ఓటు చైతన్యం రానిదే బీసీలకు అధికారం కల్ల!

ABN , First Publish Date - 2022-06-17T06:25:41+05:30 IST

ఈమధ్య ఒక జాతీయ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు రాజ్యమేలాల, అన్ని పార్టీలకు రెడ్ల చేతుల్లోనే మనుగడ ఉంటది అని ఒక సందర్భంగా వ్యాఖ్యానించారు. అప్పుడు ఆ పార్టీలోని బీసీ నాయకులు...

ఓటు చైతన్యం రానిదే బీసీలకు అధికారం కల్ల!

ఈమధ్య ఒక జాతీయ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు రాజ్యమేలాల, అన్ని పార్టీలకు రెడ్ల చేతుల్లోనే మనుగడ ఉంటది అని ఒక సందర్భంగా వ్యాఖ్యానించారు. అప్పుడు ఆ పార్టీలోని బీసీ నాయకులు అనేకమంది విమర్శించారు. గతంలో జరిగిన రెండు రాష్ట్రాల రెడ్డి సామాజిక వర్గం మీటింగులో ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నవారు కూడా ‘రెడ్డి లేనిది రాజ్యం లేదు, రెడ్లు లేకుంటే ఏ పార్టీ ఉండదు’ అనటం చూసాం. ఇక తెరాస పార్టీకి చెందిన ఒక రెడ్డి నాయకుడు కేసీఆర్ పాలనలోనే రెడ్లకు అత్యధిక పదవులు దక్కినవని, రెడ్డి సీఎంలు ఉన్నప్పుడు కూడా ఇన్ని పదవులు, పథకాలు రెడ్లకు దక్కలేదని, రెడ్లకు ఏ పార్టీ ఇంత చేయలేదని అన్నారు.


ఈ మధ్య రెడ్డి సామజిక వర్గ నాయకుల మాటలను టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ చూస్తున్న బీసీలు విమర్శించి ఊరుకుంటున్నారు. అంతేతప్ప, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో 52శాతం ఉన్న బీసీలుగానీ, 89శాతం ఉన్న బహుజనులుగానీ ఆత్మవిమర్శ చేసుకోవటం లేదు. ఈ విశ్లేషణకు సంబంధించి కొన్ని యదార్థ సంఘటనలను వివరిస్తాను:


నేను డాట్స్ తరపున ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో వైద్య రంగంలో తెలంగాణ ఎలా నష్టపోయింది అనే రిపోర్టును శ్రీకృష్ణ కమిటీకి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా నాలో నాకే చిరునవ్వు వస్తుంది. ‘మీరు కమిటీకి నివేదిక ఇవ్వటానికి వచ్చిన సామాజిక సంఘాలు కదా? మీకు తెలంగాణ రాష్ట్రం అవసరం ఏంటి?’ అని జస్టిస్ శ్రీకృష్ణ ప్రశ్నించారు. బీసీ సంఘాలవారు ఎంతో ఆవేశంతో తమ వాదన వినిపించారు. బీసీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం లేదని, బీసీలు 85శాతం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, మీడియా యజమానులూ అంతా అగ్రకులం వాళ్ళేనని, తాము రెండో శ్రేణి పౌరులుగా జీవిస్తున్నామని, తెలంగాణ ఏర్పడితే అటువంటి చిన్న రాష్ట్రంలోనే తమకు సామజిక న్యాయం జరుగుతుందని వాదించారు. చిన్న కులాలకు చిన్న రాష్ట్రంలోనే అధికారం దక్కుతుందన్న వాదన వారిది. ఆ వాదన విన్న జస్టిస్ శ్రీకృష్ణ చిరునవ్వుతో, తొణక్కుండా బెణక్కుండా, మహాభారతంలో శ్రీకృష్ణుడు ఉపదేశించినట్లు వివిధ సంఘాలను ఉద్దేశించి, ‘నాయనా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాజ్యాధికారం బలహీన వర్గాలకు వస్తదని భావిస్తే అది మీ భ్రమ మాత్రమే. చిన్న రాష్ట్రమైనా, పెద్ద రాష్ట్రమైనా అధికారం రాష్ట్రాన్ని విభజిస్తేనో, అడ్డుకుంటేనో రాదు. బలవంతుడు ఎప్పుడూ నీకు పవర్ పళ్లెంలో పెట్టి ఇవ్వడు. తెలంగాణ రాష్ట్రం కేవలం బహుజనుల రాజ్యాధికారానికే అనుకుంటే మీకు అది ఎండమావి అవుతుంది’’ అని ప్రభోదించి పంపించాడు.


