విద్యుత్‌ లైన్లతో విపత్తు

ABN , First Publish Date - 2021-07-26T04:20:36+05:30 IST

పామాయిల్‌ తోటల్లో విద్యుత్‌ లైన్లు అస్తవ్యస్తంగా ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో ముదురెడ్డిపల్లి, లేత పామాయిల్‌ తోటలు దాదాపు 15వేల ఎకరాల్లో సాగవుతున్నాయి.

విద్యుత్‌ లైన్లతో విపత్తు
విద్యుత్‌ తీగలు రాపిడికి గురయి కాలిపోయిన పామాయిల్‌ తోట

కాలిపోతున్న పామాయిల్‌ చెట్లు

అస్తవ్యస్త విద్యుత్‌ లైన్ల నిర్మాణం వల్లే

నష్టపోతున్న రైతులు.. మోయలేని భారంగా షిఫ్టింగ్‌ ఛార్జీలు

దమ్మపేట, జూలై 25: పామాయిల్‌ తోటల్లో విద్యుత్‌ లైన్లు అస్తవ్యస్తంగా ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో ముదురెడ్డిపల్లి, లేత పామాయిల్‌ తోటలు దాదాపు 15వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, పాల్వంచ, సత్తుపల్లి, అన్నపురెడ్డి మండలాల్లో దాదాపు 40 వేలకు పైగా పామయిల్‌ తోటలు విస్తరించి ఉన్నాయి. అస్తవ్యస్తంగా విద్యుత్‌ లైన్ల వల్ల తోటలు కాలిపోతున్నా యి. తోటల్లో చెట్లు ఆకులు విద్యుత్‌ తీగలకు తగలడంతో తరుచూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో విద్యుత్‌ అధికారులు సమస్య పరిష్కరించేందుకు చెట్లను నరికివేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పామాయిల్‌ చెట్లు చనిపోతున్నాయి. దీంతో రైతులకు ఆర్థికంగా నష్టపోతున్నారు. విద్యుత్‌ తీగల వల్ల నాయుడుపేటలో దొడ్డా రమేష్‌కు చెందిన పాయిల్‌ తోటలో దాదాపు 100కు పైగా చెట్లు కాలిపోయాయి. డ్రిప్‌ సైతం కాలిపోయింది. దీంతో రైతుకు దాదాపు రూ. రెండు లక్షల నష్టం వాటిల్లింది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం సంభవించాయి. గతంలో భూములు ఖాళీగా ఉన్నప్పుడు అవగాహన లేకుండా విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేయటం, ప్రస్తుతం తోటలు పెరగడంతో ఈ పరిస్ధితి ఏర్పడింది. ఒక్కో తోటలో నాలుగు నుంచి ఐదు విద్యుత్‌ లైన్లు ఉండటం, గతంలో రైతులు తోటలు వేసుకునేప్పుడు అవగాన లేకపోవటం ఇప్పుడు సమస్యగా మారింది. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్‌ వైర్లు తొలిగించాలంటే విద్యుత్‌ శాఖ అధికారుల అనుమతులు, రవాణా చెల్లించటం రైతులకు భారంగా మారింది. 

లైన్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి

ఆలపాటి రాంచంద్రప్రసాద్‌ రైతు, పామాయిల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

చాలామంది రైతుల పామాయిల్‌ తోటల్లో విద్యుత్‌ లైన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్ని తోటల్లో ఎక్కువగా వైర్లు ఉండటం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక వేళ రైతులు కరెంట్‌ వైర్లను తొలిగించాలంటే విద్యుత్‌ శాఖకు షిప్టింగ్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. దీనికి అనుమతి రావాలన్నా చాలా సమయం పడుతోంది. దీంతో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోంది. ఈసమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం.

మోటార్లు కాలిపోతున్నాయి

కోటగిరి బుజ్జిబాబు, పామాయిల్‌ రైతు, గండుగులపల్లి 

తోటల మధ్యలో విద్యుత్‌ లైన్లు ఉండటంతో తరచూ కరెంట్‌ ట్రిప్‌ అవడంతో మోటర్లు కాలిపోతున్నాయి.  గెలలను కోసేందుకు కూలీలు కుడా రావటంలేదు. దీంతో ఆర్ధికంగా నష్టపోతున్నాం. విద్యుత్‌ శాఖాధికారులు చొరవ చూపి లైన్లు మార్చేలా చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో రైతులు మరింత నష్టపోయే ప్రమాదముంది.

తీవ్రంగా నష్టపోయాను

దొడ్డా రమేష్‌, పామాయిల్‌ రైతు మొద్దులగూడెం

నేను నాలుగు ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేశాను. తోటలో విద్యుత్‌ వైర్లు రాపిడికి గురయి మంటలు వ్యాపించాయి. ఫలితంగా 100పైగా పామాయిల్‌ చెట్లు కాలిపోయాయి. వీటితో పాటు డ్రిప్‌ కూడా దగ్ధమైంది. దాదాపు రూ. రెండులక్షల మేర నష్టం వాటిల్లింది. రైతులకు విద్యుత్‌ శాఖ షిప్టింగ్‌ చార్జీలు లేకుండా లైన్లు మార్చుచునే వెసలుబాటు కల్పించాలి. 


Updated Date - 2021-07-26T04:20:36+05:30 IST