పవర్‌ప్లాంట్‌లో ప్రమాదం

Sep 26 2021 @ 00:29AM

కాకినాడ క్రైం, సెప్టెంబరు 25: కాకినాడ సముద్రతీరంలో ఉన్న జీఎంఆర్‌ పవర్‌ప్లాంట్‌ కూలింగ్‌ యూనిట్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే పవర్‌ప్లాంట్‌ మనుగడలో లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. వివరాల్లోకి వెళితే... బీచ్‌రోడ్‌లోని మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న జీఎంఆర్‌ పవర్‌ ప్లాంట్‌ నష్టాలు చవిచూడడంతో 2013 నుంచి సంస్థ కార్యకలాపాలను ఆపేసింది. అప్పటి నుంచి ఆ పరిశ్రమ మూతపడింది. అయితే ప్లాంట్‌ అందులోని పరికరాలను ఒక్కొ క్కటిగా వర్కర్లు తొలగించి అక్కడ నుంచి తరలిస్తున్నారు. కాగా పవర్‌ప్లాంట్‌  సముదాయం ఎక్కువగా ఫైబర్‌గ్లాస్‌, ప్లాస్టిక్‌ పరికరాలతో నిర్మితమై ఉంది. ఈ క్రమంలో శనివారం కార్మికులు తొలగింపు ప్రక్రియలో భాగంగా కూలింగ్‌ యూనిట్‌లో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా నిప్పులు చెలరేగి ఒక్కసారిగా దట్టమైన పొగలు అలముకుని  మంటలు చెలరేగి వ్యాప్తి చెందాయి.  సముద్రతీర ప్రాంతంలోని ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న సాలిపేట ఏడీఎఫ్‌వో బి.ఏసుబాబు సిబ్బందితో మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ప్లాస్టిక్‌, ఫైబర్‌ మండుతుండడంతో మంటలు అదుపులోకి రాకపోవడంతో జగన్నాథపురం, ఎన్‌ఎఫ్‌సీఎల్‌, కేఎస్‌పీఎల్‌ సంస్థలు  మరో మూడు అగ్ని మాపక శకటాలను రప్పించి మంటలను అదుపు చేశారు. పోర్టు సీఐ శ్రీనివాస్‌, ఏఎస్‌ఐ ప్రసాద్‌ సహాయక చర్యలు చేపట్టారు.  ఏడీఎఫ్‌ ఏసుబాబు మాట్లాడుతూ ఆస్తి నష్టం రూ.2 లక్షలు ఉంటుందని వెల్లడించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.