ఇక్కడ కొన్ని సామాజిక సంఘాల నైజం గురించి కూడా ప్రస్తావించాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తెరాస ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సందర్భంలో కొన్ని సంఘాలవారు ఒక మీటింగు పెట్టుకుంటామని నన్ను అడిగారు. నేను ఆదిత్య హాస్పిటల్ ఆడిటోరియంలో వారికి అన్ని సదుపాయాలు, స్నాక్స్ ఏర్పాటు చేశాను. వారు నన్ను కూడా సమావేశానికి రమ్మని పిలిచారు. ఆ సమావేశంలో వారు వాడుతున్న భాష, కేసీఆర్ను విమర్శించే తీరు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. చివరకు ఎమ్మెల్యే టిక్కెట్లు అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలన్నది ఆ సమావేశంలోని తీర్మానం. కానీ నేను మాత్రం డాట్స్ తరపున అన్ని నియోజకవర్గాల్లో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను గెలిపించటానికి మా వంతు కృషి చేస్తామని కరాఖండిగా చెప్పాను. తర్వాతి రోజు న్యూస్ పేపర్లో ఒక వింతైన ఘట్టం చూసాను. కేసీఆర్‌పై నానా రకాలుగా మాట్లాడిన వారంతా కేసీఆర్‌తో కలిసి దిగిన ఫొటో ఆ రోజు పేపర్లో ఉంది. వారంతా కేసీఆర్‌కు మద్దతు తెలుపుతున్నట్లు కూడా ప్రకటించారు. చివరకి తెలిసింది ఏమిటంటే– కేసీఆర్ వారిని పిలవలేదన్న ఆక్రోశంతో మాత్రమే అంతకుముందు సమావేశంలో వారు అలా మాట్లాడారు. కేసీఆర్ పిలిచి, బాగోగులు చూసుకోగానే వారిలో అనూహ్య పరివర్తన వచ్చింది. ఫలితంగా వారి మనసుల్లోంచి అమరవీరులు ఆవిరైపోయారు.


తెలంగాణ రాష్ట్ర సామాజిక ముఖచిత్రాన్ని గమనిస్తే– ఇక్కడ బీసీలు 52శాతం, ఎస్సీలు 16శాతం, ఎస్టీలు 9.1శాతం, ముస్లిమ్స్ 12శాతం, ఓసీలు 11శాతం ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల ఓట్లు ఉంటే అందులో 1.5కోట్లు బీసీలు, 46లక్షలు ఎస్సీలు, 27 లక్షలు ఎస్టీలు, 36 లక్షలు ముస్లిమ్స్, 33 లక్షలు ఓసీల ఓట్లు ఉంటాయి. బీసీ కులాల ఓట్లు విశ్లేషిస్తే పేరుకు 136 కులాలు ఉన్నప్పటికీ, ప్రధానంగా అయిదు మేజర్ కులాలైన గౌడ, గొల్ల కురుమ, ముదిరాజ్, మున్నూరుకాపు, పద్మశాలిల ఓట్లు మొత్తం కోటి దాకా ఉంటాయి. ఆ తర్వాత రజక, కుమ్మరి, వడ్డెర–ఉప్పర, నాయీబ్రాహ్మణ, లింగాయత్, విశ్వకర్మల ఓట్లు కలిపి దాదాపు 30 నుంచి 40 లక్షల దాకా ఉంటాయి. ఆ తర్వాత బోయ, బెస్త, లోధా, పెరిక, వంజరి, ఆరెకటిక, మేదర, పూసల తొగుట కులాల ఓట్లు కలిపి 10 నుంచి 15 లక్షల దాకా ఉంటాయి. మిగతా అన్ని కులాలు సంఖ్యలో తక్కువగా ఉంటాయి. ఎస్సీలలో ప్రధానంగా మాదిగ, మాల 80శాతం ఉంటారు. ముస్లిమ్స్‌లో 80శాతం బీసీ ముస్లిమ్స్ ఉంటారు. ఎస్టీలలో ప్రధానంగా లంబాడా, గోండు, చెంచు ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే బహుజనులలోని 227 కులాల్లో కేవలం 10 కులాల ఓట్లు 2 కోట్లు ఉంటాయి. ఓసీలలో రెడ్లు దాదాపు 6శాతం ఉంటే, మిగతా కులాలు 5 నుంచి 7శాతం దాకా ఉంటాయి.


