట్టుదలగా ఉందని వెల్లడించాయి. ఈ దిశగా హైదరాబాద్‌ వేదికగా బ్లూ ప్రింట్‌ సిద్ధం చేసుకోనుందని తెలిపాయి. దీంతోపాటు సంస్థాగత బలోపేతంపైనా ప్రత్యేక దృష్టి సారించబోతోందని పార్టీ వర్గాలు వివరించాయి.

 

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..

‘‘దక్షిణాదిన కర్ణాటక తర్వాత బలమైన క్యాడర్‌ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను జాతీయ నాయకత్వం గుర్తించింది. ఇక్కడ అధికార టీఆర్‌ఎ్‌సతో ఢీ అంటే ఢీ అంటున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో అధికారాన్ని ఇప్పుడు కైవసం చేసుకోకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదన్న అభిప్రాయంతో ఉంది. అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి రోడ్‌మ్యాప్‌ కూడా సిద్ధం చేసుకుంది’’ అని బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. కాగా, తెలంగాణలోని పలు నియోజకవర్గాల నుంచి బలమైన నేతలు తమ పార్టీలో చేరబోతున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి పలువురు సీనియర్‌ నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, ప్రస్తుతం ఆషాఢ మాసం కావడంతో వారు ఇప్పటికిప్పుడు చేరడం లేదని, ఆగస్టు నుంచి భారీ చేరికలు ఉండబోతున్నాయని పార్టీ కీలక నేత ఒకరు అన్నారు. త్వరలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని తెలిపారు. మరోవైపు తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచి అంటూ అధికార టీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. యూపీ వంటి రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న 13 సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. 


ఇక 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి జాతీయ కార్యవర్గ సమావేశంలో రోడ్‌మ్యాప్‌ ప్రతిపాదించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల వ్యూహరచనకు తమకు కావాల్సినంత సమయం కూడా దొరికిందని పార్టీ జాతీయ నేత ఒకరు అన్నారు. ‘బూత్‌లో గెలుపు.. పార్లమెంటు గెలుపు’ నినాదంతో దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోందని పేర్కొన్నారు. ‘‘మేం బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో సంస్థాగతంగా ఎలా బలోపేతం కావాలి? అన్న అంశంపై అధ్యయనం జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం చేయాలని మా నాయకత్వం నిర్ణయించింది’’ అని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. 


ప్రధాన కార్యదర్శులతో నడ్డా భేటీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్‌ఐసీసీలోని నొవాటెల్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై ఎజెండాపై సమీక్షించారు. శనివారం ఉదయం 8.30 గంటలకు జాతీయ పదాధికారుల సమావేశం జరుగుతుంది. అనంతరం జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ.. కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తారు.


జాతీయ కార్యవర్గ సమావేశాల ఎజెండా ఇదీ..

గత సమావేశం తర్వాత దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రధాన కార్యక్రమాలపై చర్చ

పార్టీ సంస్థాగత అంశాలపై సమీక్ష

దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు,

వివిధ రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

ప్రతిపాదిత తీర్మానాలపై చర్చ.

భవిష్యత్తు కార్యక్రమాలపై సమీక్ష.

Updated Date - 2022-07-02T08:30:17+05:30 IST