కోతలు తప్పవా!?

Oct 13 2021 @ 23:04PM

బొగ్గు కొరత.. విద్యుదుత్పత్తి ప్రభావం

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అమలు

దుర్వినియోగం చేయొద్దని విజ్ఞప్తి 


నెల్లూరు (జడ్పీ), అక్టోబరు 13 : దేశంలో విద్యుత ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో ఉత్పత్తిపై ప్రభావంతో చూపుతోంది. ఇది జిల్లాపైనా పడనుంది. అధికారికంగా కరెంటు కోతలు విధించనప్పటికీ అనధికారికంగా గ్రామీణ ప్రాంతాల్లో కోతలు మొదలయ్యాయి. నిర్ధిష్ట సమయం ప్రకటించకపోయినా ఒక్కో రోజు ఒక్కో సమయంలో కరెంటు సరఫరాను ఆపేస్తున్నారు.  ఉదయగిరి మండలంలో మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి 4గంటల వరకు, రాత్రి 12 నుంచి 2గంటల వరకు అనధికారికంగా కరెంటు సరఫరా కట్‌ చేశారు. ఇక చేజర్ల మండలంలో మంగళవారం సాయంత్రం 6.45 నుంచి 8.15 గంటల వరకు అనధికార కోత విధించారు. ఇలా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి కోతలను విధిస్తున్నారు. 


రోజుకు 14 మిలియన యూనిట్ల డిమాండ్‌


జిల్లాలో 11లక్షల మేర విద్యుత కనెక్షన్లు ఉండగా, రోజుకు 14 మిలియన యూనిట్ల మేర కరెంటు వాడకం జరుగుతోంది. జిల్లాకు రోజువారి కోటా 12 మిలియన యూనిట్ల నుంచి 13 మిలియన యూనిట్ల వరకు ఉండగా జిల్లా అవసరాలు అంతకుమించి ఉండటంతో దానికితగ్గట్టుగా  అధికారులు విద్యుత సరఫరా చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గిపోవడం దిగుమతులు పెద్దగా లేకపోవడంతో విద్యుత ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా అనధికార కోతలను విధిస్తున్నారు. 


పీక్‌ సమయంలో..


జిల్లాలో అధికారికంగా విద్యుత కోతలు లేకపోయినా బొగ్గు సరఫరా జరగకపోతే విద్యుత సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని భావిస్తున్న అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అనధికార కోతలను విధిస్తుండగా పీక్‌ సమయమైనా సాయంత్రం 6 నుంచి రాత్రి 10గంటల వరకు విద్యుతను పొదుపు చేయాలని ఏసీలను వినియోగించవద్దని అధికారికంగా విన్నవిస్తున్నారు. దీనిద్వారా విద్యుత సరఫరాకు ప్రమాద ఘంటికలు ఉన్నాయని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు అవుతోంది. అయితే జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతుండడంతో కొంత ఊరట నిస్తోంది. దసరా తర్వాత బొగ్గు సరఫరా జరగకపోతే వర్షాకాలంలోనే అధికారిక కోతలు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. 


అవసరాన్ని బట్టి నిలిపి వేస్తున్నాం


కరెంటు ఉత్పత్తి తగ్గిపోతుండటంతో అవసరాన్ని బట్టి  గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడా అనధికారిక కోతలు విధిస్తున్నాం. సర్దుబాటులో భాగంగానే ఈ కోతలు ఉంటున్నాయి. 

- విజయ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఈ 


ఒడిదుడుకుల్లో ‘థర్మల్‌’


ముత్తుకూరు, అక్టోబరు 13 : బొగ్గు కొరతతో విద్యుత్‌ వెలుగులు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంతోపాటు (జెన్‌కో) సెంబ్‌కార్ప్‌ థర్మల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో రెండు విద్యుత్‌ కేంద్రాలు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. జెన్‌కో థర్మల్‌ కేంద్రం రెండు యూనిట్లలో 800 మెగావాట్ల చొప్పున 1600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కాగా, సెంబ్‌కార్ప్‌ థర్మల్‌ కాంప్లెక్స్‌లోని రెండు విద్యుత్‌ కేంద్రాల్లో 660 మెగావాట్ల చొప్పున 1320 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగాల్సి ఉంది. సెంబ్‌కార్ప్‌లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరుగుతుండగా, జెన్‌కో మాత్రం ఒడిదుడుకులకు గురవుతోంది. తొలుత పూర్తిస్థాయి సామర్థ్యంతో విద్యుత్‌ ఉత్పత్తి  జరిగినా, క్రమేణా పలు ఇబ్బందులతో ఉత్పత్తి తగ్గుతూ వచ్చింది. గత ఏడాది బొగ్గుకొరతతో ఒక యూనిట్‌ను పూర్తిగా మూసివేశారు. అంతకముందు ఏడాది ఒక దశలో బొగ్గు లేక రెండు యూనిట్లు మూత పడ్డాయి. నాలుగు నెలల పాటు కొనసాగిన ఈ పరిస్థితుల్లో జెన్‌కో ఎండీ, డైరెక్టర్ల జోక్యంతో బొగ్గు లోటును పూడ్చుకుంటూ నెమ్మదిగా ఉత్పత్తిని ప్రారంభించారు. గత ఏడాది బొగ్గు కొరత కారణంగా రెండు నెలల పాటు ఒక్క యూనిట్‌లోనే విద్యుదుత్పత్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బొగ్గు కొరత కారణంగా జెన్‌కోలోని రెండు యూనిట్లలో  1000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. థర్మల్‌ కేంద్రం బొగ్గు యార్డులో లక్షా యాభై వేల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. కష్ణపట్నం పోర్టుకు త్వరలో మరో నౌక ద్వారా బొగ్గు రానున్నది. రోజువారీ విద్యుత్‌ ఉత్పత్తికి ఇబ్బంది లేకపోయినా, పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.