2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని సామజిక వర్గాల కోణంలోంచి చూస్తే ఓసీలు 57 (48శాతం), రెడ్లు 38, వెలమ 11, కమ్మ 5, బ్రాహ్మణ 2, వైశ్య 1, బీసీలు 23 (19శాతం), ఎస్సీలు 19 (16శాతం), ఎస్టీలు 12 (10శాతం), ముస్లిమ్స్ 8 (6.7శాతం). దీన్నిబట్టి చూస్తే అన్ని సామాజిక వర్గాల కంటే అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ అత్యల్ప సంఖ్యలో ఎమ్మెల్యేలు కలిగిన వర్గం బీసీలు మాత్రమే. ఒక రాజకీయ రహస్యం ఏమిటంటే– 2018 ఎన్నికల్లో తెరాస పార్టీ 97,00,749 ఓట్లతో 88 ఎమ్మెల్యేలతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించింది. అంటే ఇది బీసీలలో అయిదు మేజర్ కులాల ఓట్ల సంఖ్యతో సమానం. అలానే ఎంఐఎం పార్టీ కేవలం 5,61,089 ఓట్లతో ఏడుగురు ఎమ్మెల్యేలతో గెలిచి అసెంబ్లీలో తమ వర్గం హక్కుల కోసం పోరాడగలుగుతున్నారు. పార్లమెంటులో ఒక ఎంపీతో తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. ఈ ఓట్లు బీసీలలోని ఒక మధ్యస్థ కులం ఓట్ల కంటే తక్కువ. 


అంతిమంగా నాకు నా రాజకీయ గురువు చెప్పింది ఏమంటే– ‘డాక్టర్ సాబ్! నా విజన్ అమలు కావాలంటే అధికారంలో ఉండాలి. అధికారంలో ఉండాలంటే ఎమ్మెల్యేలు గెలవాలి. ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తుంది. బీసీలు ఓటు బ్యాంకు కారు. వారికి సంఖ్య ఉన్నా, సఖ్యత ఉండదు. చివరకు నువ్వు కూడా రాజకీయంగా నష్టపోతావు. నాకు ఎంత చేయాలని ఉన్నా, అసెంబ్లీలో సంఖ్యని బట్టి అంతిమ నిర్ణయాలు ఉంటవి’.


బహుజనులు, బీసీలు అంతిమంగా ఓటు బ్యాంకు అయ్యేంతవరకు ఎవరూ సీట్లు ఇవ్వరు. బహుజనుల్లో ఓటరు చైతన్యం, సామాజిక స్పృహ వచ్చేదాకా, తాకట్టు గుణం పోయేదాకా, మైకుల్లో ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా అసెంబ్లీ ముఖ చిత్రం ఏ మాత్రం మారదు. ముఖ్యమంత్రులు ఎవరూ అన్నది పక్కనపెట్టి, అత్యధిక ఎమ్మెల్యేలు కావడానికి ఇప్పటికే విజయం సాధించిన వర్గాలను అనుసరించి ప్రగతి సాధించడమే శరణ్యం.

డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

మాజీ ఎంపీ, బోనగిరి

Updated Date - 2022-06-17T06:25:41+05:30 IST